e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, July 31, 2021
Home జనగాం వడివడిగా ‘బృహత్‌' పనులు

వడివడిగా ‘బృహత్‌’ పనులు

వడివడిగా ‘బృహత్‌' పనులు

మెగా పల్లె ప్రకృతి వనాల ఏర్పాటు ప్రక్రియ వేగవంతం
రూరల్‌ జిల్లాలో ఇప్పటికే 18 గ్రామాల్లో 156 ఎకరాల స్థలం గుర్తింపు
గీసుగొండ మండలంలో రెండు పార్కులు
శాయంపేటలోని మూడు గ్రామాల్లో కలిపి పదెకరాల సేకరణ
పరిశీలించిన ఉన్నతాధికారులు.. చదునుకు సన్నద్ధం

వరంగల్‌ రూరల్‌, జూలై 14(నమస్తే తెలంగాణ) : మండలానికో బృహత్‌ పల్లె ప్రకృతి వనం ఏర్పాటు ప్రక్రియ వేగవంతమైంది. ఇప్పటికే ప్రతి గ్రామంలో పల్లె ప్రకృతి వనాలను నిర్మించిన రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల మండల కేంద్రాల్లో పదెకరాల విస్తీర్ణంలో మెగా వనాలను సిద్ధం చేయాలని ఆదేశించింది. ఈ మేరకు అధికార యంత్రాంగం స్థలాలను సేకరిస్తుండగా ఇప్పటికే రూరల్‌ జిల్లాలోని 18 గ్రామాల్లో 156.25 ఎకరాలను గుర్తించింది. స్థలాన్ని చదును చేసిన తర్వాత యాదాద్రి మోడల్‌ ప్లాంటేషన్‌ తరహాలో మొక్కలు నాటేందుకు సమాయత్తమవుతున్నది.

బృహత్‌ పల్లె ప్రకృతి వనాల కోసం అధికారులు కసరత్తు ముమ్మరం చేశారు. యాదాద్రి మోడల్‌ ప్లాంటేషన్‌ మాదిరిగా మండలానికో మెగా పల్లె ప్రకృతి వనం ఏర్పాటు చే యాలని ప్రభుత్వం మార్గదర్శకాలు కూడా విడుదల చేయడంతో స్థల సేకరణ పనుల్లో వేగం పెంచారు. వరంగల్‌ రూరల్‌ జిల్లాలో ఇప్పటివరకు 18 గ్రామాల్లో 156.25 ఎకరాల ప్రభుత్వ స్థలాలను గుర్తించారు. పరకాల మినహా మిగిలిన 15 మండలాల్లో స్థలాల గుర్తింపు పూర్తయింది. శాయంపేట మండలంలో ఒకేచోట పదెకరాల ప్రభుత్వ స్థలం లేకపోవడంతో మూడు గ్రామాల్లో కలిపి సేకరించారు. ఆత్మకూరు, చెన్నారావుపేట మండలాల్లోనూ ఒకేచోట స్థలం లేనందున అందుబాటులో ఉన్న తొమ్మిదేసి ఎకరాలను గుర్తించారు. కొన్ని మండలాల్లో ఎస్సారెస్పీ స్థలాలను, దుగ్గొండి, నర్సంపేట మండలాల్లో గ్రామ పంచాయతీ స్థలాలను సేకరించారు. ప్రభుత్వ స్థలాలు అందుబాటులో ఉండడం వల్ల ఆత్మకూరు, దామెర, ఖానాపురం మండలకేంద్రాల్లోనే బృహత్‌ పల్లె ప్రకృతి వనాల ఏర్పాటుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. గీసుగొండ మండలంలో రెండు మెగా పార్కుల కోసం ప్రభుత్వ స్థలాలను ఎంపిక చేయడం విశేషం.

- Advertisement -

స్థలాలు గుర్తించింది ఇక్కడే..
ఆత్మకూరు మండలకేంద్రం, చెన్నారావుపేట మండలం పాపయ్యపేట, దామెర మండల కేంద్రం, దుగ్గొండి మండలం దేశాయిపల్లి, గీసుగొండ మండలం బొడ్డుచింతలపల్లి, వంచనగిరి, ఖానాపురం మండలకేంద్రం, నడికూడ మండలం ధర్మారం, నల్లబెల్లి మండలం కన్నారావుపేట, నెక్కొండ మండలం బొల్లికొండ, పర్వతగిరి మండలం కొంకపాక, రాయపర్తి మండలం తిర్మలాయపల్లి, సంగెం మండలం తిమ్మాపూర్‌, శాయంపేట మండలం పెద్దకోడెపాక, శాయంపేట, మైలారం, వర్ధన్నపేట మండలం ఉప్పరపల్లి, నర్సంపేట మండలం మహేశ్వరంలో స్థలాలను ఎంపిక చేశారు. పరకాల మండలం పార్కు ఏర్పాటుపై స్పష్టత రాలేదు.

ఉన్నతాధికారుల పరిశీలన..
18 గ్రామాల్లో వనాల ఏర్పాటుకు అధికారులు రంగంలోకి దిగారు. స్థలాలను మూడు రోజులుగా అదనపు కలెక్టర్‌ బీ హరిసింగ్‌, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి ఎం సంపత్‌రావు, జిల్లా పంచాయతీ అధికారి ప్రభాకర్‌, వరంగల్‌ రూరల్‌ ఆర్డీవో మహేందర్‌జీ, తహసీల్దార్లు, డీఎల్‌పీవోలు, ఎంపీడీవోలు, ఎంపీవోలు, ఇతర అధికారులు పరిశీలించారు. దారులు, పిల్లల ఆటస్థలం కోసం స్థలం కేటాయించి మొక్కలు నాటే ఏర్పాట్లు చేస్తున్నారు. కలెక్టర్‌ హరిత సూచనలన మేరకు ముందుకు పోతున్నారు.

మార్గదర్శకాలు ఇవీ..
ఒక్కో బృహత్‌ పల్లె ప్రకృతి వనంలో 31వేల మొక్కలు నాటాలని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. ఈ మేరకు మార్గదర్శకాలు జారీ చేసింది. పదెకాల విస్తీర్ణంలో నిర్మించే ఈ పార్కులు ఎలా ఉండాలి? ఆటస్థలానికి ఎంత స్థలం ఉండాలి?, ఎంత విస్తీర్ణంలో మొక్కలు నాటాలో స్పష్టంగా పేర్కొన్నది. మొక్కల ఎంపికలో అటవీశాఖ అధికారుల సాంకేతిక సహాయం తీసుకోవాలని సూచించింది.

నాలుగు సమాన భాగాలు..
ప్రకృతి వనాల నమూనా చిత్రాలను ప్రభుత్వం అధికారులకు పంపింది. దీని ప్రకారం.. పదెకరాలను నాలుగు సమాన భాగాలుగా విభజిస్తారు. పార్కు మధ్యలో పిల్లల ఆట స్థలం, పది అడుగుల పాదచారుల దారి, నీటి సదుపాయం, అంతర్భాగంలో ఎనిమిది అడుగుల దారి నిర్మిస్తారు. నలువైపులా ఒక్కో భాగం 1.715 ఎకరాలు ఉండేలా నాలుగు సమాన భాగాలను నిర్దేశిస్తారు. ఈ నా లుగు భాగాలకు 6.86, పార్కు చుట్టూ మూడు వరుసలు మొక్కలు నాటేందుకు 1.56 ఎకరాలు, మధ్యలో పిల్లల ఆట స్థలం కోసం 0.75 ఎకరం, కంచె కోసం 0.14 ఎక రం, దారుల కోసం 0.69 ఎకరం కేటాయిస్తారు. పిల్లల ఆటస్థలం, పాదచారుల దారి కోసం కేటాయించిన స్థలాన్ని వదిలి మిగతా స్థలాన్ని ట్రాక్టర్‌తో రెండుసార్లు దున్నిస్తారు. సేంద్రియ ఎరువును దున్నే సమయంలో కలిపి భూమికి సహజగుణం వచ్చేలా చేస్తారు. వ్యవసాయ వ్యర్థ పదార్థాలు, వరిగడ్డి, వేపాకు, కానుగ, గ్లిరిసిడియా వంటివి కూ డా భూమిపై పరచడం వల్ల భూమిలోని తేమ పెంపొంది కోత, కలుపు మొక్కలను నివారించే చర్యలు తీసుకుంటారు. ఆట స్థలంలో కూర్చునేందుకు బల్లలు వేస్తారు.

ప్రతి భాగంలో 6,975 మొక్కలు
ఏడాది పొడవునా పచ్చగా ఉండే అడవి జాతి మొక్కలను మీటరుకు ఒకటి చొప్పున నాటుతారు. వీటిలో చింత మొక్కలు ఎక్కువ ఉండాలని ప్రభుత్వం ఆదేశించింది. 1.715 ఎకరాలతో కూడిన ప్రతి భాగంలో 6,925 చొప్పున నాలుగు భాగాల్లో 27,700 మొక్కలు, చుట్టూ 1.56 ఎకరాల్లో బాహ్య వలయంలో మూడు వరుసల్లో 3,300 మొక్కలు నాటుతారు. ప్రతి భాగంలో ఉసిరి, నేరేడు, టేకు, వెలగ, వేప, ఇప్ప, చందనం, రేగు, కుంకుడు, పనస, చీమ చింత, అందుగ, నెమలినార, చింత, ఈత, హెన్నా, సీతాఫలం, జామ, దానిమ్మ, కల్యమాకు, నిమ్మ, తాటి, వెదురు, జమ్మి, వావిలి, తంగేడు, అడ్డసారం, పారిజాతం, తిప్పతీగ, పొడపత్రి తదితర మొక్కలు ఉండాలని, బాహ్య వలయంలో జీవకంచ కోసం వెదురు, గచ్చకాయ, గోరింట మొక్కలు నాటాలని ప్రభుత్వం సూచించింది. యాదాద్రి అటవీ నమూనా ప్రకారం పెంచేందుకు గుంతలు తవ్వడం, మొక్కలు నాటడం, కాపలాదారు, నీటి వసతి, మొక్కల నిర్వహణ తదితర పనులకు నిధులు కేటాయించనుంది.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
వడివడిగా ‘బృహత్‌' పనులు
వడివడిగా ‘బృహత్‌' పనులు
వడివడిగా ‘బృహత్‌' పనులు

ట్రెండింగ్‌

Advertisement