వర్ధన్నపేట, జనవరి 13 : దేశ ప్రజలంతా బీఆర్ఎస్ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్నారు. వర్ధన్నపేట క్యాంపు కార్యాలయంలో శుక్రవారం నలుగురు లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, ముగ్గురికి రూ.97వేల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశానికి స్వాతంత్రం వచ్చి 75 ఏళ్లు గడిచినా పాలకుల చిత్తశుద్ధి లేమితో దేశంలోని చాలామంది ప్రజలకు ఇప్పటికీ స్వచ్ఛమైన తాగునీరు అందడం లేదన్నారు.
అనేక జీవ నదులు ఉన్నా వ్యవసాయ రంగం ఇప్పటికీ సంక్షోభంలోనే ఉండడం విచారకరమన్నారు. దేశ ప్రజలకు సేవలందించాలనే లక్ష్యంతోనే టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చి సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వస్తున్నారని చెప్పారు. ఈ నెల 18న ఖమ్మంలో నిర్వహించనున్న భారీ బహిరంగసభ పార్టీ నేతలు, ప్రజాప్రతినిధులు, ప్రజలు పెద్ద సంఖ్యలో తరలి రావాలని కోరారు.
ఓటర్లకు అందుబాటులో ఉండాలి..
ఓటు ఉన్న ప్రతి ఒక్కరినీ పార్టీ కార్యకర్తలు కలిసి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరించాలని ఎమ్మెల్యే అరూరి సూచించారు. క్యాంపు కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. ప్రతి 100 ఓటర్లకు ఒక ఇన్చార్జిని నియమించామన్నారు. రానున్న రోజుల్లో ప్రజలంతా బీఆర్ఎస్కు అండగా నిలిచేలా కార్యకర్తలు నిరంతరం శ్రమించాలని కోరారు. ఇన్చార్జిలు వారి పధిలోని 100 మంది ఓటర్లకు ఎలాంటి సమస్య వచ్చినా పరిష్కరించాలని సూచించారు.
కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ అంగోత్ అరుణ, వైస్ చైర్మన్ ఎలేందర్‌రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ రాజేశ్‌ఖన్నా, మాజీ జడ్పీటీసీ పాలకుర్తి సారంగపాణి, మున్సిపల్ కౌన్సిలర్లు రాజమణి, రామకృష్ణ, రవీందర్, నాయకులు తూళ్ల కుమారస్వామి, ఎండీ అన్వర్, పూజారి రఘు, కంజర్ల మహేశ్, అజీం తదితరులు పాల్గొన్నారు.