హనుమకొండ, డిసెంబర్ 19 : హనుమకొండ జిల్లా పౌరసరఫరా శాఖ కార్యాలయంలో అవినీతి రాజ్యమేలుతున్నది. ధాన్యం కొనుగోలు కేంద్రాల కేటాయింపులు, రైస్‌మిల్లుల ట్యాగింగ్, సీఎంఆర్ డెలివరీలో అధికారులు మిల్లర్లతో కుమ్మక్కై పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడుతున్నట్లు తెలుస్తున్నది. ఇందుకు రైస్ మిల్లర్స్ వెల్ఫేర్ అసోసియేషన్‌లోని ఓ ముఖ్య నాయకుడు కీలకపాత్ర వహిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. ఇటీవల విజిలెన్స్ అధికారులు అతడి మిల్లులో దాడులు చేసి ధాన్యం తక్కువ ఉందని గుర్తించినప్పటికీ చర్యలు తీసుకోకపోవడం అనుమానాలకు తావిస్తున్నది. ఈ క్రమంలో అదనపు కలెక్టర్ ఏసీబీకి పట్టుబడడంతో సివిల్ సప్లయ్ శాఖలో జరిగిన అవినీతి అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయని ప్రచారం జరుగుతున్నది. ఈ విషయంపై కలెక్టర్ స్నేహా శబరీష్ సీరియస్ అయి ఆ శాఖలోని ఉద్యోగులను సైతం బదిలీ చేసింది. అంతేగాక విచారణ చేపట్టి నివేదిక అందజేయాలని అధికారులను ఆదేశించినట్లు సమాచారం.
2024-25 యాసంగి, 2025-26 వానకాలం ధాన్యం కేటాయింపుల్లో ప్రభుత్వ నిబంధనలు పాటించడం లేదనే ఆరోపణలున్నాయి. సీఎంఆర్ పనితీరు, టెన్నేజ్ కెపాసిటీ, గోడౌన్ స్పేస్, బ్యాంకు గ్యారెంటీ అంశాలను పరిగణలోకి తీసుకోకుండా మిల్లలు కేటాయించినట్లు తెలుస్తున్నది. ఇందుకుగాను రైస్ మిల్లర్స్ అసోసియేషన్‌లోని ఓ ముఖ్య నాయకుడు అన్నీ తానై వ్యవహరించాడు. గత సీజన్లలో సీఎంఆర్ బాకీ ఉంటే బ్యాంక్ గ్యారెంటీ నుంచి కట్ చేసుకొని ధాన్యం కేటాయించాల్సి ఉండగా అవేవీ పాటించలేదని తెలిసింది. ఓ ముఖ్య నాయకుడి మిల్లుకు సంబంధించి రెండు వేల ధాన్యానికి బ్యాంకు గ్యారెంటీ ఇస్తే 6 వేల ధాన్యం కేటాయించినట్లు సమాచా రం. గత సీజన్లలో సీఎంఆర్ 80 శాతం ఇచ్చిన మిల్లులకు ట్యాగింగ్ చేయకుండా, 40 శాతం కూడా ఇవ్వ ని వాటికి ధాన్యం కేటాయించడంపై పలువురు మిల్లర్లు మండిపడుతున్నారు. ఈ వానకాలంలో ట్యాగింగ్ లేకుండా కొనుగోలు కేంద్రాల నుంచి నేరుగా రైస్ మిల్లలకు తరలిస్తున్నట్లు తెలిసింది. దీంతో రైతులు నష్టపోయే అవకాశం ఉంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
కలెక్టర్ ఆదేశాల మేరకు 2025-26 వానకాలం సంబంధించి రైస్‌మిల్లుల ట్యాగింగ్, బ్యాంకు గ్యారెంటీ, కేటాయించిన ధాన్యం తదితర అంశాల అవినీతి వ్యవహారంపై విచారణ చేస్తున్నాం. నిబంధనలకు విరుద్ధంగా ఏ మిల్లుకైనా ధాన్యం కేటాయిస్తే వాటిని తక్కువ ఉన్న మిల్లులకు తరలిస్తాం. రవాణా ఖర్చులను నిబంధనలు అతిక్రమించిన మిల్లర్ నుంచి వసూలు చేస్తాం. తుది నివేదికను అందజేసి, కలెక్టర్ నిర్ణయం మేరకు ముందుకు నడుస్తాం.
– ఎండీ వాజిద్ అలీ, డీసీఎస్వో హనుమకొండ
సివిల్ సప్లయి శాఖలో జరుగుతున్న అవినీతి అక్రమాలపై కలెక్టర్ స్నేహ శబరీష్ ప్రత్యేక దృష్టి సారించి డీఎస్వో కార్యాలయం సీనియర్ అసిస్టెంట్‌ను బదిలీ చేసింది. ఈ వానకాలంలో మిల్లులు, బ్యాంకు గ్యారెంటీ, కేటాయించిన ధాన్యం తదితర అంశాలపై విచారణ చేసి నివేదిక అందజేయాలని అధికారులను ఆదేశించినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో అక్రమాలకు పాల్పడ్డ మిల్లర్లు ఆందోళన చెందుతున్నట్లు సమాచారం.