ములుగు 20 (నమస్తే తెలంగాణ) : కాశ్మీర్‌లోని పెహల్గావ్లో భారతీయులపై ముష్కరులు జరిపిన దాడికి ప్రతీకారంగా త్రివిధ దళాలు పాకిస్థాన్‌పై చేసిన దాడులకు మద్ధతుగా ములుగులో ప్రజలు భారీ ర్యాలీ నిర్వహించారు. వివిధ రాజకీయ, ప్రజా, కుల, విద్యార్థి సంఘాల నాయకులు పాల్గొన్నారు. వర్తక, వ్యాపార రంగాల వారు షాపులను బంద్ చేసి మరీ తిరంగా ర్యాలీలో పాల్గొన్నారు. తిరంగా ర్యాలీలో పెసరు విజయ్ చందర్ రెడ్డి హాజరై మాట్లాడుతూ దేశంపైకి ఎవరు దాడి చేసేందుకు ప్రయత్నించినా భారతీయులందరూ ఒక్కటై ముక్తకంఠంతో సైనికులకు మద్ధతిస్తామని పేర్కొన్నారు.
పాక్ ద్వంద్వ నీతిని అవలంభిస్తోందని, ఎవరు ఎన్ని కుట్రలు పన్నినా భారతీయులందరూ ఒక్కటేనని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ములుగులోని తిరుమల టాకీస్ నుంచి మొదలుకొని చౌరస్తామీదుగా బస్టాండ్ నుంచి ఏరియా హాస్పిటల్ వరకు జాతీయ జెండాలు, భారీ పతాకాన్ని ప్రదర్శిస్తూ ర్యాలీ నిర్వహించారు. భారత్ మాతాకీ జై, వందేమాతరం నినాదాలు చేస్తూ, పాటలు పాడుతూ సైనికుల సేవలను కొనియాడారు.