సుబేదారి ,అక్టోబర్ 29 : బెట్టింగ్ యాప్‌లతో నష్టపోయిన యువకుడు దొంగ అవతారం ఎత్తాడు. ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా 17 చోరీలకు పాల్పడి చివరకు పోలీసులకు చిక్కాడు. హనుమకొండలోని వరంగల్ పోలీసు కమిషనరేట్ కార్యాలయంలో సీపీ అంబర్ కిశోర్‌ఝా మంగళవారం నిందితుడి అరెస్ట్‌ను చూపించి వివరాలు వెల్లడించారు. వరంగల్ జిల్లా రాయపర్తికి చెందిన కొండపల్లి ధర్మరాజు డిగ్రీ చదివి కొద్ది రోజులు బిర్యానీ సెంటర్ నిర్వహించి నష్టపోయాడు. హనుమకొండకు మకాం మార్చి పోస్టల్‌కాలనీలో తాను విద్యార్థినని చెప్పి అద్దె గదిలో నివాసంలో ఉంటున్నాడు.
ఆన్లైన్ బెట్టింగ్తో అప్పులు కావడం, సులభంగా డబ్బులు సంపాదించాలనే ఆలోచనతో దొంగగా మారాడు. పగలు తాళాలు వేసిన ఇళ్లను గమనించి, రాత్రి చోరీలకు పాల్పడేవాడు. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని హనుమకొండ, హసన్‌పర్తి, కేయూసీ, సుబేదారి, సంగెం, స్టేషన్‌ఘన్‌పూర్, పాలకుర్తి, దేవరుప్పుల పోలీసుస్టేషన్ల పరిధిలో మొత్తం 17 చోరీల్లో 334 గ్రాముల బంగారు ఆభరణాలు, కిలో 640 గ్రాముల వెండి చోరీ చేశాడు.
వరంగల్ సెంట్రల్‌జోన్ డీసీపీ షేక్ సలీమా పర్యవేక్షణలో ప్రత్యేక దర్యాప్తు బృందాలు సాంకేతిక పరిజ్ఞానంతో నిందితుడు ధర్మరాజును గుర్తించారు. మంగళవారం కేయూ పోలీస్ స్టేషన్ పరిధిలో చోరీ చేసిన సొత్తును విక్రయించడానికి వెళ్తుండగా పక్కా సమాచారంతో పోలీసులు పట్టుకున్నారు. నిందితుడి నుంచి ఆభరణాలతో పాటు రూ.13వేల నగదు, బైక్, సెల్‌ఫోన్ స్వాధీనం చేసుకున్నారు.