హనుమకొండ చౌరస్తా, ఏప్రిల్ 23: సెల్ ఫోన్ వద్దు-పుస్తకం ముద్దు అని ప్రముఖ సైకాలజిస్ట్ డాక్టర్ అడ్డిగా శ్రీనివాస్ అన్నారు. కాకతీయ విశ్వవిద్యాలయ కేంద్ర గ్రంథాలయంలో బుధవారం కేంద్ర గ్రంథలయ మెంబర్, లైబ్రరీ సైన్సు విభాగాధిపతి డాక్టర్ బి.రాధికరాణి అధ్యక్షతన నిర్వహించిన ‘వరల్డ్ బుక్ అండ్ కాపీ రైట్స్ డే’ సందర్భంగా గ్రంథాలయ పాఠకులను ఉద్దేశించి ప్రసంగిచారు. రోజురోజుకు పుస్తక పఠనం తగ్గిపోతుందని, పుస్తకాలే నిజమైన మార్గదర్శకులు అన్నారు.
ప్రస్తుత డిజిటల్ యుగంలో టెక్నాలజీ అందుబాటులో ఉన్నప్పటికీ పుస్తకాన్ని మరువవద్దన్నారు. కేవలం తరగతికి సంబంధించిన పుస్తకాలే కాకుండా వివిధ అంశాలు, రంగాలపై ఉన్న పుస్తకాలను చదవటం అలవాటు చేసుకోవాలన్నారు. విజేతలందరు మంచి రీడర్లు అని గుర్తుచేశారు. కార్యక్రమంలో లైబ్రరీ అసిస్టెంట్లు ఇజాక్ ప్రభాకర్, తేజావత్ జావేర్తో పాటు విద్యార్థులు, సిబ్బంది, పాల్గొన్నారు.