కురవి, సెప్టెంబర్ 3 : సీరోలు సెక్షన్లో లైన్మెన్గా విధులు నిర్వర్తించే మూడు నరేందర్ ద్వారానే ఆకేరు వాగు నీటి ఉధృతిలో మరిపెడ మండలం సీతారాంతండా మునిగిపోతుందని బయట ప్రపంచానికి తెలిసింది. సీరోలులో విద్యుత్ శాఖలో పనిచేస్తున్న నరేందర్ స్వగ్రామం సీతారాంతండా. ఆదివారం డ్యూటీలో ఉన్న నరేందర్‌కు తమ్ముడు శ్రీను, అన్న లక్పతి తెల్లవారుజామున ఫోన్ చేసి సమాచారం అందించారు. వెంటనే నరేందర్ సీరోలు ఎస్సై నగేశ్, మరిపెడ పోలీసుస్టేషన్‌కు సమాచారం చేరవేశాడు. తండాకు ఎలా చేరుకోవాలో వారికి వివరించారు. సీరోలు ఎస్సై వెంటనే స్పందించడంతో తండావాసులు బతికిబయటపడ్డారు.
ఇకపోతే నరేందర్ సీతారాంతండాలో ఇటీవలే పిల్లర్లు పోసి నాలుగు రూంల స్లాబ్ వేశాడు. ఆదివారం తెల్లవారుజామున చిమ్మ చీకట్లో ప్రళయంలా వస్తున్న వరద నుంచి తమను తాము రక్షించుకునేందుకు చుట్టుపక్కల వాళ్లు నరేందర్ ఇంటిమీదకు చేరుకున్నారు. సుమారు వందమందికిపైగా తండా జనం స్లాబ్‌మీద బిక్కుబిక్కుమంటూ గడిపారు. బ్రిడ్జి నుంచి ఉన్న రోడ్డు కాకుండా తండాకు పై భాగాన బట్టంక చెరువు వైపు రోడ్డు వేయించాలని తండావాసులు ప్రభుత్వాన్ని కోరారు.