హనుమకొండ సబర్బన్, నవంబర్ 4 : ‘నా భర్త రాత్రింబవళ్లు ఎవుసం కోసం కష్టపడేటోడు.. 2011ల నీళ్లు తక్కువున్నయని వరి వేయక యాసంగి పంట కింద మక్క ఏసినం.. అప్పుడు కరెంటు సక్కగ ఉండకపోవు. రోజూ నా భర్త రాత్రి పూట బాయి కాడికి పోయి మోటరు పెట్టేటోడు. మార్చి 17న కరెంటు షాక్తోని సచ్చిపోయిండు.. ఇప్పటిలెక్క ఉంటే బతికిఉండేటోడు.. అప్పటి కాంగ్రెస్ సర్కారే నా భర్తను పొట్టనబెట్టుకున్నది..’ అని ఎల్కతుర్తికి చెందిన కంబాల తిరుమల కన్నీళ్లు పెట్టుకున్నది. కాంగ్రెస్ పాలనలో ‘చీకటి రోజుల’ను గుర్తుచేసుకుంటూ బోరున ఏడ్చింది. నాడు వ్యవసాయానికి 4 నుంచి 6 గంటలు అది కూడా రాత్రిపూటే ఇవ్వడంతో చీకటిలో పొలాల కాడికి పోయి వందల సంఖ్యలో రైతులు కరెంటు, పాము కాటుకు బలయ్యారు. నాడు ఇంటి పెద్ద దిక్కులను కోల్పోయి రోడ్డున పడ్డ కుటుంబాలు ఇప్పటికీ తేరుకోలేదు. కాంగ్రెస్ హయాంలో ఉమ్మడి జిల్లా పరిధిలో పదేళ్ల కాలంలో 142మంది విద్యుదాఘాతంతో చనిపోగా, పాముకాట్లతో అనేకమంది మృత్యువాత పడ్డ విషాదం ఇప్పటికీ మాసిపోలేదు.
తెలంగాణ రాక ముందు కేవలం వ్యవసాయానికి 4 నుంచి 6 గంటల కరెంటు మాత్రమే సరఫరా అయ్యేది. అది కూడా పగలు కొంత సేపు రాత్రి కొంత సేపు ఉండేది. రాత్రి కరెంటును వినియోగించుకునే క్రమంలో రైతులు నిత్యం భార్యాపిల్లలను వదిలి వ్యవసాయ బావుల వద్దే జాగారం చేసేవారు. ఈ తరుణంలో రాత్రుళ్లు కరెంటు షాక్‌కు గురై ఒక్కడ వరంగల్ ఉమ్మడి జిల్లా పరిధిలోనే పదేళ్ల కాలంలో 142 మంది చనిపోయారు. పాముకాట్లు, ఇతర విష పురుగులు కుట్టి అనేక మంది ప్రాణాలు విడిచారు. ఇలా ఇంటి పెద్ద దిక్కును కోల్పోయి వందలాది కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ఈ క్రమంలో తెలంగాణ వచ్చాక ముఖ్యమంత్రి కేసీఆర్ విద్యుత్ సరఫరాపై ప్రత్యేక దృష్టి సారించారు. అనతి కాలంలోనే వ్యవసాయ రంగానికి నిరంతర విద్యుత్ సరఫరా మొదలు పెట్టారు. దీంతో వ్యవసాయరంగ ప్రగతి మారిపోయింది. తెలంగాణ రాక మునుపు రాష్ట్రంలో విద్యుత్ కోతల విషయంలో రైతులు ఏదో ఒక చోట రోడ్డెక్కి ఆందోళన చేసేవారు. విద్యుత్ కోతలతో పంటలు ఎండి పోయి అనేక మంది రైతులు ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటనలు ఉన్నాయి. ఎంతమంది చని పోయినా నాటి సీమాంధ్ర ప్రభుత్వాలు ఎన్నడూ రైతుల చావులను పట్టించుకున్న పాపాన పోలేదు. చనిపోయిన రైతు కుటంబాలకు రూపాయి సాయం కూడా చేయలేదు. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. వ్యవసాయ రంగానికి విద్యుత్ సరఫరా మొత్తం పగటి పూటనే ఉటుండడంతో రైతులు ఉద్యోగానికి వెళ్లినట్లు వెళ్లి వస్తున్నారు. ఈ తరుణంలో గతంలో రాత్రి పూట విద్యుత్ సరఫరాతో చనిపోయిన కుటుంబాలను ‘నమస్తే తెలంగాణ’ పలకరించగా ఒక్కో కుటుంబానిది ఒక్కో దీన గాథ కనిపించింది. ఇప్పటిలా అప్పుడుంటే తమ వారు బతికి ఉండేవారని కన్నీటిపర్యంతమయ్యారు. ఇప్పుడు 24గంటల పాటు విద్యుత్ సరఫరా చేసేందుకు ప్రభుత్వం పక్కా ప్రణాళికను రూపొందించి అమలు చేయడంతో నాటి ‘కాంగ్రెస్ కాళరాత్రుల’కు చరమగీతం పాడినట్లయింది.
ఆ కష్టాలు మళ్ల రావద్దు
కాంగ్రెసోళ్ల పాలనల చెరువులు ఎండిపోయి, పొలాలు నెర్రెలుబారి, బావుల్లో నీళ్లు ఎండిపోయి, కరెంటు జాడ లేక మస్తు కష్టాలు పడ్డం. మాకు తిర్మలాపురం పెద్దచెరువును అనుకుని రెండున్నర ఎకరాల పట్టాభూమి ఉంది. పొద్దటిపూట కరెంటు మూడు గంటలే ఉండేది. నీళ్లు సరిపోయేన్ని లేకపోయేది. మోటార్ పెడితే రెండు గంటల్లోపే నీటి జల ఆగిపోయేది. కరెంటు ఎప్పుడత్తదో తెల్వకపోయేది. పొలానికి నీళ్లు పెట్టి వస్తనని నా భర్త నారాయణ బాయికాడికి పోయిండు. కానీ కరెంటు పోయినా ఆయన ఇంటికి రాలేదు. పక్కచేనోళ్లు వచ్చి నీ భర్త మోటర్ మీదనే కరెంటు షాక్ కొట్టి పడిపోయిండు అని చెప్పిన్రు. అప్పుడు నా పెద్ద కొడుకుకు తొమ్మిదేండ్లు. చిన్నోనికి మూడేళ్లు. నాడు రైతులను పట్టించుకున్నోళ్లే లేరు. ఆపద్బంధు ఉన్నదన్నరు.. 50వేల వస్తయన్నరు. దరఖాస్తు పెట్టిన కానీ ఎవరూ పట్టించుకోలే. ఇలాంటి కష్టాలు ఎవరికీ రావద్దు. కానీ కేసీఆర్ సర్కారు వచ్చినంక.. తలాపున సముద్రం లెక్క తిర్మలాపురం చెరువు కళకళలాడుతాంది. 24గంటల కరెంటు, పుష్కలంగా నీళ్లు వస్తున్నయ్. ఆ భూమిలోనే సాగుచేసుకుంటూ నా కొడుకులను చదివించుకుంటున్న. రైతుబంధు, ఆసరా పింఛన్‌తో ఇల్లు గడుత్తాంది. ఎవరి దగ్గరికి పోయి చేయి చాపకుండా కేసీఆర్ ప్రభుత్వం మంచిగ చూసుకుంటాంది. ఇటీవల సార్ రుణమాఫీ కూడా చేశిండు. ఇది రైతు మేలు కోరే సర్కారు.
– దేవీ ఆదిలక్ష్మి, కురవి, మహబూబాబాద్ జిల్లా
ఇప్పుడు మస్తు కరెంటు, నీళ్లు..
మాది బొడ్రాయితండా. నా భర్త తేజావత్ కస్నా ఐదెకరాలు సాగు చేసేది. నా భర్త తోట, పొలానికి నీరు పెట్టేందుకు రాత్రీపగలు కరెంట్‌తో గోసపడ్డడు. కరెంట్ ట్రిప్ అయి మోటార్ల కాలిపోయేటియి. రిపేరు కోసం మెకానిక్కు ఇచ్చి రోజులకొద్దీ తిరిగేది. నీళ్లు లేక, కరెంటు రాక పొలాలు ఎండిపోయేది. కరెంటోళ్లకు ఫోన్ చేసినా పట్టించుకోకపోయేది. అప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇవేవీ లెక్కచేయలేదు. చేసేదేమీ లేక బాధతో నా భర్త 2004లో ట్రాన్స్ఫార్మర్ పట్టుకుని ఆత్మహత్య చేసుకున్నడు. కాంగ్రెస్ పాలనలో కరెంట్ కష్టాలు, తిప్పలు అన్నీఇన్నీ కావు. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత మా పంటలకు త్రీఫేస్ కరెంట్ తీగలు వేశారు. కేసీఆర్ సర్కారు కొత్త ట్రాన్స్ఫార్మర్ పెట్టి, కరెంట్ సమస్య లేకుండా చేసింది. 24గంటల ఉచిత కరెంట్‌తో ఏ టైంకు చేనుకాడికి పోయినా నీరు పెట్టుకోవచ్చు. రైతుబంధు, రైతుబీమా, రుణమాఫీ చేశారు. సకాలంలో ఎరువులు ఇస్తున్నరు. కాళేశ్వర జలాలతో బావుల్లో భూగర్భ జలాలు పెరిగినయ్. ఇందంతా కేసీఆర్ సర్కారు పుణ్యమే.
– తేజావత్ లక్ష్మి, బొడ్రాయితండా, మహబూబాబాద్ జిల్లా
ఎన్పీడీసీఎల్ పరిధిలో భారీ మార్పులు
ఎన్పీడీసీఎల్ పరిధిలో ఐదేళ్లలోనే పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు చేపట్టారు.1281 33/11 విద్యుత్ సబ్స్టేషన్లు మాత్రమే గతంలో ఉండగా కేవలం ఐదేళ్లలోనే 197 కొత్తవి నిర్మించారు. 1561 కిలోమీటర్ల 33 కిలోవాట్ల విద్యుత్ లైన్‌ను,12 వేల 653 కిలోమీటర్ల మేర 11 కిలోవాట్ల విద్యుత్ లైన్‌ను వేశారు.47 వేల 841 కిలో మీటర్ల లో టెన్షన్(ఎల్టీ) విద్యుత్ లైను వేశారు. కేవలం ఐదేళ్లలోనే పాత లైన్‌తో పోల్చితే 36 శాతం పెరుగుదల ఉంది.745 కిలో మీటర్ల 63 కిలోవాట్ విద్యుత్ లైన్ 48 వేల 402 విద్యుత్ డిస్ట్రీబ్యూటరీ ట్రాన్స్ఫార్మర్లను, 175 పవర్ ట్రాన్స్ఫార్మర్లను బిగించారు. సోలార్ ఎనర్జీని కూడా అందుబాటులోకి తెచ్చారు. సిబ్బంది కొరత లేకుండా సంస్థలో 3,414 ఖాళీలకు గాను 3,133 మందిని అన్ని స్థాయిల్లో నియమించారు. 2018 కంటే ముందు కేవలం 27 లక్షల ఎరకాల సాగు భూమి మాత్రమే ఉండేది. కేవలం 5 ఏండ్లలోనే సాగు భూమి కాస్తా 94 లక్షలకు చేరింది. 2018 కంటే ముందు 46 వేల 213 ట్రాన్స్ఫార్మర్లు ఉండేవి. ఇప్పుడు వాటి సంఖ్య 65,615కు చేరుకుంది. 29 పవర్ ట్రాన్స్ఫార్మర్లు గతంలో ఉంటే ఇప్పుడు 76 ఉన్నాయి. అంతకు ముందు కొత్త వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ ఇవ్వాలంటే నానా ఇబ్బందులు ఎదురయ్యేవి. ఇప్పుడు రైతు ఇలా మీసేవలో దరఖాస్తు చేసుకోగానే అలా కొత్త కనెక్షన్ మంజూరు చేస్తున్నారు.
కరెంటు ఇట్లుంటే ఇద్దరూ బతికేటోళ్లు
టీఆర్ఎస్ గవర్నమెంటుల ఉన్నట్లుగా కాంగ్రెస్ గవర్నమెంటుల కరెంటు మంచిగ ఉంటే మా నాన్న, బాబాయ్ చనిపోయేటోళ్లు కాదు. మా ఊరు భూపాలపల్లి మండలం గుడాడ్పల్లి. మాకు ఐదెకరాల భూమి ఉండేది. నాన్న వ్యవసాయం చేసేది. నాన్న కుందనపల్లి శంకర్, బాబాయ్ కుందనపల్లి తిరుపతి కరెంటు షాక్ కొట్టి చనిపోయారు. 2003లో నాన్న వ్యవసాయ బావి కాడికి పోయి కరెంటు కోసం ఎదురుచూస్తూ అక్కడే ఉన్నడు. కరెంటు వచ్చిన వెంటనే మోటారు ఆన్ చేస్తూ షాక్‌కు గురై అక్కడికక్కడే పాణం ఇడిశిండు. అమ్మ స్వరూప నన్ను, తమ్ముడు, చెల్లెను పెంచి పెద్ద చేసింది. అలాగే బాబాయ్ తిరుపతి కూడా కరెంటు మోటారు దగ్గర కరెంటు షాక్‌తో చనిపోయిండు. ఆనాడు రాత్రీపగలు అనే తేడా లేకుండా వ్యవసాయబావి దగ్గరే ఉండేటోళ్లు. కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కరెంటు సమస్య లేకుండా పోయింది. మేము వీలైనప్పుడు వెళ్లి పంటకు నీరు పెట్టుకుని వస్తున్నం. కరెంటు 24గంటలు ఉండడం వల్ల మా రెండెకరాల భూమిలో వరి సాగు చేస్తున్నాం. పంటకు సరిపడా నీళ్లు అందుతున్నాయి. ఎలాంటి ఇబ్బంది లేకుండాపోయింది. అనాడు కరెంటు సమస్యతో చాలామంది చనిపోయారు. ఇప్పుడున్న పరిస్థితులు అప్పుడు ఉంటే ఎంతోమంది బతికి ఉండేటోళ్లు.
– కుందనపల్లి విక్రమ్, గుడాడ్పల్లి, జయశంకర్ జిల్లా
కాంగ్రెస్ సర్కారే నా భర్తను పొట్టన పెట్టుకుంది
మాకు రెండెకరాల వ్యవసాయ భూమి ఉండేది. అందులో వరి, మక్క పండించుకుంట కుటుంబాన్ని పోషించుకుటోళ్లం. నాకు ఇద్దరు బిడ్డలు. వారిని మంచి చదువులు చదివించాలని నా భర్త రాజేంద్రప్రసాద్ పగలు, రాత్రి కష్టపడేది. 2011 సంవత్సరంలో నీళ్లు తక్కువగా ఉన్నాయని వరి వేయకుండా యాసంగి పంట కింద మక్కజొన్న పెట్టినం. అప్పుడు కరంటు సక్కగ ఉండకపోయేది. ప్రతి రోజు నా భర్త రాత్రిపూట బాయి కాడికి పోయి చేనుకు నీళ్లు కట్టేటోడు. పురుగుబూషి ఉంటయని చెప్పినా ఇనేటోడు కాదు. ఇంటికాడ ఉంటే పిలగాండ్ల ఖర్చులెట్ల అని రోజూ పోయెటోడు. గిట్లనే మార్చి 17 తారీఖున బాయికాడి పోయి నా భర్త తెల్లారె సరికి కరంటు షాక్ కొట్టి సచ్చిపోయిండని మావోళ్లు వచ్చి చెప్పిన్లు. గా రోజు ఇప్పటి దాక సుత నా కుటుంబం గిట్లనే ఉంది. భూమిని కౌలుకిచ్చి నేను కైకిలి పోవుకుంట ఇద్దరు ఆడపిల్లల్ని సాదుకుంటున్న. ఇప్పటి లాగ అప్పుడు నాభర్త సచ్చి పోతె సర్కారు నుంచి రూపాయి సుత రాలేదు.
– కంబాల తిరుమల, ఎల్కతుర్తి, హనుమకొండ జిల్లా
నాడు రైతులను ఆదుకున్న దిక్కు లేదు..
11 ఏండ్ల నాడు కరెంట్ లేక పంటలు పండించుకునేందుకు చాన తిప్పలు పడ్డం. ఆ రోజుల్లో బావిలో నీళ్లు, టైంకు కరెంట్ ఉండకపోయేది. ఏశిన పంటలు కండ్లముందే ఎండిపోయేటియి. శనక్కాయ పంటకు నీళ్లు పెట్టేందుకు ఆర్ధరాత్రి బాయి కాడికి పోయిన నా భర్త అజ్మీర బిచ్చ మోటర్ పెట్టుతుంటా వైరు తాకి షాక్ కొట్టి బావిలో పడి చనిపోయిండు. కానీ ఇద్దరు పిల్లలున్నరు. వారిని బతికించు కునేందుకు మా వాళ్లు ధైర్యం చెప్పిండ్రు. ఉన్న రెండు ఎకరాల్లో ఏం ఏశినా నీళ్లు లేక, కరెంట్ రాక ఎండిపోయినయ్. తిండికి లేక పనులకు పోయినం. నా భర్త చనిపోయిన్నాడు ఏ సర్కారోళ్లు సుత మా కుటుంబాన్ని ఆదుకోలేదు. ఇప్పుడు తెలంగాణ సర్కార్ వచ్చి నంక మా తండా పక్కనుంచే కాలువ నిండా నీళ్లు పోతానయ్. అప్పుడు చెనకాయ పండించుడే ఇబ్బంది ఉండేది. ఇప్పుడు మిరుపతోటలు పండించుకుంటున్నం. బాయికాడికి ఎప్పుడు పోయిన కరెంట్ ఉంటాంది. పంట పండించేందుకు ఏటా రూ.10 వేలు ఇస్తున్నరు. ఇప్పుడు ఏదన్న జరిగి రైతు సచ్చిపోతే కేసీఆర్ సర్కారు రూ.5 లక్షలు ఇత్తాంది. ఇంతమంచిగ ఆదుకుంటున్న కేసీఆర్ సార్‌కు అండగా ఉంటం.
– అజ్మీర కోటి, నర్సింహులపేట, మహబూబాబాద్ జిల్లా