హనుమకొండ చౌరస్తా, ఆగస్టు 31: నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా హనుమకొండలోని స్పందన మానసిక దివ్యాంగుల ఆశ్రమంలోగల గణనాథుడిని అనురాగ్ సొసైటీ చైర్మన్, కాకతీయ విశ్వవిద్యాలయం పాలకమండలి సభ్యులు డాక్టర్ కె.అనితారెడ్డి దర్శించుకుని మానసిక దివ్యాంగులతో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా అనితారెడ్డి మాట్లాడుతూ గణనాథుడి ఆరాధనతో ప్రతి ఇంట సంతోషం, ఐశ్వర్యం, అభివృద్ధి నిండాలని, ఈ పండుగ మనలో భక్తి, శక్తి మాత్రమే కాక ఐకమత్యం, స్నేహభావాన్ని పెంపొందిస్తుందన్నారు.
కల్మషమం ఎరుగని ఈ మానసిక దివ్యాంగుల సేవ విశ్వమానవ సేవ అని ఆ గణనాథుని ఆశీర్వాదం వీరికి ఉండాలన్నారు. పర్యావరణానికి హాని కలగకుండా మట్టి గణపతులను ప్రతిష్టించాలని, ప్రతి ఒక్కరూ భక్తి, పూజలతో పాటు సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటూ సమాజానికి మార్గదర్శకంగా నిలవాలన్నారు. అనంతరం అన్నప్రసాద వితరణ నిర్వహించారు. ఈ పూజ కార్యక్రమంలో సుచరిత, రాజేందర్రెడ్డి, ఆర్వికారెడ్డి, వసుధ, హరిత, పిల్లలు పాల్గొన్నారు.