ఖిలావరంగల్ : గొర్రెల షెడ్‌కు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు నిప్పు పెట్టగా సుమారు 500 గొర్రెలు కాలి బూడిద (Sheep killed)అయ్యాయి. ఈ సంఘటన గురువారం రాత్రి ఖిలావరంగల్ లో జరిగింది. వివరాల్లోకి వెళితే బాధితులు, మిల్స్ కాలనీ పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ ఏలూరు జిల్లా కలిదిండి మండలం భాస్కరరావుపేట గ్రామానికి చెందిన దుగ్గిరాల లక్ష్మణ్ 23 ఏళ్ల క్రితం కుటుంబ సభ్యులతో వరంగల్ కు వలస వచ్చారు. కుటుంబాన్ని పోషించుకునేందుకు హమాలీ కార్మికుడిగా పనులు చేసి చివరగా గొర్రెల పెంపకం మొదలుపెట్టాడు. గొర్రెల వ్యాపారంతో కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు.
ఇటీవల కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు 12 గొర్రెపోతుల్ని అపహరించారు.
ఆ సంఘటన మరువకముందే మరోసారి గుర్తు తెలియని వ్యక్తులు గొర్రెల షెడ్డుకు నిప్పు పెట్టారు. దీంతో 500 గొర్రెలు మృతి మృతి చెందాయి. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు అగ్నిమాపక సిబ్బంది మిల్స్ కాలనీ పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని మంటలను ఆపివేశారు. అప్పటికే గొర్రెలన్ని మృతి చెందాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సుమారు 50 లక్షల పైగా ఆస్తి నష్టం జరిగినట్లు నిర్ధారించారు. కాగా భారీగా ఆస్తి నష్టం జరగడంతో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. నిందితులను గుర్తించి కఠినంగా శిక్షించాలని స్థానికులు కోరుతున్నారు.