వరంగల్, ఆగస్టు 7 : నాలుగేళ్ల తర్వాత ల్యాండ్ రెగ్యులరైజేషన్ స్కీం(ఎల్ఆర్ఎస్)లో కదలిక వచ్చింది. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఎల్ఆర్ఎస్కు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో నగర పాలక సంస్థ పరిధిలో ఉన్న లక్ష వరకు పెండింగ్ దరఖాస్తులకు మోక్షం లభించనుంది. ఇప్పటికే అధికార యంత్రాంగం క్లియరెన్స్‌కు కసరత్తు చేస్తోంది. పెండింగ్ దరఖాస్తుల పరిశీలనకు 12 త్రీ మెన్ కమిటీలను ఏర్పాటు చేస్తున్నారు. నేడో, రేపో బృందాలను ప్రకటించి క్షేత్రస్థాయిలో ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిశీలన ప్రక్రియను చేపట్టేందుకు అధికారులు సన్నద్ధమవుతున్నారు.
బల్దియాకు భారీగా ఆదాయం
అసలే ఆర్థిక లేమితో సతమతమవుతున్న బల్దియాకు ఎల్ఆర్ఎస్ అందివచ్చిన అవకాశంగా మారింది. పెద్ద సంఖ్యలో పెండింగ్‌లో ఉన్న దరఖాస్తుల ద్వారా బల్దియాకు వందల కోట్లలో ఆదాయం సమకూరనుందని అధికారులు చెబుతున్నారు. దీంతో పాటు భవన నిర్మాణ అనుమతుల దరఖాస్తులు సైతం పెరిగే అవకాశం ఉంటుందని అంటున్నారు. ఎల్ఆర్ఎస్కు ఆమోదం లభిస్తే భవన నిర్మాణాలు చేపట్టేందుకు దరఖాస్తుదారులు సిద్ధంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఎల్ఆర్ఎస్కు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంతో బల్దియాకు భారీగా ఆదాయం వచ్చే మార్గం సుగమమైంది.
మూడు శాఖల అధికారులతో కమిటీలు
మూడు ప్రభుత్వ శాఖల అధికారులతో త్రీ మెన్ కమిటీలను ఏర్పాటు చేయనున్నారు. బల్దియా టౌన్ ప్లానింగ్, ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు త్రీ మెన్ కమిటీల్లో సభ్యులుగా ఉండనున్నారు. దరఖాస్తులను వీరు పరిశీలించి క్లియరెన్స్ ఇవ్వనున్నారు. రెవెన్యూ అధికారి ల్యాండ్ టైటిల్‌ను, ఇరిగేషన్ అధికారి చెరువు శిఖం, ఎఫ్టీఎల్, బల్దియా టౌన్ ప్లానింగ్ అధికారి మాస్టర్‌ప్లాన్ ప్రకారం రోడ్డు, తదితర అంశాలను పరిశీలించేలా కమిటీలను ఏర్పాటు చేస్తున్నారు. ముగ్గురు అధికారులు క్షేత్రస్థాయిలో దరఖాస్తులను పరిశీలించి గ్రీన్‌సిగ్నల్ ఇస్తేనే ఎల్ఆర్ఎస్కు ఆమోదం లభిస్తుంది. అనంతరం ఏసీపీ, టీపీవో స్థాయిలో పరిశీలించాక కమిషనర్ ఆమోదించనున్నారు. అయితే మూడు ప్రభుత్వ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయడంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పెద్ద సంఖ్యలో పెండింగ్‌లో ఉన్న ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిశీలనకు ఎంత సమయం పడుతుందోనన్న ప్రశ్న తలెత్తుతోంది.