హనుమకొండ, జనవరి : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వర్గీకరణను సమర్థిస్తూ తక్షణమే సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేయాలని స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి డిమాండ్ చేశారు. ఎస్సీ వర్గీకరణ, దళితబంధు అమలుపై ఎంపీ పసునూరి దయాకర్, జడ్పీ చైర్మన్ సుధీర్‌కుమార్‌తో కలిసి మంగళవారం హనుమకొండ నక్కలగుట్టలోని హరిత కాకతీయ హోటల్లో విలేకరులతో మాట్లాడారు. వర్గీకరణ విషయంలో మాదిగ దండోరా ఆధ్వర్యంలో 30 ఏండ్లుగా ఆందోళనలు కొనసాగుతుండగా, మొదటినుంచీ బీఆర్ఎస్ మద్దతు తెలుపుతున్నట్లు చెప్పారు. ఎస్సీ వర్గీకరణ చేయాలని మాజీ సీఎం కేసీఆర్, తాను కలిసి వెళ్లి కేంద్రానికి పలుమార్లు విజ్ఞప్తి గుర్తుచేశారు. ఎమ్మార్పీఎస్ కొన్నేళ్లుగా ఉద్యమం చేపట్టి నాటి ప్రభుత్వాలపై ఒత్తిడి తెచ్చినట్లు తెలిపారు. దీంతో రెండు తెలుగు రాష్ర్టాల్లోని అన్ని రాజకీయ పార్టీలు సైతం ఎస్సీ వర్గీకణను సమర్థించి శాసనసభల్లో ఏకగ్రీవ తీర్మానాలు చేసి కేంద్రానికి పంపగా రాష్ట్రపతి ఆమోదంతో 2000 నుంచి 2004 సంవత్సరం వరకు అమలు చేస్తే కొందరు వ్యతిరేకించారని తెలిపారు. సుప్రీంకోర్టును ఆశ్రయించగా వర్గీకరణ అంశం రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలో లేదని, పార్లమెంట్ ఆమోదంతో చేయాలని అభిప్రాయపడిందన్నారు. 2021లో పంజాబ్‌లో ఓ ఐదుగురు సభ్యుల ధర్మాసనం వర్గీకరణను సుప్రీంకోర్టుకు బదిలీ చేసిందని, ఇందుకు ఏడుగురు సభ్యులు ఉండే లార్జ్ బెంచ్‌ను నియమించారని తెలిపారు. ఈ బెంచ్ ఈ నెల 17నుంచి విచారణ చేపట్టాల్సి ఉండగా, అనివార్య కారణాలతో వాయిదా పడినట్లు తెలిసిందన్నారు. ఎస్సీ వర్గీకరణ సుప్రీంకోర్టు పరిశీలనలో ఉన్న దృష్ట్యా ప్రభుత్వాలు అఫిడవిట్ దాఖలు చేస్తే వర్గీకరణకు అనుకూలంగా ఫలితాలు వచ్చే అవకాశం ఉందని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు డబ్బులకు వెనుకాడకుండా పేరున్న అడ్వకేట్లతో వాదనలు వినిపించాలని డిమాండ్ చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణను చేస్తుందనే నమ్మకం లేదని, పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో దళిత, దళిత ఉపకులాల ఓట్ల కోసమే ఆ పార్టీ నేతలు ఎస్సీ వర్గీకరణ అంటున్నారని ఆరోపించారు. గతంలో అనేక మార్లు హామీ ఇచ్చిన మోదీ ప్రభుత్వం దళితులను మోసం చేసిందన్నారు. బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే పార్లమెంట్లో చట్టం తీసుకురావాలని డిమాండ్ చేశారు. సీఎం కేసీఆర్ తెలంగాణలో దళితులకు ఆర్థిక చేయూత అందించి ఉపాధి అవకాశాలు కల్పించేందుకు దళితబంధు పథకాన్ని ప్రారంభించారని తెలిపారు. ఒక్కో నియోజకవర్గంలో 1,100 మంది చొప్పున చేసి ఒక్కొక్కరి ఖాతాలో రూ.9.90లక్షలు జమ చేయగా, వీటిలో కొందరు అవసరం మేరకు డబ్బులు తీసుకోగా, మిగతా డబ్బు వారి ఖాతాల్లో మిగిలిందన్నారు. ఎన్నికల కోడ్‌తో డబ్బులు డ్రా చేయలేదని, బ్యాంకు ఖాతాలను ఫ్రీజ్ చేశారని, తద్వారా 11వేల మందికి సంబంధించి రూ.436కోట్లు బ్యాంకుల్లో ఉన్నాయన్నారు. బ్యాంకు ఖాతాల ఫ్రీజింగ్‌ను వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం దళితబంధు పథకాన్ని కొనసాగిస్తుందా లేదా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మ్యానిఫెస్టోలో అంబేద్కర్ అభయహస్తం పేరుతో ప్రతి లబ్ధిదారుకు రూ.12లక్షలు అందిస్తామని పొందుపరిచిందని, పేరు మార్పుతో తమకు ఎలాంటి ఇబ్బంది లేదని, నిరుపేద దళితులకు న్యాయం జరగాలని స్పష్టం చేశారు. 2వ విడతలో కలెక్టర్ల ద్వారా ఎంపిక చేసిన లబ్ధిదారులకు దళితబంధు పథకం కొనసాగించాలని డిమాండ్ ఓట్లు వేసిన దళితుల నోట్లో కాంగ్రెస్ పార్టీ మట్టికొట్టిందన్నారు.