బయ్యారం, అక్టోబర్ 14 : తల్లిలేని మనుమరాలికి పెండ్లి చేసి రెండేండ్లవుతున్నా కల్యాణలక్ష్మీ పథకం డబ్బులు రాక వృద్ధ దంపతులు అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. మంగళవారం తహసీల్దార్ ఎదుట తమ గోడు వెల్లబుచ్చారు. వివరాలిలా ఉన్నాయి.. బయ్యారం మండల కేంద్రానికి చెందిన తుపాకల వెంకటేశ్వర్లు, రమ దంపతులకు కుమార్తె మౌనిక పదేండ్ల వయస్సులోనే తల్లి మృతి చెందడంతో నా నమ్మ అయిలమ్మ, తాతయ్య వెంకటయ్య పెంచి పెద్ద చేశారు.
డిసెంబర్ 15, 2003లో వివాహం చేశారు. అనంతరం జనవరి 2024న కల్యాణలక్ష్మి కోసం దరఖాస్తు చేసుకున్నారు. పెండ్లికి తెచ్చిన అప్పులు కట్టుకుందామనుకున్న వృద్ధ దంపతులు పలు మార్లు తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరిగినా చెక్కు రాలేదు. ఈ క్రమంలో మంగళవారం తహసీల్దార్ నాగరాజును కలిసి తమ గోడును వినిపించారు.
స్పందించిన ఆయన ఆరా తీయగా ఈ ఏడాది ఫిబ్రవరిలో మౌనిక పేరు మీద కల్యాణలక్ష్మి చెక్కు మంజూరు కాగా, డబుల్ చెక్కు వచ్చిందని ఆర్డీవో ఆఫీస్కు రిటన్ పంపినట్లు గుర్తించారు. ఇంత వరకు తమకు కల్యాణలక్ష్మి అందలేదని, చెక్కు వచ్చిందని ఎవరూ చెప్పలేదని వృద్ధ దంపతులు వాపోయారు. పూర్తి వివరాలు సేకరించి చెక్కు అందేలా చూస్తామని తహసీల్దార్ తెలిపారు.