ఈత సరదా ఆరుగురి ప్రాణాలు తీసింది. పెళ్లి వేడుక కోసం వచ్చి అప్పటిదాకా తమతోనే ఉన్న తమ బిడ్డలు అనుకోని దుర్ఘటనతో అనంతలోకాలకు వెళ్లిపోవడం ఆ తల్లిదండ్రులకు పుట్టెడు శోకం మిగిల్చింది. అందరూ 20 ఏళ్ల లోపు యువకులే చేతికొచ్చిన కొడుకులు ఇలా కండ్లముందే విగతజీవులుగా పడి ఉండడం చూసి గుండెలవిసేలా రోదించిన తీరు అక్కడున్న వారందరినీ కలచివేసింది.
మేడిగడ్డ బరాజ్‌లో శనివారం సాయంత్రం గల్లంతైన అంబట్పల్లికి చెందిన పట్టి మధుసూదన్(18), పట్టి శివమనోజ్(15), తొగరి రక్షిత్(13), కర్ణాల సాగర్(16) మహాముత్తారం మండలం కొర్లకుంటకు చెందిన బొల్లెడ్ల రాంచరణ్(17), పసుల రాహుల్(19) మృతదేహాలను ఆదివారం ఉదయం పోలీసులు, ఈతగాళ్లు, రెస్క్యూ బృందాలు బోట్లు, మృత్స్యకార వలలతో వెలికితీశారు. నదిలో మునిగిన తమ పిల్లలు ఏమయ్యారోనని 18 గంటలుగా గోదావరి ఒడ్డున ఎదురుచూస్తూ హాహాకారాలు చేసిన వారి కుటుంబసభ్యులు, బంధువులకు చివరకు నిరాశే మిగలగా.. ఈ సంఘటనతో అంబట్పల్లి, కొర్లకుంటల్లో తీవ్ర విషాదం నెలకొంది.
– మహదేవపూర్, జూన్ 8
మేడిగడ్డ బరాజ్‌లో శనివారం సాయం త్రం గల్లంతైన విద్యార్థుల ఆచూకీ అర్ధరాత్రి వరకు దొరకకపోవడంతో పరిస్థితులు అనుకూలించక గాలింపు నిలిపివేసి ఆదివారం ఉదయం మళ్లీ ప్రారంభించారు. 18 గంటల పాటు గాలింపులు జరిపి ఆదివారం మధ్యా హ్నం ఆరుగురి మృతదేహాలను వెలికితీశారు. చివరి మూడు మృతదేహాలను మత్స్యకారుల వలలతో గాలించి తీసుకొచ్చారు. కుళ్లిన స్థితి లో దుర్గంధం మధ్య మృతదేహాలను మహదేవపూర్ ప్రభుత్వ దవాఖాన మార్చురీకి తరలించి కుటుంబసభ్యులకు అప్పగించారు.
ఈతకు వెళ్లి మృత్యుఒడిలోకి చేరిన పిల్లలను చూసి తల్లిదండ్రులు, బంధువులు కన్నీటి పర్యంతమయ్యారు. అంబట్పల్లిలో పెళ్లి వేడుకకు వచ్చి మృత్యువాత పడడంతో వేడుకల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. మహదేవపూర్ మండలం అంబట్పల్లిలో పట్టి వెంకటస్వామి కుటుంబంలో ఈ నెల 5న జరిగిన వివాహ వేడుకల్లో పాల్గొనేందుకు అంబట్పల్లికి చెందిన పట్టి మధుసూదన్, పట్టి శివమనోజ్, తొగరి రక్షిత్, కర్ణాల సాగర్, మహాముత్తారం మండలం కొర్లకుంటకు చెందిన బొల్లె డ్ల రాంచరణ్, పసుల రాహుల్ వచ్చారు.
వారి కోరిక మేరకు వెంకటస్వామి వారందరినీ మేడిగడ్డ గోదావరి తీరానికి ఈతకు తీసుకువెళ్లాడు. అందులో అతని ఇద్దరు కుమారు లు కూడా ఉన్నారు. నీళ్లు ఎక్కువగా ఉన్నాయని, లోతుకు వెళ్లొద్దని వారించినా సెల్ఫీలు, రీల్స్ తీసుకుంటూ వెళ్లారు. ఈ క్రమంలో ఒక్కొక్కరుగా నీటి ప్రవాహంలో మునిగిపోవ డం గమనించి వెంకటస్వామి వారిని కాపాడే ప్రయత్నం చేసినా ఫలితం లేదు. కళ్లముందే ఇద్దరు కుమారులు, బంధువుల పిల్లలు గల్లం తు కావడంతో ఒడ్డున రోదిస్తూ బంధువులకు సమాచారం అందించాడు.
గ్రామానికి చెంది న ఈతగాళ్లతో పాటు అక్కడికి చేరుకున్న కా టారం డీఎస్పీ రామ్మోహన్‌రెడ్డి గజ ఈతగాళ్లను పిలిపించి గాలించారు. ఆదివారం అడిషనల్ కలెక్టర్ అశోక్‌కుమార్, అడిషనల్ ఎస్పీ నరేశ్ ఆధ్వర్యంలో ఎస్డీఆర్ఎఫ్, డీడీఆర్ఎ ఫ్, అగ్నిమాపక సిబ్బంది, సింగరేణి రెస్క్యూ టీం, పోలీసులు చేపట్టిన ఆపరేషన్‌తో మృతదేహాలను వెలికితీశారు. కాగా, మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అంబట్‌పల్లిలోని పట్టి వెంకటస్వామి, కర్నాల సాగర్ కుటుంబాలను ఆదివారం రాత్రి పరామర్శించారు. బాధిత కు టుంబాలకు ప్రభుత్వం నుంచి రూ.లక్ష చొ ప్పున ఎక్స్‌గ్రేషియా, అర్హులకు ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని హామీ ఇచ్చారు.
ప్రభుత్వానిదే బాధ్యత..
-పుట్ట మధుకర్, మంథని మాజీ ఎమ్మెల్యే
మేడిగడ్డ ఘటనకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని మంథని మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జి మధుకర్ డిమాండ్ చేశారు. ఆదివారం ఆయన మహదేవపూర్ ప్రభుత్వ ఆస్పత్రి వద్ద మృతుల కుటుంబాలను పరామర్శించి ఓదార్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రపూరితంగానే మేడిగడ్డను పకన పెట్టిందని, అకడ వరద ప్రవాహం పెరుగుతున్నదని తెలిసినా ఎలాంటి రక్షణ చర్యలు చేపట్టలేదని ఆరోపించారు.
ప్రభుత్వ వైఫల్యంతోనే అభంశుభం తెలియని ఆరుగురు పిల్లలు ప్రాణాలు కోల్పోయారన్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి కుటుంబానికి రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇచ్చి ఆదుకోవాలని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని డిమాండ్ చేశారు. ఆయన వెంట బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు లింగంపల్లి శ్రీనివాసరావు, మహిళా విభాగం మండలాధ్యక్షురాలు ఓడేటి స్వప్న, యూత్ అధ్యక్షుడు ఎండీ అలీమ్‌ఖాన్, సీనియర్ నాయకులు ప్రకాశ్, కూరతోట శ్రీహరి, కారెంగుల బాపురావు, వంశీ తదితరులున్నారు.
చేతికొచ్చిన కొడుకులు కళ్ల ముందే కొట్టుకుపోయిండ్రు..
మాది అంబట్పల్లి గ్రామం. నాకు ఇద్దరు కొడుకులు పట్టి మధుసూదన్, శివమనోజ్తో పాటు ఒక బిడ్డ ఉంది. కొడుకులు ఇద్దరు వేసవి సెలవుల కోచింగ్‌లో ఉన్నరు. ఈ నెల 5న నా మరదలు పెళ్లి కోసం ఊరికి వచ్చారు. బంధువులతో కలిసి ఫొటోల కోసం వారిని మేడిగడ్డ బరాజ్‌కు నేనే తీసుకపోయిన. అకడ ఫొటోలు దిగి స్నానం చేస్తుండగా నా కళ్ల ముందే నా ఇద్దరు కొడుకులతో పాటు మరో నలుగురు నదిలో కొట్టుకుపోయిండ్రు. చేతికొచ్చిన కొడుకులు ఇలా దూరమవడం చూసి నా గుండె తరుక్కుపోతున్నది. నా కుటుంబానికి ఇంతటి దారుణ పరిస్థితి వస్తుందని అనుకోలే. చదువులో చురుగ్గా ఉండే నా కొడుకులు భవిష్యత్‌లో ప్రయోజకులవుతారని ఆశపడ్డా. కానీ, ఇలా అవుతుందనుకోలే. కూలి చేసుకునే మేము ఇప్పుడు దికులేకుంట అయినం. ప్రభుత్వమే మమ్మల్ని ఆదుకోవాలి.
– పట్టి వెంకటస్వామి, అంబట్పల్లి, మహదేవపూర్ మండలం
మంచిగ చదివెటోడు
నాకు కొడుకు సాగర్, బిడ్డ స్రవంతి కవల పిల్లలు. కొడుకు పదో తరగతి పూర్తి చేసి ప్రస్తుతం ఇంటర్ చదువుతున్నాడు. నా కొడుకే నా ప్రపంచం. చదువులో చురుగ్గా ఉండేటోడు. ఎలాంటి చెడు అలవాట్లు లేవు. స్నేహితులతో కలిసి బరాజ్‌కు వచ్చి మృతి చెందడం కలచివేసింది. మేము కూలీ పని చేసుకొని బతికేటోళ్లం. మాకు భూములు, జాగలు లేవు. నా కొడుకు మృతితో మా బతుకులు రోడ్డు మీద పడ్డాయి. చేతికి అందిన కొడుకు ఇక లేడని తెలిసి ఏం చేయాలో అర్థం అయితలేదు. ఇలాంటి గర్భశోకం ఏ తల్లిదండ్రులకు రాకూడదు. పుట్టెడు దుఃఖంలో ఉన్న మా కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి.
– కర్నాల సమ్మయ్య, సాగర్ తండ్రి, అంబట్పల్లి, మహదేవపూర్ మండలం
ప్రాణాలతో బయటపడతా అనుకోలే..
మేడిగడ్డ బరాజ్‌లో స్నానం చేసేందుకు మొదట నలుగురు, తరువాత మరో ఇద్దరు దిగారు. వారికి ఈత రాకపోవడంతో ఒకరి వెనుక ఒకరు నీట మునిగిపోతున్నరు. కొద్ది క్షణాల్లోనే స్నానానికి వెళ్లిన ఆరుగురు మునిగిపోయారు. అందులో మధుసూదన్ మునిగిపోతుంటే నా చేయి పట్టుకొని కాపాడేందుకు యత్నించినప్పటికీ అది సాధ్యం కాలేదు. నాకేం చేయాలో తెలియక భయపడి అకడి నుంచి వెంటనే ఒడ్డుకు చేరుకున్న. నా కళ్ల ముందే ఆరుగురు నదిలో మునిగిపోవడం చూసి ఆందోళనకు గురయ్యా. విషయాన్ని వారి కుటుంబ సభ్యులు, స్థానికులకు చెప్పిన. ఇప్పటికీ ఆ దృశ్యాలే నా కళ్ల ముందు మెదులుతున్నయ్. ఆ భయం ఇప్పటికీ పోతలేదు. నేను ప్రాణాలతో బయటపడతా అనుకోలేదు.
– పట్టి శివమణి, ప్రాణాలతో బయటపడిన యువకుడు
ఎన్నో ఆశలు పెట్టుకున్నం..
మాకు ఒక కొడుకు రక్షిత్‌తో పా టు కూతురు ఉంది. కొడుకు అంబట్పల్లి ప్రభుత్వ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నడు. మేము హమా లీ పని చేసి బతుకుతున్నం. నా కొడుకుపై ఎన్నో ఆశలు పెట్టుకున్నం. ఇలా చనిపోవడాన్ని జీర్ణించుకోలేకపోతు న్నం. తలకొరివి పెట్టాల్సిన కొడుకు చిన్నతనంలోనే చనిపోవడం మా కుటుంబంలో విషాదం నింపింది. రెకాడితే గానీ పూట గడవని పరిస్థితి మాది. మా కుటుంబానికి పెద్దదికు అయితడు అనుకుంటే మమ్ముల ఆగం చేసి పోయిండు.
– తొగరి సాంబ, రక్షిత్ తల్లి, అంబట్పల్లి, మహదేవపూర్ మండలం
మృతుల్లో అన్నదమ్ములు..
గోదావరిలో గల్లంతై మృతిచెందిన వారిలో నలుగురు అంబట్పల్లికి చెందిన వారే. పట్టి మధుసూదన్, పట్టి శివమనోజ్, తొగరి రక్షిత్, కర్ణాల సాగర్ గోదావరి నదిలో గల్లంతు కావడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఇందులో ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు అన్నదమ్ములు మృతిచెందగా ఆ కుటుంబానికి పెద్దదిక్కు లేకుండా పో యింది. పట్టి వెంకటస్వామి కళ్ల ముందే ఆరుగురు నీటిలో గల్లంతు కావడం, అందులో ఇద్దరు తన కు మారులు ఉండడం అతన్ని అచేతన స్థితికి చేర్చింది. పెళ్లింట సంబురాలు ఒక్క రోజుకే పరిమితమయ్యాయి. అంతా శోకసంద్రంలో మునిగిపోయారు. అలాగే మహాముత్తారం మండలం కొర్లకుంట, స్తంభంపల్లి గ్రామాల్లో ఇద్దరు మృతిచెందారు.
శవమై వస్తడనుకోలేదు..
నాకు ఇద్దరు కొడుకులు. పెద్ద కొడుకు బీటెక్ చదువుతున్నడు. చిన్నోడు ఈ మ ధ్యనే పదో తరగతి పూర్తి చే సిండు. అంబట్పల్లిలో పెళ్లి కి వెళ్లిన చిన్న కొడుకు తిరిగి రాని లోకాలకు వెళ్లడం మాకు తీరని లోటు. మాకు వ్యవసాయం లేదు. కూలీ పని చేసుకొ ని బతుకుతున్నం. అప్పు, సప్పు చేసి వాళ్లను చదివించిన. చేతికొచ్చిన కొడుకు ఆసరా అయితడనుకుంటే.. చివరకు ఇలా చనిపోతాడనుకోలే. ఈ వార్త విని కుంగిపోయాను.
– పసుల శ్రీనివాస్, రాహుల్ తండ్రి, పీపీ స్తంభంపల్లి, మహాముత్తారం మండలం