జయశంకర్ భూపాలపల్లి, ఆగస్టు 1 (నమస్తే తెలంగాణ): పేద రైతు గూడుపై పెద్దలు ప్రతాపం చూపారు. అధికారం ఉంది కదా అని అడ్డగోలుగా కూల్చివేశారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని మంజూర్‌నగర్‌లో ఒక పేద రైతు తన పట్టా భూమిలో ఏర్పాటు చేసుకున్న పశువుల పాక కూల్చివేత వివాదాస్పదంగా మారింది. సమీపంలోని ఒక ప్రైవేటు వెంచర్‌కు లబ్ధి చేయడం కోసం అధికారపార్టీ నాయకులు, మున్సిపల్ అధికారులు ఇంతగా శ్రమించడమేంటని స్థానికులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
అసలు ఆ వెంచర్ ఎవరిది..?, వెనుక ఉండి చక్రం తిప్పుతున్నదెవరనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పట్టా భూమిలో ఇల్లు నిర్మించుకున్న చోటికి మున్సిపల్ అధికారులు రోడ్డు వేయడం కోసం తన పశువుల కొట్టం కూల్చివేయడం విడ్డూరంగా ఉందని బాధిత రైతు వాపోతున్నాడు.
గతంలో అవినీతి ఆరోపణలు ఎదుర్కోగా మున్సిపల్ కౌన్సిల్ అతడిని ప్రభుత్వానికి సరెండర్ చేసిందని, కాంగ్రెస్ నాయకులు మళ్లీ తిరిగి అతడిని తీసుకొచ్చి భూపాలపల్లిలో యథేచ్ఛగా అక్రమాలు పాల్పడుతున్నారని, ఇటీవల కమిషనర్‌కు బదిలీ జరిగినప్పటికీ ఎమ్మెల్యే కావాలని మళ్లీ ఇక్కడే కొనసాగిస్తున్నాడని బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు. అతడు వెళ్తే పెండింగ్‌లో ఉన్న భూ సెటిల్మెంట్ల పరిస్థితి ఏంటని, అతడిని రిలీవ్ చేయకుండా ఇక్కడే వాడుకుంటున్నారని బహిరంగంగా ప్రచారం జరుగుతున్నది. మంజూర్‌నగర్‌లోని ప్రధాన కూడలిలో ఉన్న ఈ భూమి విలువ విపరీతంగా పెరగడంతో అధికారపార్టీ నాయకులతో కలిసి పావులు కదుపుతున్నారని, ఈ క్రమంలో జరిగే డీల్‌లో ఎవరి వాటా ఎంతనే గుసగుసలు వినిపిస్తున్నాయి. లేకపోతే ఒక పేదోడి పశువుల కొట్టంపై ఎందుకు దాడి చేస్తారని చెప్పుకుంటున్నారు.
రూ.కోట్ల విలువైన కూరాకుల ఓదెలుకు చెంది 8 గుంటల భూమిపై కబ్జాదారుల కన్ను పడింది. తనకున్న ఎకరా 30 గుంటల భూమిలో మేం అన్నదమ్ములు పంచుకొని అమ్ముకోగా 20 గుంటలు కబ్జాకు గురైందని, 8 గుంటలు మాత్రమే తనకు మిగిలిందని, ఈ భూమిని సైతం కబ్జా చేసేందుకు రోడ్డు పేరుతో కుట్రలు జరుగుతున్నాయని బాధితుడు ఓదెలు తెలిపాడు.
ప్రధాన రహదారి నుంచి తన ఇంటి వరకు, తన ఇల్లు అడుగు, బర్ల కొట్టం కలిపి 8 గుంటలు ఉంటుందని, అయితే, తన ఇంటికి వచ్చే దారిని అక్రమార్కులు తగ్గిస్తున్నారని, వెంచర్ కోసం 40 ఫీట్ల రోడ్డు తీస్తూ తనకు అన్యాయం చేస్తున్నారని చెబుతున్నాడు. అక్కడ కేవలం 12 ఫీట్ల రోడ్డు మాత్రమే తీయాల్సి ఉండగా, ప్రైవేటు వెంచర్ కోసం 40ఫీట్ల రోడ్డు తీస్తున్నారని, ఈ క్రమంలోనే తన పశువుల పాకను కూల్చేశారని, తనకు ఇద్దరు కుమారులు ఉన్నారని, ఈ ఆస్తి తప్ప మాకు ఎలాంటి జీవనాధారం లేదని ఓదెలు కుటుంబ సభ్యులు విలపిస్తున్నారు. ఈ బాగోతంలో ఎమ్మెల్యే సమీప బంధువు ఉన్నట్లు చెప్పుకుంటున్నారు.