మహబూబాబాద్ రూరల్, ఆగస్టు 01 : రైతులకు నకిలీ విత్తనాలు అమ్మిన షాప్ యాజమాన్యంపై వెంటనే చర్యలు తీసుకోవాలని మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం పెనుగొండ గ్రామ శివారు చెరువుముంద తండావాసులు డిమాండ్ చేశారు. శుక్రవారం మహబూబాబాద్ పట్టణంలోని ఎస్వీ అగ్రిమాల్ ఫెస్టిసైడ్ దుకాణం ఎదుట రైతులు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ.. నెల రోజులు క్రితం పట్టణంలోని ఎస్వీ అగ్రిమాల్ షాప్లో యశస్విని, మైక్రో, బీ 22 మిరప విత్తనాలను 10 మంది రైతులను కలిసి కొనుగోలు చేశామన్నారు.
నారు పోసిన తర్వాత నాలుగు రోజులకే మొలకలు రావాలని, పది రోజులైన రాక పోవడంతో షాప్ యజమానిని దగ్గరకు వెళ్లి అడిగినట్లు తెలిపారు. విత్తనాల ఏజెంట్ వచ్చి చూస్తాడని చెప్పారని, ఆయన చూసి 20రోజులు తర్వాత మొలకలు వస్తాయని చెప్పారని, 25 రోజులు చూసినా మొలకలు రాలేదని వాపోయారు. ఈ రోజు వచ్చి షాప్ యజమానిని అడిగితే ఏమాత్రం పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా మాట్లాడుతున్నట్లు చెప్పారు. ఒక్కో రైతు సుమారుగా రూ.30వేల నుంచి రూ.40 వేలు ఖర్చు చేసి విత్తనాలు కొంటే కంపెనీ వారిని అడిగాలని దాట వేసే మాటలు మాట్లాడుతున్నారని, దుకాణ యజమానిపై వెంటనే చట్ట ప్రకారం చర్యలు తీసుకొని షాప్ సీజ్ చేయాలని రైతులు డిమాండ్ చేశారు.