వరంగల్, ఏప్రిల్ 19 : నగరాభివృద్ధే కాదు ఆకలితో ఉన్న పేదల కడుపు నింపాలన్న సంకల్పంతో గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ అన్నపూర్ణ పథకానికి శ్రీకారం చుట్టింది. ఐదు రూపాయలకే భోజనం అందిస్తోంది. ప్రతి రోజూ మధ్యాహ్నం 12 గంటలకు నగరంలోని 12 సెంటర్లలో ఐదు రూపాయల భోజన కౌంటర్లు ప్రారంభం అవుతాయి. రుచికరమైన వంటలు ఘుమఘుమలాడుతుంటాయి. ఆ సమయానికి వందల సంఖ్యలో అన్నపూర్ణ కేంద్రాల వద్ద పేదలు క్యూ కడుతుంటారు. ఇలా ఐదున్నరేళ్లుగా జీడబ్ల్యూఎంసీ ఆధ్వర్యంలో ఐదు రూపాయలకే భోజనం అందిస్తున్నారు. హరేరామ హరే కృష్ణ సంస్థకు చెందిన అక్షయ పాత్ర ఫౌండేషన్ వారు గ్రేటర్ చేపట్టిన ఐదు రూపాయల భోజన పథకాన్ని నిర్వహిస్తున్నారు.
2017 జూన్ నుంచి..
గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ చేపట్టిన అన్నపూర్ణ పథకం లక్షల మంది కడుపు నింపుతోంది. ఇప్పటి వరకు సుమారు 80 లక్షల మందికి భోజనం వడ్డించారు. 2017 జూన్ నుంచి గ్రేటర్ పరిధిలో ఐదు రూపాయలకే భోజనం అందిస్తున్నారు. ప్రతి రోజూ నాలుగు వేల మందికి పైగా భోజనం అందిస్త్తున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు అన్నపూర్ణ కేంద్రాలు ప్రారంభమవుతాయి. ఐదు రూపాయలు చెల్లిస్తే రుచికరమైన భోజనం వడ్డిస్తున్నారు. పేపర్ ప్లేట్, అన్నం, ఒక కూర, ఆకుకూర పప్పు, పచ్చడి, సాంబర్, వాటర్ ప్యాకెట్ అందిస్తారు. గతంలో గ్రేటర్ కమిషనర్లు, ఎంహెచ్వోలు, అధికారులు ఐదు రూపాయల భోజనం చేసి సంతృప్తి వ్యక్తం చేశారు. కరోనా కాలంలో అన్నపూర్ణ ఐదు రూపాయల భోజనం వేలాది మంది కడుపు నింపింది. లాక్డౌన్లో నిరాటంకంగా భోజనం అందించారు.
ఒక భోజనానికి రూ.26.25 ఖర్చు
అన్నపూర్ణ ఐదు రూపాయల భోజన పథకంపై కార్పొరేషన్ ఇప్పటి వరకు సుమారు రూ. 18 కోట్లు ఖర్చు చేసింది. ఒక భోజనానికి రూ.24.25 ఖర్చు అవుతోంది. లబ్ధిదారుడు ఐదు రూపాయలు చెల్లిస్తే కార్పొరేషన్ రూ. 19.25 చెల్లిస్తోంది. గత ఏడాది జూన్ నుంచి భోజనం రూ.26.25 అయ్యింది. పెరిగిన నిత్యావసర సరుకుల ధరల నేపథ్యంలో అధికారులు అక్షయ పాత్ర ఫౌండేషన్ వారికి ఒక భోజనానికి రూ. 26.25 చెల్లిస్తున్నారు.
ఎనుమాముల మార్కెట్లో అధునాతన వంటశాల
అన్నపూర్ణ పథకాన్ని నిర్వహిస్తున్న అక్షయ పాత్ర ఫౌండేషన్ వారు ఎనుమాముల మార్కెట్లో అధునాతన వంటశాలను నిర్మించారు. ఒకే సారి ఐదు వేల మందికి వంటలు తయారు చేసే సామర్థ్యం ఉందని అక్కడి నిర్వాహకులు చెబుతున్నారు. కూరగాయలు కోయడం దగ్గరి నుంచి అన్నం, కూరలు, సాంబర్ అన్ని వంటలు ఆధునిక యంత్రాలపైనే చేస్తున్నారు. పరిశుభ్రమైన వాతావరణంలో భోజనం తయారు చేస్తున్నారు.
మరో రెండు కేంద్రాల ఏర్పాటుకు సన్నాహాలు..
గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 12 అన్నపూర్ణ కేంద్రాలు పనిచేస్తున్నాయి. మరికొన్ని చోట్ల కేంద్రాలు ఏర్పాటు చేయాలని ప్రజల నుంచి విజ్ఞప్తులు వస్తున్నాయి. ప్రస్తుతం గ్రేటర్ పరిధిలోని ఎనుమాముల మార్కెట్, సీకేఎం ప్రసూతి దవాఖాన, వరంగల్ బస్ స్టేషన్, అండర్ బ్రిడ్జి, ఎంజీఎం దవాఖాన, హనుమకొండ ప్రభుత్వ ప్రసూతి దవాఖాన, జిల్లా పరిషత్ కార్యాలయం, కాజీపేట రైల్వేస్టేషన్, కాకతీయ యూనివర్సిటీ క్రాస్ రోడ్, అదాలత్ సెంటర్, సెంట్రల్ లైబ్రరీ, రీజినల్ లైబ్రరీలో అన్నపూర్ణ పథకం కేంద్రాలు ఉన్నాయి. దీంతో పాటు శంభునిపేట జంక్షన్, హసన్పర్తిలో కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు జీడబ్ల్యూఎంసీ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.