వరంగల్, జూలై 13 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) ; కాకతీయ యూనివర్సిటీ పాలకమండలి నియామకం రాజకీయ రంగు పులుముకుంటున్నది. ఉమ్మడి ఖమ్మం, మంచిర్యాల జిల్లాలకు పాలకమండలిలో ప్రాతినిథ్యం కల్పించకపోవడంతో కొత్త చిచ్చు రాజుకుంది. ఈ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏకపక్ష నిర్ణయం తీసుకుందని పలువురిలో అసంతృప్తి నెలకొంది. యూనివర్సిటీ పరిధిలో ఉండే తమ ప్రాంతాలను రాష్ట్ర ప్రభుత్వం విస్మరించడం సరికాదని ఆయా జిల్లాల వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి పాలకమండలిలో మార్పులు చేయాలని కోరుతున్నారు. సవరణలతో మరోసారి ఉత్తర్వులు జారీ చేయించాలని ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన విద్యావేత్తలు, మేధావులు మంత్రులు తుమ్మల, పొంగులేటిపై ఒత్తిడి తెస్తున్నారు. ప్రభుత్వ ముఖ్య సలహాదారు వేం నరేందర్‌రెడ్డిని కలిసి ఫిర్యాదు చేసినట్లు సమాచారం.
రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల తొమ్మిది మందితో కాకతీయ యూనివర్సిటీ పాలక మండలిని నియమించింది. బోధనతోపాటు వ్యవసాయం, పరిశ్రమలు, వాణిజ్యం, విద్య, ప్రజా, న్యాయ, సామాజిక సేవా రంగాలకు చెందిన వారికి ఈ కమిటీలో చోటు కల్పించినట్లు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులో పేర్కొన్నది. అయితే ఈ పాలకమండలిలో అవకాశం దక్కినవారిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వం రాజకీయ నేతలకు యూనివర్సిటీలో పదవులను కల్పించినట్లుగా చర్చ జరుగుతున్నది. పాలకమండలి నియామకం ఏకపక్షంగా సాగిందని ఉమ్మడి ఖమ్మం, మంచిర్యాల జిల్లాలోని బోధన సిబ్బంది, పలువురు విద్యావేత్తలు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ విషయమై ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఆశావహులు మంత్రులు తుమ్మల నాగేశ్వర్రావు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డికి ఫిర్యాదు చేశారు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య సలహాదారు వేం నరేందర్‌రెడ్డిని కలిసి ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. పాలకమండలిలో ఉమ్మడి ఖమ్మం జిల్లాకు అవకాశం కల్పించాలని, అవసరమైతే సవరణలతో మరోసారి ఉత్తర్వులు జారీ చేయాలని కోరినట్లు సమాచారం. ఈ మేరకు వేం నరేందర్రెడ్డిపై మంత్రులు తుమ్మల నాగేశ్వర్రావు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి కూడా ఒత్తిడి తెస్తున్నట్లు తెలుస్తుంది.
బోధన సిబ్బంది కొనసాగింపుపై అస్పష్టత
కాకతీయ యూనివర్సిటీలో నియమితులైన కొందరు బోధన సిబ్బంది కొనసాగింపుపై అస్పష్టత నెలకొంది. ఈ ప్రక్రియకు సంబంధించిన సెలెక్షన్ కమిటీ నియామకాలను ఆమోదించలేదు. న్యాయశాస్త్ర, ఇన్ఫర్మేటిక్స్ విభాగాలకు చెందిన ఇద్దరిని రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల పాలకమండలి సభ్యులుగా నియమించడం న్యాయపరమైన సమస్యలకు ఆస్కా రం ఇచ్చినైట్లెందని సీనియర్ ప్రొఫెసర్లు అంటున్నారు. 2010లో వారి నియామక ప్రక్రియను పాలకమండలి ఆమోదించలేదు. వీరిద్దరితోపాటు మరో 26 మంది నియామకాలనూ తప్పుబట్టింది. ఆ తర్వాత వీరి తొలగింపుపై నిర్ణయం తీసుకోవాలని యూనివర్సిటీ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. అప్పటి నుంచి వీరికి ఎలాంటి పదోన్నతులు కల్పించలేదు. 2023లో జువాలజీ విభాగంలో ఇద్దరిని తొలగించి మిగతా వారి వేతనాలను కొన్ని నెలల పాటు చెల్లించలేదు.
ఈ ప్రక్రియపై కేయూ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. ఈ విషయం అప్పట్లో సంచలనం సృష్టించింది. పాలకమండలి ఆమోదించని వారిని, చర్యల కారణంగా ప్రమోషన్లు పొందని వారిని ఇప్పుడు కాకతీయ యూనివర్సిటీ పాలకమండలిలో సభ్యులుగా నియమించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుతం వీరి నియామకాల అంశం హై కోర్టులో ఉండగా మండలిలో చోటు దక్కడం వివాదాస్పదంగా మారింది. ఇప్పుడు కొత్త పాలకమండలిలో సభ్యులైన వీరు తమ నియామకాలకు సంబంధించి సెలెక్షన్ కమిటీ సిఫార్సులను ఆమోదించుకోవడంలో మిగిలిన వారిని ప్రభావితం చేస్తారనే చర్చ జరుగుతున్నది. వీరి నియామకాలు, ప్రమోషన్ల నిర్ణయాలు ఏకపక్షంగా తీసుకునే అవకాశం ఉంటుందని పలువురు చర్చించుకుంటున్నారు.