కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కులోని పరిశ్రమలకు విద్యుత్ అందించేందుకు ప్రభుత్వం చేపట్టిన 220/132/33కేవీ సబ్‌స్టేషన్ నిర్మాణ పనులు చకచకా సాగుతున్నాయి. సబ్స్టేషన్ల నిర్మాణానికి టీఎస్ఐఐసీ ఇక్కడ 10 ఎకరాల భూమి కేటాయించింది. సుమారు ఎకరం స్థలంలో ఎన్పీడీసీఎల్ 33/11 కేవీ సబ్ స్టేషన్ నిర్మించింది. మిగిలిన 9 ఎకరాల్లో విక్రాన్ ఇంజినీరింగ్ సంస్థ 9 నెలల కాలపరిమితితో రూ.63 కోట్లతో ‘మెగా’ పనులను పూర్తి చేయడానికి ట్రాన్స్‌కోతో అవగాహన కుదుర్చుకుంది. జూన్ నెలాఖరులోగా పనులు పూర్తి చేసి పరిశ్రమలకు కరంటు సరఫరా చేసేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.
-వరంగల్, ఏప్రిల్ 29 ( నమస్తే తెలంగాణ)
వరంగల్, ఏప్రిల్ 29 ( నమస్తే తెలంగాణ): కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కులో ప్రభుత్వం చేపట్టిన 220/132/ 33కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్ పనులు చకచకా సాగుతున్నాయి. సబ్‌స్టేషన్‌లో ట్రాన్స్ఫార్మర్లను అమర్చే పనులతో పాటు విద్యుత్ సరఫరా కోసం లైన్ నిర్మాణ పనులు సమాంతరంగా జరుగుతున్నాయి. జూన్ నెలాఖరులోగా పనులన్నింటినీ పూర్తి చేసి వస్త్ర పరిశ్రమల నిర్వహణకు కరంటు సరఫరా చేయాలనే లక్ష్యంతో అధికారులు ముందుకు వెళ్తున్నారు. వరంగల్ జిల్లాలోని గీసుగొండ, సంగెం మండలాల పరిధిలో ఉన్న శాయంపేట, చింతలపల్లి గ్రామాల వద్ద సుమారు 1,300 ఎకరాల విస్తీర్ణంలో రాష్ట్ర ప్రభుత్వం కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కు నిర్మాణం చేపట్టిన విషయం తెలిసిందే. పారిశ్రామిక అభివృద్ధే లక్ష్యంగా ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఈ పార్కు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. దేశంలోనే అతిపెద్ద వస్త్రనగరిగా రూపుదిద్దుకోనుతున్న కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కులో పరిశ్రమలను నెలకొల్పేందుకు దేశవిదేశాల నుంచి ప్రముఖ కంపెనీలు ఆసక్తి కనబరుస్తున్నాయి.
ఇక్కడ భారీ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొస్తున్నాయి. ఇప్పటికే నార్త్ఇండియాకు చెందిన గణేషా ఎకోటెక్, ఎకోపెట్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ పరిశ్రమలు ఈ పార్కులో వెలిశాయి. 50 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పడిన ఈ పరిశ్రమల్లో కొద్ది నెలల నుంచి ఉత్పత్తి కొనసాగుతోంది. రాష్ట్ర పరిశ్రమలు, ఐటీశాఖ మంత్రి కేటీ రామారావు వీటిని ప్రారంభించారు. పిల్లల వస్ర్తాల తయారీలో దేశంలోనే అతిపెద్దదైన కేరళ రాష్ర్టానికి చెందిన కైటెక్స్ కంపెనీ భారీ పెట్టుబడులతో ఇక్కడ పరిశ్రమల నిర్మాణం చేపట్టింది. దశలవారీగా యూనిట్లను ప్రారంభించే దిశగా పరిశ్రమలు నిర్మిస్తోంది. వేగవంతంగా ఈ పరిశ్రమల నిర్మాణ పనులు జరుగుతున్నాయి. మరి కొద్దిరోజుల్లో ఇక్కడ కైటెక్స్ పరిశ్రమల్లో ఉత్పత్తి ప్రారంభం కానుంది. సౌత్ కొరియాకు చెందిన యంగ్వన్ కంపెనీ ఈ పార్కులో భారీ పెట్టుబడులతో పరిశ్రమలు నిర్మించేందుకు సిద్ధమైంది. టీఎస్ఐఐసీ ఇక్కడ కేటాయించిన భూముల్లో పరిశ్రమల నిర్మాణ పనులను మొదలు పెట్టేందుకు యంగ్వన్ కంపెనీ ఏర్పాట్లు చేసింది. కైటెక్స్ పరిశ్రమల్లో ఉత్పత్తి ప్రారంభం, యంగ్వన్ కంపెనీ పరిశ్రమల నిర్మాణ పనుల ప్రారంభం త్వరలో ఒకేరోజున జరిగే అవకాశం ఉన్నట్లు తెలిసింది. వస్త్ర పరిశ్రమల ఏర్పాటు కోసం మరికొన్ని కంపెనీలకూ టీఎస్ఐఐసీ ఈ పార్కులో భూములను కేటాయించింది. ఈ ‘మెగా’ పార్కులో వేలాది మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభించాలనే లక్ష్యంతో ప్రభుత్వం వస్త్ర పరిశ్రమల స్థాపనకు కంపెనీలను ప్రోత్సహిస్తోంది.
– కరంటు సరఫరా కోసం
పరిశ్రమల నిర్వహణ కోసం ప్రభుత్వం టీఎస్ఐఐసీ ద్వారా కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కులో మౌలిక వసతులు కల్పిస్తోంది. ఇందులో భాగంగా వస్త్ర పరిశ్రమలకు అవసరమైన కరంటు సరఫరాకు సబ్స్టేషన్ల నిర్మాణానికి ఇక్కడ 10 ఎకరాల భూమిని కేటాయించింది. ఈ స్థలంలో తొలివిడుత ఎన్పీడీసీఎల్ సుమారు ఎకరంలో 33/11 కేవీ సబ్‌స్టేషన్ నిర్మించింది. ప్రస్తుతం ఈ సబ్‌స్టేషన్ నుంచే పార్కు నిర్వహణతో పాటు పరిశ్రమలకు విద్యుత్ సరఫరా అవుతోంది. త్వరలో కైటెక్స్ కంపెనీ పరిశ్రమల్లో ఉత్పత్తి మొదలు కానుండడం, యంగ్వన్ వంటి కంపెనీల పరిశ్రమల నిర్మాణ పనులు ప్రారంభం కానున్న తరుణంలో ప్రభుత్వం ఈ పార్కులో 220/132/33 కేవీ సబ్‌స్టేషన్ నిర్మాణం కోసం సుమారు రూ.63 కోట్లు మంజూరు చేసింది. ఈ నిధులతో ట్రాన్స్‌కో ఇక్కడ మిగిలిన 9 ఎకరాల్లో ‘మెగా’ సబ్‌స్టేషన్ నిర్మాణ పనులు చేపట్టింది. టెండర్ ప్రక్రియ ద్వారా విక్రాన్ ఇంజినీరింగ్ సంస్థ ఈ పనులను దక్కించుకుంది.
9 నెలల కాలపరిమితితో రూ.63 కోట్ల ‘మెగా’ పనులను పూర్తి చేయడానికి ట్రాన్స్‌కోతో అవగాహన కుదుర్చుకుంది. జే చొక్కారావు దేవాదుల ఎత్తిపోతల ప్రాజెక్టులో భాగంగా హనుమకొండ జిల్లా దామెర మండలంలోని పులుకుర్తి సంపుహౌస్ వద్ద నిర్మించిన 220/132కేవీ సబ్‌స్టేషన్ నుంచి ఈ పార్కులోని 220/132/33కేవీ సబ్‌స్టేషన్‌కు కరంటు సరఫరా జరిగేలా ట్రాన్స్‌కో ప్రణాళిక రూపొందించింది. ఈ మేరకు కొద్దినెలల క్రితం పనులు మొదలయ్యాయి. పులుకుర్తి నుంచి టెక్స్టైల్ పార్కు వరకు సుమారు 32 కిమీ విద్యుత్ లైన్ నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. 112 టవర్ల నిర్మాణానికి ఇప్పటికే 80 టవర్ల నిర్మాణం పూర్తయింది. పార్కులో చేపట్టిన సబ్‌స్టేషన్‌లో రెండు 160ఎంవీఏ, రెండు 80ఎంవీఏ ట్రాన్స్ఫార్మర్లను ఏర్పాటు చేసే పనులు యుద్ధప్రాతిపదికన సాగుతున్నాయి. ఈ సబ్‌స్టేషన్ నిర్వహణ కోసం కంట్రోల్ రూం భవనం నిర్మిస్తున్నారు. జూన్ నెలాఖరులోగా పనులన్నింటినీ పూర్తి చేసి పార్కులోని పరిశ్రమలకు ‘మెగా’ సబ్‌స్టేషన్ నుంచి కరంటు సరఫరా చేయాలని ట్రాన్స్‌కో అధికారులు టార్గెట్‌గా పెట్టుకున్నారు.