వరంగల్, ఏప్రిల్ 24 : వరంగల్ తూర్పు నియోజవర్గ పరిధిలోని పోలింగ్ కేంద్రాల్లో మౌలిక వసతులు కల్పించాలని తూర్పు ఏఆర్వో, గ్రేటర్ కమిషనర్ అశ్విని తానాజీ వాకడే అన్నారు. బుధవారం కార్పొరేషన్లో ఎన్నికల నోడల్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. లోకసభ ఎన్నికలపై ప్రజల అనుమానాలు నివృత్తి చేసేందుకు బల్దియాలో టోల్ ఫ్రీ నంబర్ 9701999645తో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామన్నారు. తూర్పు పరిధిలో 230 పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లకు అన్ని సౌకర్యాలు కల్పించనున్నామన్నారు. ఓటర్లకు నీడ కల్పించాలన్నారు.
ఎన్నికలకు వారం ముందే వెబ్ కాస్టింగ్ పనులు పూర్తి చేయాలని సూచించారు. నియోజవర్గ పరిధిలో 46 ప్రైవేట్ పాఠశాలల్లో పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని, ఆయా కేంద్రాల నంబర్లను పెయింటింగ్ చేయించాలన్నారు. పోస్టల్ బ్యాలెట్లు ఇప్పటికే 1511 పంపిణీ చేశామని చెప్పారు. పోస్టల్ బ్యాలెట్‌ను వినియోగించడానికి బల్దియా కార్యాలయం, ఎల్బీ కళాశాలలో స్ట్రాంగ్ రూంలు ఏర్పాటు చేయాలని, సీసీ కెమెరాలను అమర్చాలన్నారు. పోలింగ్ మెటీరియల్‌ను ఇప్పటి నుంచే సిద్ధం చేసుకోవాలని పోలింగ్ మెటీరియల్ నోడల్ అధికారికి కమిషనర్ సూచించారు.
నిర్దేశిత ప్రమాణాల ప్రకారం మేరకే భవనాలు నిర్మించాలని గ్రేటర్ కమిషనర్ అశ్విని అన్నారు. నగరంలోని గోపాల్పూర్, భీమారం, కిట్స్ కళాశాల ప్రాంతం, సిద్ధార్థనగర్, ప్రకాశ్‌రెడ్డి పేట, శంభునిపేట ప్రాంతాల్లో భవన నిర్మాణాల మంజూరు, ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ల జారీ కోసం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. టీఎస్ బీపాస్ నిబంధనలు తప్పకుండా పాటించాలన్నారు. కార్యక్రమంలో సిటీ ప్లానర్ వెంకన్న, సీఎంహెచ్వో రాజేశ్, టౌన్‌ప్లానింగ్ అధికారి బషీర్, శానిటరీ ఇన్స్పెక్టర్లు బాషానాయక్, భీమయ్య, కరుణాకర్ పాల్గొన్నారు.