రాయపర్తి, జూన్ 15 : రెండు నెలలుగా తాగునీటి కోసం తండ్లాడుతున్నామని రాయపర్తి మండలం మైలారం గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తంచేశారు. గ్రామ పంచాయతీ కార్యాయలంలో శనివారం నిర్వహించిన గ్రామసభలో ఉద్యోగులు, సిబ్బందిపై మండిపడ్డారు. సభ జరుగుతుండగా అక్కడికి పెద్ద సంఖ్యలో చేరుకున్న 2వ వార్డు మహిళలు, ప్రజలు తమ తాగునీటి సమస్యకు ఎవరు పరిష్కారం చూపుతారంటూ జీపీ కార్యదర్శి విజేందర్‌తో వాగ్వాదానికి దిగారు.
గత రెండు నెలలుగా తీవ్రమైన ఎండలతో ప్రజలంతా ఉక్కిరిబిక్కిరి అవుతుంటే తాము తాగేందుకు గుక్కెడు నీళ్లు రాక తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామ పంచాయతీ సరఫరా చేస్తున్న నీళ్లు తమ కాలనీకి రావడం లేదని, ఈ విషయమై జీపీలో ఎన్నిమార్లు ఫిర్యాదులు చేసినా పట్టించుకోవడం లేదని ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో కార్యదర్శిని చుట్టిముట్టిన మహిళలు గ్రామసభకు ప్రత్యేకాధికారిగా వ్యవహరిస్తున్న ఎంపీడీవో గుగులోత్ కిషన్‌నాయక్ ఎందుకు గైర్హాజర్ అయ్యారంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. కేసీఆర్ ప్రభుత్వంలో ఏనాడు తాగునీటి కోసం ఇబ్బంది కాలేదని కేసీఆర్ సర్కార్, సర్పంచ్ల పదవీ కాలం ముగిసినప్పటి నుంచి తమ గోస పట్టించుకునే వారే లేరని వాపోయారు. గ్రామంలోని మైలారం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ సహకారంతో రాష్ట్రంలోని వరంగల్, మహబూబాబాద్, సూర్యాపేట, నల్లగొండ జిల్లాలకు సాగునీళ్లు సరఫరా అవుతుండగా మైలారం గ్రామస్తులు మాత్రం గుక్కెడు నీళ్ల కోసం ఇబ్బందిపడాల్సిన దుస్థితి దాపురించిందని చెప్పారు. ఇప్పటికైనా సిబ్బంది, మండల అధికారులు స్పందించి తమ సమస్యకు పరిష్కారం చూపాలని, లేకపోతే ఆందోళన కార్యక్రమాలను ఉధృతం చేస్తామని తాళ్ల సందీప్‌రెడ్డి, హర్షవర్ధన్‌రెడ్డి, రాంరెడ్డి, ధనలక్ష్మి, యమున, రాజేంద్ర, ఉత్తరమ్మ, పరుపాటి యమున, పద్మ, రజిత, బోయిని యాకమ్మ తదితరులు హెచ్చరించారు.
కేసీఆర్ సర్కార్ పోవుడు, సర్పంచ్‌లు దిగిపోవడంతో గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఉద్యోగులు, సిబ్బందికి ఇష్టారాజ్యం తయారైంది. వాళ్ల పనితీరును అడిగే వాళ్లే లేరు. ఫస్టునాడు జీతం తీసుకునుడు.. రోజుకో గంట సేపు కూసోని ముచ్చట్లు పెడ్టుడుతోనే సరిపోతున్నది. ప్రజల సమస్యలను పరిష్కరించాలన్న సోయి కూడా ఉండడం లేదు. మా తాగునీటి సమస్యను పరిష్కరించకుంటే సక్కగా కలెక్టర్ కాడికి పోవుడు తప్పదు.
గ్రామంలోని రెండో వార్డుకు గ్రామ పంచాయతీ నీళ్లు సక్రమంగా సరఫరా కావడం లేదన్నది అందరికీ తెలిసిందే. సమస్య పరిష్కారానికి కాలనీవాసులు సహకరించడం లేదు. దీంతో తప్పని సరి పరిస్థితుల్లో మా వాటర్ ట్యాంకర్‌తో నీళ్లు సరఫరా చేయిస్తున్నాం. గ్రామ సభలో జరిగిన ఆందోళనను గ్రామ ప్రత్యేకాధికారి, జిల్లా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకు వెళ్లి పరిష్కారానికి కృషి చేస్తాం.