ములుగు, ఆగస్టు 23(నమస్తే తెలంగాణ) : రెడ్ టీషర్ట్, కళ్లజోడు, ముఖానికి మాస్క్ ధరించిన ఓ యువకుడు నేరుగా పిల్లల వార్డులోకి ప్రవేశించాడు. నేను డాక్టర్ని..! బ్రీతింగ్ ఎలా ఉందంటూ చిన్నారుల ఛాతీపై చేతులతో నొక్కే ప్రయత్నం చేశాడు. అనుమానం వచ్చి నిలదీసిన బాలింతలు, సెక్యూరిటీ సిబ్బందితో దురుసుగా ప్రవర్తించి హల్చల్ చేశాడు. రోగుల బంధువులు ఆగ్రహం వ్యక్తం చేయడంలో అక్కడి నుంచి మెళ్లిగా జారుకున్నాడు.
ఈ సంఘటన శుక్రవారం ములుగు జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ దవాఖానలో జరుగగా సోషల్ మీడియా ద్వారా వెలుగులోకి వచ్చింది. ఈ విషయమై దవాఖాన సూపరింటెండెంట్ జగదీశ్వర్ను వివరణ కోరగా గుర్తుతెలియని యువకుడు మద్యం మత్తులో దవాఖానలోని పిల్లల వార్డుకు వచ్చిన మాట వాస్తవమేనని చెప్పారు. సిబ్బంది పోలీసులకు సమాచారం అందించి వారికి అప్పగించారు. కాగా అతడి పేరు భరత్ అని, ములుగులో ఓ బేకరీలో పనిచేస్తాడని విచారణ తేలినట్లు ఎస్సై తెలిపారు. మద్యం మత్తులో ఉండడంతో సాయంత్రం వరకు పీఎస్లో ఉంచి కౌన్సెలింగ్ ఇచ్చి పంపామని చెప్పారు.