జనగామ (నమస్తేతెలంగాణ), హనుమకొండ, భూపాలపల్లి రూరల్/ఖిలావరంగల్, జూలై 12 : విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఎస్ఎఫ్ఐ నేతృత్వంలో శుక్రవారం ఉమ్మడి వరంగల్ జిల్లాల్లో పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహించారు. జనగామ, హనుమకొండ, జయశంకర్ భూపాలపల్లి, వరంగల్ కలెక్టరేట్లను ముట్టడించారు. జనగామ కలెక్టరేట్లోకి చొచ్చుకెళ్లేందుకు విద్యార్థి నేతలు యత్నించారు. ఈ సందర్భంగా పోలీసులు, విద్యార్థులకు మధ్య తోపులాట జరగడంతో కొద్దిసేపు ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జనగామ జిల్లా కార్యదర్శి ధర్మబిక్షం మాట్లాడుతూ విద్యార్థులను ప్రభుత్వం చిన్నచూపు చూస్తున్నదని విమర్శించారు. పెండింగ్ స్కాలర్షిప్పులు, ఫీజు రీయింబర్స్ మెంట్ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు డీఎస్సీపై అనేక మాటలు చెప్పిన రేవంత్రెడ్డి, ఇప్పుడు వాయిదా వేయాలని ఆందోళన చేస్తున్న నిరుద్యోగులను నిర్బంధిస్తున్నారని ఆరోపించారు. ఇలాంటి చర్యలకు పాల్పడితే అసెంబ్లీతోపాటు సీఎం రేవంత్రెడ్డి ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు.