శుక్రవారం 27 నవంబర్ 2020
Warangal-rural - Nov 14, 2020 , 02:12:14

నగరానికి నయా లుక్‌..

నగరానికి నయా లుక్‌..

  • ఆధునిక హంగులతో ఓరుగల్లుకు కొత్తందాలు
  • జిరాఫీ, నెమలి బొమ్మలు, సింబల్స్‌తో ఆకట్టుకుంటున్న జంక్షన్లు
  • జీవనశైలి, సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా రూపకల్పన
  • హాట్‌స్పాట్‌గా ‘వావ్‌ వరంగల్‌' సర్కిల్‌
  • అభివృద్ధికి సూచికగాలు నిలుస్తున్న కూడళ్లు
  • రూ.1.94 కోట్లతో అభివృద్ధి మారిన సిటీ రూపురేఖలు

చారిత్రక నగరం వరంగల్‌ కొత్తశోభ సంతరించుకుంది. దాదాపు రెండు దశాబ్దాల తర్వాత ఆధునిక హంగులతో జంక్షన్లను అభివృద్ధి చేయడంతో పాటు పలు విగ్రహాలు, సింబల్స్‌, వాటర్‌ ఫౌంటేన్ల ఏర్పాటుతో సిటీ సరికొత్తగా కనిపిస్తోంది. కాకతీయ అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ(కుడా) ఆధ్వర్యంలో నగరాన్ని హైదరాబాద్‌ తలపించేలా తీర్చిదిద్దుతోంది. వీటిలో జీవనశైలితో పాటు సంస్కృతీ సంప్రదాయాలను తెలిపే విగ్రహాలను ఏర్పాటుచేయగా నగరవాసులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా ‘వావ్‌ వరంగల్‌' జంక్షన్‌, హన్మకొండ ప్రసూతి దవాఖాన ఎదుట తల్లీబిడ్డల అనుబంధాన్ని తెలిపే విగ్రహాలతో ‘మమత’ జంక్షన్‌ ప్రత్యేకత సొంతం చేసుకోగా మిగతా వాటిని ఇలా ఒక కాన్సెప్ట్‌తో అభివృద్ధి చేస్తోంది.

- వరంగల్‌ ప్రతినిధి, నమస్తే తెలంగాణ 

వావ్‌ జంక్షన్‌

హైదరాబాద్‌ నుంచి వరంగల్‌ నగరానికి వచ్చే మార్గంలో ఫాతిమా సెంటర్‌లో ఏర్పాటు చేసిన వావ్‌ వరంగల్‌(వావ్‌) సింబల్‌ నగరానికి కొత్త అందాన్ని తెచ్చింది. ఈ కూడలిని ఇప్పుడు వావ్‌ వరంగల్‌ జంక్షన్‌ అని పిలుస్తున్నారు. జంక్షన్‌ కార్నర్‌లో వావ్‌ సింబల్‌ చుట్టూ అందమైన గార్డెన్‌ ఏర్పాటు చేశారు. దీని వెనుక ఉన్న వాటర్‌ ఫౌంటేన్‌ రాత్రి సమయంలో రంగురంగుల విద్యుత్‌ లైట్లతో ఆకట్టుకుంటోంది. రూ.12 లక్షలతో జీడబ్ల్యూఎంసీ ఈ జంక్షన్‌ను అభివృద్ధి చేసింది.

కేయూ జంక్షన్‌

కాకతీయ యూనివర్సిటీ జంక్షన్‌లో విజ్ఞానాన్ని ప్రతిబింబించేలా అభివృద్ధి చేశారు. ఇక్కడ రాతిపై మనిషి తల విగ్రహాలను ఏర్పాటు చేశారు. జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలంటే మెదడు, మనసును బ్యాలెన్స్‌గా ఉంచాలనే సూక్తితో విగ్రహాలను ఏర్పాటు చేసినట్లు కుడా అధికారులు తెలిపారు. రూ.5 లక్షలతో జంక్షన్‌ను అభివృద్ధి చేశారు.

ఆకట్టుకుంటున్న జిరాఫీ జంక్షన్‌

హన్మకొండ బస్‌స్టేషన్‌ జంక్షన్‌ వైపు పోవాలంటేనే వామ్మో అనే పరిస్థితి ఉండేది. ఇప్పుడు పూర్తిగా మారింది. బస్టాండ్‌ జంక్షన్‌ సర్వాంగసుందరంగా ముస్తాబైంది. హన్మకొండలోని నాలుగు కీలక రోడ్ల కూడలిగా ఉండే ఈ ప్రాంతాన్ని కుడా రూ.1.50 కోట్లతో జిరాఫీ జంక్షన్‌గా అభివృద్ధి చేశారు. విశాలమైన రోడ్లతో ఈ జంక్షన్‌ను విస్తరించగా ఇప్పుడు గ్రేటర్‌ వరంగల్‌లోనే మోడల్‌గా మారింది. జంక్షన్‌ మధ్యలో అందమైన పూల మొక్కలతో పాటు వాటర్‌ ఫౌంటేన్‌ను ఏర్పాటు చేశారు. పక్కన పది అడుగుల ఎత్తుతో రెండు జిరాఫీ బొమ్మలను ఏర్పాటుచేశారు. దీంతో సెంటర్‌ను జిరాఫీ జంక్షన్‌గా పిలుస్తున్నారు.

ప్రసూతి దవాఖాన వద్ద ‘మమతల తల్లి’

మమతానురాగాలకు వేదికగా భావించే ప్రభుత్వ ప్రసూతి దవాఖాన ఎదురుగా ఉన్న ఈ కూడలిని రూ.10 లక్షలతో అభివృద్ధి చేశారు. దశాబ్దాలుగా లక్షల మంది పేదలకు జన్మస్థలంగా నిలిచిన ప్రసూతి ఆసుపత్రి ముందు ప్రత్యేకంగా బిడ్డను చంకన ఎత్తుకున్న తల్లి విగ్రహం ఏర్పాటు చేశారు. ఒడిశా నుంచి తెప్పించిన ప్రత్యేక రాయిపై తల్లీబిడ్డల విగ్రహాన్ని చెక్కారు. కాకతీయుల కళాఖండాన్ని తలపించేలా దీనిని తయారు చేశారు. దీంతో ఆ కూడలిని మమత జంక్షన్‌గా పిలుస్తున్నారు.

పచ్చని చెట్లతో పోతన జంక్షన్‌

గ్రేటర్‌ వరంగల్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌(జీడబ్ల్యూఎంసీ) ప్రధాన కార్యాలయం ఎదురుగా రూ.12 లక్షలతో పోతన జంక్షన్‌ను అభివృద్ధి చేశారు. ఎంజీఎం గోడకు అనుకొని ఉన్న స్థలంలో బమ్మెర పోతన విగ్రహం ఏర్పాటు చేశారు. పోతనతో పాటు చదువుతున్న శిష్యుల విగ్రహాలను పొందుపర్చారు. పచ్చని గార్డెన్‌, ఈత చెట్లు, స్తంభంపై నెమలి విగ్రహంతో పోతన జంక్షన్‌ను తీర్చిదిద్దారు. రాత్రివేళ విద్యుద్దీపాల వెలుగులో పోతన జంక్షన్‌ కళకళలాడుతోంది.

జీవనశైలిని తెలిపే ‘లైఫ్‌ైస్టెల్‌ జంక్షన్‌'

హంటర్‌రోడ్డులోని వరంగల్‌-హన్మకొండ-ఖమ్మం రోడ్లను కలిపే సీఎస్‌ఆర్‌ గార్డెన్‌ జంక్షన్‌కు కొత్త కళ వచ్చింది. ఇక్కడ ఏర్పాటుచేసిన బొమ్మలు మనిషి జీవనశైలిని తెలియజేస్తున్నాయి. మానవ జీవనశైలి, సంస్కృతి, సంప్రదాయాలు ప్రతిబింబించేలా విగ్రహాలను తీర్చిదిద్దారు. మెడకు జోలె కట్టుకుని అందులో బిడ్డను పెట్టుకొని ఇటుకలు మోస్తున్న మహిళ విగ్రహం.. కష్టజీవి బతుకు చిత్రానికి అద్దం పడుతోంది. రూ.5 లక్షలతో ఈ జంక్షన్‌ను అభివృద్ధి చేశారు.