భీమదేవరపల్లి, జూన్ 26 : హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో గురువారం వరంగల్ అవినీతి నిరోధక శాఖ అధికారులు తనిఖీలు చేశారు. ఏసీబీ డీఎస్పీ సాంబయ్య తెలిపిన వివరాల ప్రకారం.. అధికారులు వచ్చే సరికి డాక్యుమెంట్ రైటర్లు నలుగురు కార్యాలయంలో ఉన్నారు. వారిని సోదా చేయగా రూ.96,870 దొరుకగా, వాటిని సీజ్ చేశాం.
వాస్తవానికి డాక్యుమెంట్ రైటర్లను కార్యాలయంలోకి అనుమతించొద్దు. సబ్‌రిజిస్ట్రార్ ఆదేశాల మేరకు తాము కార్యాలయంలోకి వస్తున్నట్లు డాక్యుమెంట్ రైటర్లు చెప్పారు. డాక్యుమెంట్ రైటర్ల ద్వారానే ఆఫీసులో అవినీతి జరుగుతుందని మాకు పక్కా సమాచారం ఉంది. దీంతోపాటు రికార్డులను క్షుణ్ణంగా తనిఖీ చేయగా 2023-24 సంబంధించిన కొన్ని డాక్యుమెంట్లు లభించాయి. డాక్యుమెంట్లను జిల్లా కార్యాలయానికి ఎందుకు పంపించలేదో విచారణలో తెలుసుకోవాల్సి ఉంది.
ఎవరైనా డాక్యుమెంట్ కోసం వస్తే రైటర్ల పేర్లను నమోదు చేస్తున్నారని, అది చట్టవిరుద్ధం. సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో జరుగుతున్న అవినీతిపై ప్రభుత్వానికి నివేదిక పంపిస్తామని ఏసీబీ డీఎస్పీ వెల్లడించారు. ప్రభుత్వ కార్యాలయంలో ఎవరైనా పనులు చేయడానికి డబ్బులు అడిగితే టోల్‌ఫ్రీ నంబర్ 1064కు కాల్ చేయాలని కోరారు. తనిఖీల్లో ఏసీబీ ఇన్స్పెక్టర్లు ఎస్ రాజు, ఎల్ రాజు పాల్గొన్నారు.