Warangal | ఖిలావరంగల్, మార్చి 15 : వ్యవసాయ పనులు ముగించుకొని ఇంటికి వెళుతున్న క్రమంలో పట్టాలు దాటుతున్న యువ రైతును రైలు ఢీకొట్టడంతో అక్కడిక్కడే మృతి చెందిన సంఘటన శుక్రవారం రాత్రి వరంగల్ – చింతలపల్లి రైల్వేస్టేషన్ల మధ్య జరిగింది.
వివరాల్లోకి వెళ్లితే వరంగల్ రైల్వే జీఆర్పీ హెడ్ కానిస్టేబుల్ పీ రాజు తెలిపిన కథనం ప్రకారం.. గీసుగొండ మండలం శాయంపేట గ్రామానికి చెందిన రైతు తమ్మడబోయిన రాజేందర్ (37) ఈ నెల 14వ తేదీన రైల్వే పట్టాల పక్కనున్న మొక్కజొన్న చేనుకు నీళ్లు పెట్టి తిరిగి వస్తున్నాడు. ఈ క్రమంలో రాత్రి సుమారు 7.30 గంటలకు పట్టాలు దాటుతున్న అతడిని 3వ లైన్‌పై శాతవాహన సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలు వేగంగా వచ్చి ఢీకొట్టింది. ఈ ఘటనలో అతడికి తల పగిలి, కాళ్లు, చేతులు విరిగి అక్కడిక్కడే మృతి చెందాడు. రైల్వే అధికారులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు మృతదేహాన్ని ఎంజీఎం దవాఖాన మార్చూరీలో భద్రపరిచినట్లు తెలిపారు. శనివారం పోస్టుమార్టం అనంతరం మృతుడి తండ్రి ఐలయ్యకు డెడ్‌బాడీని అప్పగించినట్లు హెడ్ కానిస్టేబుల్ తెలిపారు.