హనుమకొండ చౌరస్తా, సెప్టెంబర్ 3 : హనుమకొండ జిల్లాలో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులందరికీ స్పోర్ట్ అథారిటీ ఆఫ్ తెలంగాణ ఆదేశానుసారంగా జిల్లా కలెక్టర్ అనుమతితో జిల్లా క్రీడాశాఖ ఆలిండియా సివిల్ సర్వీస్ టోర్నమెంట్ 2025-26లో భాగంగా జిల్లాస్థాయిలో 6న హనుమకొండలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియం(జేఎన్ఎస్)లో పోటీలను నిర్వహించనున్నట్లు జిల్లా యువజన క్రీడల అధికారి గుగులోతు అశోక్‌కుమార్ తెలిపారు.
అథ్లెటిక్స్, బాస్కెట్‌బాల్, షటిల్ బ్యాడ్మింటన్, క్రికెట్(మెన్స్), చెస్, క్యారమ్స్, ఫుటబాల(మెన్స్), హాకీ, కబడ్డీ, లాన్ టెన్నిస్, పవర్ లిఫ్టింగ్, స్విమ్మింగ్, టేబుల్ టెన్నిస్, వాలీబాల్, వెయిట్ లిఫ్టింగ్, రెజ్లింగ్, బెస్ట్ ఫిజిక్, యోగా, ఖోఖో వంటి క్రీడాంశాల్లో పోటీలు నిర్వహించనున్నట్లు, ఈ క్రీడల్లో పాల్గొనేందుకు ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న ఉద్యోగులు దరఖాస్తును జేఎన్‌ఎస్‌లోని డీవైఎస్వో కార్యాలయంలో 4న సాయంత్రం 5 గంటలలోపు అందజేయాలన్నారు.
6న ఉదయం 8 గంటలకు ఐడీకార్డులతో క్రీడాపోటీల ఎంపికలకు హాజరుకావాలన్నారు. ప్రతిభ కనబర్చిన క్రీడాకారులు 9, 10 తేదీల్లో వెయిట్ లిఫ్టింగ్, అథ్లెటిక్స్, బాస్కెట్‌బాల్, హాకీ క్రీడలకు సంబంధించినవారు జింఖానా గ్రౌండ్స్, చెస్, క్యారమ్స్ క్రీడలకు ఎల్బీ ఇండోర్ స్టేడియం, ఇతర క్రీడలకు లాల్బదూర్ స్టేడియంలో ఉదయం హాజరుకావాల్సి ఉంటుందని, ఇతర వివరాలకు అథ్లెటిక్స్ కోచ్ శ్రీమన్నారాయణను 94410 86556 నెంబర్లో సంప్రదించాలని కోరారు.