వరంగల్ లీగల్, ఏప్రిల్ 21: ఆశ్రమ పాఠశాలలో చదువుతున్న బాలికకు మాయ మాటలు చెప్పి శారీరకంగా లోబర్చుకున్న హాస్టల్ వాచ్మెన్కు 20 ఏళ్ల కఠిన జైలు శిక్ష విధిస్తూ హనుమకొండ అదనపు జిల్లా జడ్జి అపర్ణాదేవి సోమవారం తీర్పు ఇచ్చారు. వివరాలిలా ఉన్నాయి.. హనుమకొండలోని వడ్డేపల్లి చర్చి సమీపంలో ఉన్న ఆశ్రమ పాఠశాలలో తల్లిని కోల్పోయిన బాలిక 7వ తరగతి చదువుకునేది. అదే పాఠశాలలోవాచ్మెన్గా ఉండే ఘనపురం మండలం రవినగర్కు చెందిన నిందితుడు ఆకుల సాంబ బాలికతో పరిచయం పెంచుకున్నాడు. ప్రేమిస్తున్నానని నమ్మించి వేములవాడ తీసుకు వెళ్లి అకడి సత్రంలో పలుమార్లు లైంగికదాడికి పాల్పడ్డాడు.
చివరికి జరిగిన మోసం గ్రహించిన సదరు బాలిక సీతంపేటలోని తన మామకు విషయం తెలుపగా హసన్పర్తి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అప్పటి కాజీపేట ఏసీపీ రవీంద్రకుమార్ పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి సాక్ష్యాధారాలతో చార్జిషీట్ దాఖలు చేశారు. సాక్షుల్ని విచారించిన న్యాయమూర్తి అపర్ణాదేవి నేరం రుజువు కావడంతో నిందితుడికి 20 ఏళ్ల జైలుతో పాటు రూ. 20 వేల జరిమానా విధించారు. బాలిక భవిష్యత్ కోసం రూ. నాలుగు లక్షల ఆర్థిక సాయాన్ని ప్రభుత్వం ద్వారా ఇప్పించాలని న్యాయ సేవాధికార సంస్థను ఆదేశించారు. ఈ కేసులో పబ్లిక్ ప్రాసిక్యూటర్ రాజమల్లారెడ్డి వాదించగా కోర్ట్ డ్యూటీ హెడ్ కానిస్టేబుల్ వలబోజు రవీందర్ సాక్షులను ప్రవేశ పెట్టారు.