హనుమకొండ, జులై 01: అక్షర చిట్ఫండ్ బాధితులు హనుమకొండ అదాలత్ కోర్టు ముందు మంగళవారం నిరసన వ్యక్తం చేసారు. చిట్ఫండ్ చైర్మన్ పేరాల శ్రీనివాసరావు కోర్టుకు హాజరువుతున్నట్లు తెలుసుకొన్న బాధితులు కరీంనగర్, ఖమ్మం, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఇతర జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో కోర్టు వద్దకు చేరుకొన్నారు. తమను మోస చేసిన శ్రీనివాసరావును వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేసారు. చిట్ఫండ్ యాజమాన్యానికి వ్యతిరేఖంగా నినాదాలు చేసారు.
చిట్టీ, డిపాజిట్ల సమయం పూర్తయినప్పటికి డబ్బులు ఇవ్వకుండా గత కొన్ని నెలల నుంచి తప్పించుక తిరుగుతున్నాడని బాధితులు ఆగ్రహం వ్యక్తం చేసారు. మాకు న్యాయం చేయాలని పోరాటం చేస్తున్నప్పటికి ప్రభుత్వం పట్టించుకోవడం లేదని వాపోయారు. పేరాల శ్రీనివాసరావు పై పలుమార్లు ప్రజావాణిలో ఫిర్యాదు చేసినా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని బాధితులు ప్రశ్నించారు. కాయ కష్టం చేసుకొని దాచుకున్న డబ్బులు తిరిగి ఇవ్వకపోవడంతో గత మూడు, నాలుగు ఏండ్లుగా చెప్పులు అరిగేలా కార్యాలయం చుట్టు తిరుగుతున్నామని ఆవేదన వ్యక్తం చేసారు. చిట్టీలు, డిపాజిట్లు అంటూ చిట్ఫండ్ యాజమాన్యం మోసం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేసారు. తమ డబ్బులు తమకు ఇప్పించి న్యాయం చేయాలని బాధితులు వేడుకున్నారు.