ములుగు, సెప్టెంబర్ 21(నమస్తేతెలంగాణ)/తాడ్వాయి : స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ అన్ని పండుగలకు ప్రాధాన్యతనిస్తూ పెద్దమొత్తంలో నిధులు విడుదల చేస్తున్నారని, అందులో భాగంగానే ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతర అయిన మేడారం సమ్మక్క-సారలమ్మ మహా జాతరకు ప్రతిసారీ రూ.100కోట్ల చొప్పున విడుదల చేసి శాశ్వత నిర్మాణాలు చేపట్టారని రాష్ట్ర గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతిరాథోడ్ అన్నారు. రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, జడ్పీ చైర్పర్సన్ బడే నాగజ్యోతి, రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్లు ఏరువ సతీష్‌రెడ్డి, మెట్టు శ్రీనివాస్, బీఆర్ఎస్ ములుగు జిల్లా అధ్యక్షుడు కాకులమర్రి లక్ష్మణ్‌రావుతో కలిసి గురువారం తాడ్వాయి మండలం మేడారంలో పర్యటించారు. సమ్మక్క-సారలమ్మను దర్శించుకొని చీరె, సారెలు, ఎత్తు బెల్లాన్ని సమర్పించారు.
అనంతరం రూ.2.15కోట్లతో అతిథి గృహానికి శంకుస్థాపన చేశారు. వచ్చే జాతరపై ఐటీడీఏ అతిథి గృహంలో వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ముందుగా మంత్రి సత్యవతి మాట్లాడుతూ మేడారం జాతరకు సీఎం కేసీఆర్ ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నారని అన్నారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేసి జాతరను విజయవంతం చేయాలని కోరారు. గత జాతరలకు శాశ్వత ప్రాతిపదికన పనులు చేశామని, వచ్చే జాతరలోనూ భక్తులకు ఎక్కడా ఇబ్బందులు కలుగకుండా చూడాలన్నారు. ప్రణాళికా బద్ధంగా అభివృద్ధి పనులను నాణ్యతా ప్రమాణాలతో పూర్తి చేయాలన్నారు. రాబోయే జాతరకు రూ.75కోట్లకు తగ్గకుండా ప్రతిపాదనలు రూపొందించామని చెప్పారు. ములుగు జిల్లా కేంద్రంలో బస్టాండ్ నిర్మాణం కోసం రూ.11 కోట్లు మంజూరు చేసినట్లు తెలిపారు.
రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవతో మేడారం జాతరలో శాశ్వత ప్రాతిపదికన సౌకర్యాలు కల్పిస్తూ వస్తున్నారని మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. జాతర నిర్వహణ అధికారులకు పెద్ద టాస్క్ వంటిదని, ఎన్నికల సందర్భంగా భక్తులకు అసౌకర్యాలు కలుగవద్దనే ఉద్దేశంతో ముందస్తుగానే పనులకు శంకుస్థాపన చేశామని చెప్పారు. జాతర అభివృద్ధి పనులను అక్టోబర్‌లో ప్రారంభించి నాణ్యతతో పూర్తి చేయాలని సూచించారు. గోదావరి పుష్కరాలతో పాటు మేడారం జాతరకు సీఎం కేసీఆర్ ఎంతో ప్రాధాన్యమిస్తున్నారని చెప్పారు. భారీ వర్షాల కారణంగా దెబ్బతిన్న రోడ్లు, భవనాల మరమ్మతులను త్వరగా పూర్తి చేయాలన్నారు. ములుగు జిల్లాపై సీఎం కేసీఆర్‌తో పాటు మంత్రి కేటీఆర్ ప్రత్యేక దృష్టి సారించారని చెప్పారు.
జాతరలో భక్తుల కోసం దేవాదాయ శాఖ ద్వారా రూ.15కోట్ల అంచనాలతో పనులు చేపడుతామన్నారు. రూ.కోటీ 50లక్షలతో డార్మెటరీ హాల్, రూ.94లక్షలతో పూజా మందిరం, పోలీస్ క్యాంపు కార్యాలయం అభివృద్ధి పనులకు ప్రణాళికలు రూపొందించామన్నారు. కలెక్టర్ ఇలా తిపాఠి మాట్లాడుతూ వర్షాలతో దెబ్బతిన్న రోడ్ల పనులను అక్టోబర్‌లో చేపడుతామన్నారు. జాతర నిర్వహణపై ప్రణాళికాబద్ధంగా అన్ని శాఖల సమన్వయంతో ఇప్పటికే బడ్జెట్ రూపకల్పన చేశామని, జాతరను విజయవంతం చేసేందుకు జిల్లా యంత్రాంగం సిద్ధంగా ఉందని తెలిపారు. మంత్రుల వెంట ఎస్పీ గౌష్ ఆలం, డీఎఫ్ఓ రాహుల్ కిషన్ జాదవ్, పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్దబోయిన జగ్గారావు, సర్పంచ్ చీడెం బాబురావు, ఎంపీపీలు గొంది వాణిశ్రీ, గండ్రకోట శ్రీదేవి, శ్రీనివాస్‌రెడ్డి , బీఆర్ఎస్ తాడ్వాయి మండలాధ్యక్షుడు దండుగుల మల్లయ్య తదితరులున్నారు.