తిమ్మాపూర్, మార్చి 12 : ఎవరికైనా ఆపద వస్తే పోలీసులే ముందుగా గుర్తుకు వస్తారు. వారిని ఆశ్రయిస్తే న్యాయం జరుగుతుందనే ఒక నమ్మకంతో ఉంటారు. అలాగే, పోలీసులు సైతం క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి కేసులు నమోదు చేస్తారు. కానీ, మానకొండూర్ నియోజకవర్గంలో మాత్రం అదృశ్య శక్తుల ఒత్తిళ్లతో అందుకు విరుద్ధంగా జరుగుతున్నదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఏకంగా పోలీస్ వ్యవస్థను తమ చేతుల్లో పెట్టుకొని, తమ వాళ్లపై చర్యలు లేకుండా కాపాడుకుంటున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఫిర్యాదులు వచ్చినట్టు తెలిస్తే చాలు.. ‘మా వాళ్లా.. వదిలెయ్’ అన్న ఆదేశాలు ఇస్తూ కేసులను పక్కదారి పట్టిస్తున్నారని తెలుస్తున్నది.
అందుకు అనేక ఉదాహరణలు ఉన్నట్టు తెలుస్తుండగా, గత ఆదివారం ‘నమస్తే తెలంగాణ’లో ప్రచురితమైన ‘ఎస్ఐపై దౌర్జన్యం?’ కథనం ప్రకంపనలు సృష్టించింది. పోలీస్ శాఖలో కలకలం రేపగా, మూడు నాలుగు రోజులుగా ఈ కథనం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. ఎస్ఐపై బరితెగించిన ఆ అధికారపార్టీ నాయకుడు ఎవరా? అనే చర్చ జోరుగా సాగింది. తమపైన దాడి జరిగినా కేసు పెట్టరా? అని మరికొందరు పోలీసులు చర్చించుకుంటున్నట్టు తెలిసింది. అయితే ఇలాంటి ఎన్నో ఘటనలు ఉన్నా బయటికి రానివి అనేకం ఉంటున్నట్టు తెలుస్తున్నది. ఏదైనా ఘటన జరిగిప్పుడు విచారించి చర్యలు తీసుకోవాల్సిన పోలీస్ శాఖలో అదృశ్య శక్తుల ప్రమేయంతో పలుచన పడుతున్నదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.