సోమవారం 23 నవంబర్ 2020
Warangal-rural - Oct 17, 2020 , 01:38:03

విరిసిన వాకిళ్లు

విరిసిన వాకిళ్లు

  • వాడవాడలా పూల వేడుక..
  • ఎంగిలిపూలతో మొదలైన బతుకమ్మ సంబురాలు
  • కొన్ని ప్రాంతాల్లో ఇంటి వద్దే ఆడిన మహిళలు
  • కరోనా, అధిక మాసం వల్ల తగ్గిన సందడి
  • పలుచోట్ల వర్షంలోనూ ఆడిపాడిన ఆడబిడ్డలు

ఎంగిలిపూల బతుకమ్మ వేడుక ఉమ్మడి జిల్లాలో శుక్రవారం సంబురంగా సాగింది. పల్లె, పట్టణం తేడా లేకుండా ఉదయం నుంచే తీరొక్క పూలతో బతుకమ్మలను పేర్చిన ఆడబిడ్డలు, సాయంత్రం వాకిళ్లు, కూడళ్లు, ఆలయాల వద్ద ఉంచి ఆడిపాడడంతో ఆయా ప్రాంతాలు హోరెత్తాయి. ఓవైపు కరోనా, మరోవైపు వర్షం, అధికమాసం కారణంగా ఈసారి కాస్త సందడి తగ్గినా వానలోనూ పలుచోట్ల మహిళలు బతుకమ్మ ఆడడం కనిపించింది.   

-నమస్తే తెలంగాణ, నెట్‌వర్క్‌


ఆడబిడ్డల పూల పండుగ శుక్రవారం ఎంగిలి పూలతో మొదలైంది. తీరొక్క పూలతో అందంగా పేర్చిన బతుకమ్మలతో ఆలయాలు, కూడళ్ల వద్దకు చేరి ‘బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో.. బంగారు బతుకమ్మ ఉయ్యాలో’ పాటలతో వేడుక సంబురంగా సాగింది. కరోనాతో పాటు అధిక మాసం వచ్చినందున చాలామంది ఇండ్ల వద్దే బతుకమ్మ ఆడడంతో ఈసారి సందడి తగ్గినప్పటికీ హన్మకొండలోని చారిత్రక వేయిస్తంభాల ఆలయం, కాశీ విశ్వేశ్వరాలయంతో పాటు జనగామ, జయశంకర్‌ భూపాలపల్లి, మహబూబూబాద్‌ జిల్లాల్లో ఆటాపాటలతో హోరెత్తించారు. ఓ వైపు వర్షం కురుస్తున్నా గొడుగులు పట్టుకొని మరీ ఆడడం కనిపించింది. ఆ తర్వాత ఒకరికొకరు వాయినాలు ఇచ్చిపుచ్చుకున్నారు. అధికమాసం వచ్చినందున పితృ అమావాస్య నాడు ఆడిన వారు ఈ అమావాస్యకు బతుకమ్మ ఆడకూడదనే ఆచారాన్ని చాలామంది పాటించారు. కాగా ఆడపడుచులు తమ ఇళ్ల ముందు ఆడిన బతుకమ్మలను తర్వాతి రోజు చెరువుల్లో నిమజ్జనం చేసేలా ఏర్పాట్లుచేస్తున్నట్లు మేయర్‌ గుండా ప్రకాశ్‌ తెలిపారు.      

 - వరంగల్‌ కల్చరల్‌/రెడ్డికాలనీ