ములుగు : జిల్లాలో 10వ తరగతి సప్లిమెంటరీ పరీక్షలు ప్రశాంతమైన వాతావరణంలో నిర్వహించేందుకు సంబంధిత శాఖలు అన్ని ఏర్పాట్లు చేపట్టాలని జిల్లా అదనపు కలెక్టర్ రెవెన్యూ మహేందర్ జి తెలిపారు. శుక్రవారం పదవ తరగతి సప్లిమెంటరీ పరీక్షల నిర్వహణపై వివిధ సంబంధిత శాఖల అధికారులతో జిల్లా అదనపు కలెక్టర్ తన ఛాంబర్ నుండి టెలి కాన్ఫరెన్స్ ద్వారా సమన్వయ సమావేశం నిర్వహించి మాట్లాడారు.
పదవ తరగతి సప్లిమెంటరీ పరీక్షలు జూన్ 3 నుండి జూన్ 13వ తేదీ వరకు ఉదయం 9-30 నుండి మధ్యాహ్నం 12-30 వరకు నిర్వహించనున్నట్లు అదనపు కలెక్టర్ తెలిపారు.
జిల్లా కేంద్రంలోని బాలుర ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పరీక్ష కేంద్రం ఏర్పాటు చేయడం జరిగిందని, 74 మంది విద్యార్థులు సప్లమెంటరీ పరీక్షలకు హాజరు కానున్నట్లు ఆయన పేర్కొన్నారు. పరీక్ష కేంద్రాల్లోకి మొబైల్స్, వాచ్, ఎలక్ట్రానిక్ వస్తువులను అనుమతించకూడదని ఆయన తెలిపారు. పోలీస్ శాఖ పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధించి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని, పరీక్ష కేంద్రాల సమీపంలో జిరాక్స్ కేంద్రాలను మూసి వేయించాలని, పరీక్ష కేంద్రం వద్ద అత్యవసర మందులతో పాటు ఏఎన్ఎం, సిబ్బంది నియమించాలని వైద్యాధికారికి సూచించారు.
అదేవిధంగా ఫర్నిచర్, తాగునీరు, విద్యుత్ సౌకర్యం, టాయిలెట్లు, ఫ్యాన్లు ఉండే విధంగా ముందస్తుగా చర్యలు తీసుకోవాలన్నారు. పరీక్ష సమయాలను దృష్టిలో పెట్టుకొని బస్సులను నడిపిందాలని తెలిపారు. పరీక్షలను అధికారులందరూ సమన్వయంతో పనిచేసి ప్రశాంత వాతావరణంలో నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. మాస్ కాపీయింగ్ కు అవకాశం ఇవ్వకూడదని ఆయన తెలిపారు. ఈ సమావేశంలో డీఈఓ పాణి, డిఎంహెచ్ గోపాల్ రావు , ఆర్టీసీ డిపో మేనేజర్ జ్యోత్స్న, ప్రభుత్వ పరీక్షల సహాయ నియంత్రణాధికారి అప్పని జయదేవ్, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.