హనుమకొండ, నవంబర్ 11 : ఇటీవల బీఆర్ఎస్ పార్టీలో చేరిన ఏనుగుల రాకేశ్‌రెడ్డి నిబద్ధత ఉన్న వ్యక్తి అని చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు. శనివారం బాలసముద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయం లో పశ్చిమ నియోజకవర్గ ఎన్నికల ఇన్చార్జి మర్రి యా దవరెడ్డి అధ్యక్షతన రాకేశ్‌రెడ్డి అనుచరులు సుమారు 600 మంది పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాకేశ్‌రెడ్డి లాంటి నిబద్ధత ఉన్న వ్యక్తులను విస్మరించిన బీజేపీకి పుట్టగతులు ఉండవన్నారు. బీఆర్ఎస్ కార్యకర్తలతో పాటు ఇప్పుడు చేరిన వారందరికీ సమన్యాయం ఉంటుందన్నారు. ఈ 20 రోజులు చాలా కీలకమని, ఒక్కొక్కరు సైనికుల్లా పనిచేయాలని కోరారు. ఇప్పటివరకు నియోజకవర్గ పరిధిలో ఒక్కొక్క రోజు ఒక్కో కార్యక్రమంతో ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నానని తెలిపారు. ఈ సారి 50 వేల మెజార్టీతో గెలువాలని కేటీఆర్ చెప్పారని, ఇప్పుడు మీ అందరిని చూస్తుంటే అంతకంటే ఎక్కువ మెజార్టీ రావడం ఖాయమని అన్నారు. త్వరలో నియోజకవర్గం కార్యకర్తలతో సమన్వయ సమావేశం ఏర్పాటు చేసి పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని తెలిపారు. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు డిపాజిట్లు రావని దాస్యం పేర్కొన్నారు. ఎక్కడికి వెళ్లినా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని అన్నారు. సమావేశంలో తెలంగాణ రాష్ట్ర రైతు రుణ విమోచన కమిషన్ చైర్మన్ నాగుర్ల వెంకటేశ్వర్లు, వరంగల్ తూర్పు, పశ్చిమ ఎన్నికల సమన్వయకర్త ఈగ మల్లే శం, పశ్చిమ నియోజకవర్గ ఎన్నికల కన్వీనర్ జనార్థన్‌గౌడ్, కార్పొరేటర్లు వేముల శ్రీనివాస్, సోదా కిరణ్, గుండి రజిత, ఇమ్మడి లోహిత, దాస్యం అభినవ్ భాస్కర్, బొంగు అశోక్‌యాదవ్, నాయకులు జన్ను జకార్య, తాడిశెట్టి విద్యాసాగర్, ఉడుతల సారంగపాణి, నార్లగిరి రమేశ్, నయీమొద్దీన్, పులి రజినీకాంత్, నలబోల సతీశ్, రాంప్రసాద్ పాల్గొన్నారు.
తెలంగాణ ఆశాకిరణం సీఎం కేసీఆర్‌తోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని, అందుకే బీఆర్ఎస్లో చేరానని ఏ నుగుల రాకేశ్‌రెడ్డి తెలిపారు. బాలసముద్రంలోని బీ ఆర్ఎస్ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. విదేశాల్లో ఉద్యోగానికి రాజీనామా చేసి 2013లో బీజేపీలో చేరానని తెలిపారు. అప్పటి నుంచి పార్టీ పటిష్టతకు కృ షి చేస్తున్నానని, ఆ పార్టే తన కుటుంబం అని నమ్మిపనిచేసిన తనకు మోసం చేశారని ఆవేదన వ్యక్త చేశా రు. భారతీయ జనతా పార్టీలో ప్రతిభకు స్థానం లేదని, యువతకు ప్రాధాన్యం ఇవ్వడం లేదని, అన్ని విధాలా వివక్షకు గురయ్యానని పేర్కొన్నారు. దీంతో మనస్తాపం చెంది బీజేపీకి రాజీనామా చేశానని తెలిపారు. సీఎం కేసీఆర్ పిలుపు మేరకు కేటీఆర్‌తో మాట్లాడి తన కార్యకర్తలతో చర్చించి బంగారు తెలంగాణలో భాగస్వాములం కావాలని నిర్ణయించుకుని, బీఆర్ఎస్లో చేరానని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం సీఎం కేసీఆర్ పాలనలో అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అమలు చేశారన్నారు. చాట్‌లో తౌడు పోసి కుక్కలకు కొట్లాట పెట్టించినట్లు కాంగ్రెస్ పార్టీ తీరు ఉందని, అందుకు కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వమే నిదర్శనమని తెలిపారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మళ్లీ చీకటి రోజులు వస్తాయని, ప్రజలు గమనించాలని కోరారు. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా వందలాది మంది కార్యకర్తలను తయారు చేశానని, ఇప్పుడు వారిని సమన్వయం చేసుకుని బీఆర్ఎస్ పటిష్టతకు, గెలుపునకు కృషి చేస్తానన్నారు. ఒక్కో కార్యకర్త వంద ఓటర్లను ప్రభావితం చేస్తారని రాకేశ్‌రెడ్డి తెలిపారు. ఎంతటి వారినైనా ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనే శక్తి కార్యకర్తలకు ఉందన్నారు. ప్రస్తుత క్యాడర్‌తో తన వెంట వచ్చిన కార్యకర్తలతో సమన్వయ సమావేశం ఏర్పాటు చేసి అందరం కలిసి రాష్ట్రంలో మరోసారి బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేందుకు ముందుకు సాగుతామని తెలిపారు.