కురవి, అక్టోబర్ 04 : వరంగల్ శివనగర్‌కు చెందిన మహమ్మద్ సహనా బేగం శనివారం తన ఇద్దరు మనవరాళ్లతో కలిసి మహబూబాబాద్ వచ్చారు. కురవి గేట్ వద్ద ఆటో ఎక్కి బేతోల్ స్టేజీ వద్ద దిగారు. అనంతరం తన చెల్లెలి ఇంటికి వెళ్లిన తరువాత తన బ్యాగ్ ఆటోలో మర్చిపోయినట్లు గుర్తించారు. వెంటనే బాధితురాలు కురవి పోలీస్ స్టేషన్‌కు వచ్చి వివరాలు తెలియజేశారు. స్టేషన్ రెండో ఎస్సై జయకుమార్, మహిళా కానిస్టేబుల్ అనిత, పోలీస్ కానిస్టేబుల్ రమేష్ స్పందించి, సాంకేతిక ఆధారాలతో ఆటో మరిపెడ వైపు వెళ్తుందని గుర్తించి, బాధితురాలిని వెంట తీసుకుని పోలీస్ వాహనంలో పురుషోత్తమాయగూడెం దిశగా బయల్దేరారు. అక్కడ ఆటోను ఆపి తనిఖీ చేయగా, బ్యాగ్ సురక్షితంగా దొరికింది. బ్యాగ్‌లో ఒక తులం బంగారం, రెండు స్మార్ట్ఫోన్లు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. తన వస్తువులు తిరిగి దొరకడంతో మహమ్మద్ సహనా బేగం భావోద్వేగానికి గురై, పోలీస్ సిబ్బందికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.