హనుమకొండ చౌరస్తా, జనవరి 8 : సంక్రాంతి పండుగ సందర్భంగా వరంగల్ రీజియన్‌లో ట్రాఫిక్‌కు అనుగుణంగా ఈ నెల 13 వరకు 660 ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు రీజనల్ మేనేజర్ డీ విజయభాను తెలిపారు. ఈ ఏడాది మహాలక్ష్మి పథకం కింద ఉచిత బస్సు ప్రయాణం అందుబాటులో ఉన్న నేపథ్యంలో ప్రయాణికుల రద్దీ పెరిగే అవకాశం ఉన్నందున వారికి రవాణాపరమైన ఇబ్బందులు తలెత్తకుండా రీజియన్ పరిధిలో అన్ని ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. హనుమకొండ నుంచి ఉప్పల్, పరకాల, భూపాలపల్లి, కాళేశ్వరం, నర్సంపేట, మహబూబాబాద్, తొర్రూరు, జనగామకు కూడా ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు చెప్పారు.
హైదరాబాద్‌లోని ఉప్పల్‌కు, అక్కడి నుంచి హనుమకొండ వరకు నడిపే బస్సుల వివరాలను డిపోల వారీగా ఆయన వెల్లడించారు. హనుమకొండ డిపో నుంచి 90, జనగామ 90, వరంగల్-1 నుంచి 92, వరంగల్-2 డిపో నుంచి 92, మహబూబాద్ 56, నర్సంపేట 56, పరకాల 56, తొర్రూరు 74, భూపాలపల్లి 54, మొత్తం 660 బస్సులు నడుపుతున్నట్లు చెప్పారు. ఈ సారి కొత్తగా ప్రవేశపెట్టిన ఎలక్ట్రిక్ బస్సులు కూడా ప్రయాణికులకు ఉప్పల్-హనుమకొండ రూట్లో అందుబాటులో ఉంటాయన్నారు. ఈ సందర్భంగా ప్రయాణికులకు దిశానిర్దేశం చేసేందుకు అన్ని ముఖ్య బస్స్టేషన్లలో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి సూపర్వైజర్లను నియమించినట్లు తెలిపారు.
ఉప్పల్ నుంచి ప్రయాణికుల తాకిడి ఎక్కువగా ఉండనున్న నేపథ్యంలో టెంట్లు, షామియానాలు, తాగునీటి సౌకర్యం కల్పించినట్లు చెప్పారు. 24 గంటలు అధికారులు, సిబ్బంది ప్రయాణికులకు సేవలందించనున్నారన్నారు. అలాగే జాతర సందర్భంగా హనుమకొండ నుంచి కొత్తకొండ, వరంగల్ నుంచి ఐనవోలు, జనగామ నుంచి కొమురవెల్లికి పండుగ రోజుల్లో ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు చెప్పారు. ప్రజలు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించి సురక్షితంగా వారి గమ్యస్థానాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు. ముందస్తు రిజర్వేషన్ల కోసం www.tgsrtcbus.in వెబ్‌సైట్‌ను సంప్రదించాలని ఆర్ఎం సూచించారు.