హనుమకొండ, అక్టోబర్ 15: సర్వజన సంక్షేమం కోసమే బీఆర్ఎస్ మేనిఫెస్ట్ అని కుడా చైర్మన్ సంఘంరెడ్డి సుందర్రాజు యాదవ్ అన్నారు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ మేనిఫెస్ట్ ప్రకటించిన సందర్భంగా ఆదివారం హనుమకొండలోని కాళోజీ సంటర్ వద్ద బీఆర్ఎస్ పార్టీ శ్రేణలతో కలిసి సంబురాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలోనే గొప్ప నాయకుడు సీఎం కేసీఆర్ అని అన్నారు. ఎన్నికల కోసం కాకుండా ప్రజా సంక్షేమంతో పాటు అన్ని వర్గాల అభివృద్ధి సంక్షేమమే లక్ష్యంగా మేని ఫెస్ట్ ఉందన్నారు. ప్రస్తుతం అందిస్తున్న రూ. 2016 ఆసరా పింఛన్‌ను రూ. 5 వేలకు, రూ. 4016 దివ్యాంగుల పింఛన్‌ను రూ. 6 వేలకు దశలవారి పెంచే నిర్ణయం అభినందనీయన్నారు. అదే విధంగా రైతు బంధును రూ. 10వేల నుంచి 16వేలకు పెంచారన్నారు. సౌభాగ్యలక్ష్మి పథకం ద్వారా అర్హులైన మహిళలకు ప్రతి నెలకు రూ. 3వేలు ఇవ్వడంతో పాటు రూ. 400లకే గ్యాస్ సిలండర్ అందజేస్తున్నట్లు ప్రకటించి నిరుపేదలపై ఆయన అభిమానాన్ని చాటుకున్నారన్నారు.
కేసీఆర్ ఆరోగ్య రక్ష పథకం ద్వారా వైద్య సహాయంగా రూ. 15 లక్షలు ఇవ్వనున్నామని, స్థలం లేని వారికి ప్రభుత్వ స్థలం అందిస్తామని, అనాథ పిల్లలకు ప్రత్యేక ప్రణాళిక, అసైన్డ్ భూములకు పూర్తి హక్కులు కల్పిస్తామని, ఉద్యోగుల పాత పెన్షన్ విధానం అమలుకు కమిటీ ఏర్పాటు చేస్తామని, అలాగే అగ్ర వర్గాలలోని వారికి రెసిడెన్షియల్ పాఠశాలలు ఏర్పాటు చేయనున్నట్లు సీఎం కేసీఆర్ మేనిఫెస్ట్ ప్రకటించడం అభినందనీయమన్నారు. ఓరుగల్లు నగరం ఇప్పటికే ఎడ్యుకేషనల్, హెల్త్, ఐటీ, కల్చరల్ హబ్‌గా మారిందన్నారు. వరంగల్ పశ్చిమ నియోజక వర్గంలో దాస్యం వినయ్ భాస్కర్ గెలువడంతో పాటు తెలంగాణలో మరోసారి బీఆర్ఎస్ అధికారంలోకి రావడం ఖాయమని సుందర్రాజ్ యాదవ్ అన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ మామిండ్ల రాజు, మాజీ కార్పొరేటర్లు జోరిక రమేశ్, నెకొండ కిషన్, డివిజన్ అధ్యక్షులు సుగుణాకర్ రెడ్డి, రాజు, కోటేశ్వర్, అనిల్, బీఆర్ఎస్ శ్రేణులు, కార్యకర్తలు పాల్గొన్నారు.