ములుగు, అక్టోబర్ 9 (నమస్తేతెలంగాణ) : జిల్లాలోని 9 మండలాలకు 9 అంబులెన్స్‌లు ఉండగా నిత్యం రోగులను ములుగు ప్రభుత్వ దవాఖానకు తీసుకువస్తున్నారు. ప్రథమ చికిత్స అనంతరం ఇక్కడి వైద్యులు ఎంజీఎం హాస్పిటల్‌కు రెఫర్ చేస్తున్నారు. దీంతో 108 వాహనాలు రికాం లేకుండా తిరుగుతున్నాయి. ములుగు ప్రభుత్వ దవాఖానలో ఉండే అంబులెన్స్‌కు నిర్వహణ ఖర్చులు లేక సేవలు అంద డం లేదు. 2016లో రాజ్యసభ సభ్యుడిగా పనిచేసిన గరికపాటి మోహన్‌రావు తన నిధుల నుంచి అంబులెన్స్ కేటాయించగా అప్పటి నుంచి సేవలందిస్తున్నది.
ఎంజీఎం దవాఖాన కు రోగులను తరలించే సమయంలో ఈ వా హనాన్ని కూడా వినియోగిస్తున్నారు. కలెక్టర్ నిధుల నుంచి ఏటూరునాగారం ఐటీడీఏ పీవో పర్యవేక్షణలో ఈ అంబులెన్స్‌కు ఇద్దరు పైలట్లను నియమించి వారికి వేతనాలతో పాటు నిర్వహణ, డీజిల్ ఖర్చులను చెల్లిస్తున్నారు. మూడు నెలల క్రితం ములుగు ప్రభుత్వ దవాఖాన వైద్య విధాన పరిషత్ నుంచి డీఎంఈకి బదిలీ అయింది. దీంతో అంబులెన్స్ నిర్వహణపై అధికారుల నిర్లక్ష్యం కొరవడింది.
అధికారుల నిర్లక్ష్యంతో మూడు నెలలుగా సిబ్బంది వేతనాలు, నిర్వహణ ఖర్చులు పెండింగ్‌లో పడ్డాయి. ఇటీవల వారం రోజుల క్రితం అంబులెన్స్ మరమ్మతుకు గురి కాగా ఐటీడీఏ అధికారులు నిధులు విడుదల చే యించారు. డీజిల్‌కు సరిపడా డబ్బులు లేకపోవడంతో సిబ్బంది ఎవరిని అడగాలో తెలియకుండా దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. కొన్ని సమయాల్లో రోగుల వద్ద నుంచి వసూళ్లు చేస్తున్నట్లు తెలిసింది. మరికొన్ని సమయాల్లో దవాఖాన అధికారులు డీజిల్ ఖర్చులు సమకూర్చుతున్నట్లు సమాచారం. ఐటీడీఏ అధికారుల ఆదేశాల మేర కు ఎట్టకేలకు గత నెల 27వ తేదీన అంబులెన్స్ నిర్వహ ణ ఖర్చులు, సిబ్బంది అటెండెన్స్ వివరాలను ములుగు దవాఖాన నుంచి పంపించారు.
అయితే అవుట్ సోర్సిం గ్ ఏజెన్సీ మారడంతో వేతనాల మంజూరు ప్రక్రియ ఆలస్యమవుతూ వస్తున్నది. ప్రతి రోజూ ములుగు దవాఖాన నుంచి 5 నుంచి 10మంది రోగులను వరంగల్ ఎంజీఎం దవాఖానకు తరలిస్తుండగా 108 వాహనాలు సరిపోకపోవడంతో పాటు ఇక్కడ అందుబాటులో ఉన్న అంబులెన్స్‌కు నిర్వహణ ఖర్చులు లేకపోవడంతో సేవ లు నిలిచిపోయి రోగులు ఇబ్బందులు పడుతున్నారు.