బీఆర్ఎస్ రజతోత్సవ సభకు సమయం సమీపించడంతో గులాబీ దండు ఎల్కతుర్తికి దారి కడుతున్నది. పాదయాత్రలు.. ఎడ్లబండ్లు, ప్రభబండ్ల ద్వారా జాతరవోలె కదలివస్తున్నది. ఇప్పటివరకు ఎక్కడికక్కడ సన్నాహక సమావేశాల ద్వారా దిశానిర్దేశం చేసిన ఉమ్మడి జిల్లా నేతలందరూ ఇక క్షేత్రస్థాయికి వెళ్లి శ్రేణులతో కలిసి ప్రచారంలో జోరు పెంచారు. అలాగే ఇంటింటికీ వెళ్లి బొట్టు పెట్టి ఆడబిడ్డలను ఆహ్వానిస్తూ, బైక్ ర్యాలీలు తీస్తూ జనంతో మమేకవుతున్నారు. ఈ సందర్భంగా ఊరూవాడన ఎక్కడ చూసినా గులాబీ జోరు కనిపిస్తుండగా దారులన్నీ కేసీఆర్ ఫ్లెక్సీలు, కటౌట్లతో కళకళలాడుతున్నాయి.
రాష్ట్రంలోని వివిధ నియోజకవర్గాల నుంచి శుక్రవారం నేతలు తరలివచ్చి రజతోత్సవ సభా ప్రాంగణం, తమకు కేటాయించిన పార్కింగ్ స్థలాలను చూశారు. మాజీ మంత్రులు గంగుల కమలాకర్, సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు సుంకె రవిశంకర్, ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి రేగా కాంతారావు, హరిప్రియ, కామారెడ్డి నుంచి జాజుల సురేందర్ తదితర నేతలు సభా స్థలికి రాగా, వారికి ఎమ్మెల్సీలు పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, తక్కళ్లపల్లి రవీందర్రావు, బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గ్యాదరి బాలమల్లు, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్‌భాస్కర్, మాజీ ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్‌రెడ్డి, వొడితెల సతీశ్‌కుమార్, నాగుర్ల వెంకటేశ్వర్లు, ఏనుగుల రాకేశ్‌రెడ్డి తదితరులు ఏర్పాట్లను వివరించడంతో పాటు వారికి కేటాయించిన పార్కింగ్ స్థలాలను చూపించారు.
బీఆర్ఎస్ రజతోత్సవ సభకు ప్రజలు భారీగా తరలివచ్చి విజయవంతం చేయాలని కోరుతూ పార్టీ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్‌భాస్కర్ నగరంలోని 11, 29వ డివిజన్లలోని భద్రకాళి టెంపుల్, రామన్నపేట, బెస్త సంఘం, రఘునాథ్ కాలనీ, రంగంపేటలో ఇంటింటికీ వెళ్లి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రేణులతో కలిసి బైక్ ర్యాలీ నిర్వహించారు. మాజీ కార్పొరేటర్ వద్దిరాజు గణేశ్, డివిజన్ అధ్యక్షుడు కొడకండ్ల సదాంత్ ఉన్నారు. – మట్టెవాడ, ఏప్రిల్ 25