హనుమకొండ, మార్చి 23 : తమ డిమాండ్లు నెరవేర్చాలని తెలంగాణ అంగన్వాడీ టీచర్స్, హెల్పర్స్ యూనియన్ సీఐటీయూ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా సోమవారం మహబూబాబాద్, ములుగు, జనగామ హనుమకొండ జిల్లాల్లో అంగన్వాడీలు కదంతొక్కారు. కనీస వేతనం రూ. 26వేలు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఆయా జిల్లాల కలెక్టరేట్ల వద్ద ధర్నాలు నిర్వహించారు. కాగా, హనుమకొండ కలెక్టరేట్ వద్ద అంగన్వాడీలు చేపట్టిన ధర్నా ఉద్రిక్తతకు దారి తీసింది. తమ న్యాయమైన డిమాండ్ నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ హనుమకొండ ఆర్ట్స్ కాలేజీ ఆడిటోరియం నుంచి వందలాది మంది అంగన్వాడీలు ర్యాలీగా కలెక్టరేట్‌కు చేరుకున్నారు.
రెండు గేట్ల ఎదుట బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కలెక్టర్ బయటికి రావాలని నినాదాలు చేస్తూ గేట్లను తోసుకొని లోపలికి వెళ్లేందుకు ప్రయత్నం చేయగా పోలీసులు అడ్డుకున్నారు. అంగన్వాడీలు, పోలీసులకు మధ్య తోపులాట, వాగ్వాదం జరిగింది. దీంతో కొంతసేపు అక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ట్రాఫిక్‌కు ఇబ్బంది కలిగింది. సుబేదారి సీఐ రంజిత్‌కుమార్ ప్రత్యేక పోలీసు బలగాలతో కలెక్టరేట్‌కు చేరుకొని అంగన్వాడీ యూనియన్ గౌరవాధ్యక్షుడు, సీఐటీయూ జిల్లా కార్యదర్శి రాగుల రమేశ్‌ను బలవంతంగా అరెస్ట్ చేసి పోలీసు వ్యాన్ ఎకించడంతో ఒక్కసారిగా అంగన్వాడీలు వ్యానును చుట్టముట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
నిర్బంధాలు ఆపాలంటూ రోడ్డుపై బైఠాయించారు. ఈ క్రమంలో పోలీస్ సిబ్బంది మిగతా అంగన్వాడీ నాయకులను అరెస్టు చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా రాగుల రమేశ్ మాట్లాడుతూ.. బడ్జెట్ సమావేశాల్లో అంగన్వాడీలకు కనీస వేతనం రూ.26వేలు చెల్లించేలా తీర్మానం చేయాలన్నారు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ రూ.2 లక్షలు ఇస్తామని హామీ ఇచ్చి పది నెలలు కావొస్తున్నదని, ఇప్పటికి 8 మంది అంగన్వాడీలు చనిపోయారని, దీనికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.
ప్రభుత్వ పాఠశాలల మాదిరిగానే మార్చి16 నుంచి అంగన్వాడీ సెంటర్లకు ఒంటిపూట బడులు నిర్వహించాలని, వేసవి సెలవులు అంగన్వాడీ టీచర్లు, హెల్పర్‌కు ఒకేసారి ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు మెట్టు రవి, అంగన్వాడీ యూనియన్ సీఐటీయూ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కే రమాదేవి, కలకోట్ల జోత్స్న, నాయకులు కె.జమున, శ్రీలేఖ, దుర్గం రజిత, అనిత, ప్రేమలత, సమ్మక, రమాదేవి, స్వప్న, హైమావతి, ఉమాదేవి, కిరీట, శిల్ప, మాధవి, కోమలతోపాటు అంగన్వాడీలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.