మేడ్చల్, ఏప్రిల్ 24 (నమస్తే తెలంగాణ) : ‘కేసీఆర్ పదేండ్ల పాలనలో జరిగిన అభివృద్ధి.. రేవంత్‌రెడ్డి వంద రోజుల అబద్ధపు పాలన..కండ్ల ముందే ఉన్నది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు సీఎం రేవంత్‌రెడ్డి మోసం పార్ట్- 1 సినిమా చూపించి.. గద్దెనెక్కారు. ఈ పార్లమెంట్ ఎన్నికల ముందు మోసం పార్ట్- 2 సినిమా చూపించేందుకు వస్తున్నారు.. ఆయనకు ఈ అవకాశం ఇవ్వొద్దు. బీజేపీని ఆపే శక్తి ఒక్క కేసీఆర్‌కే ఉంది’. అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.
బుధవారం బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి నామినేషన్ సందర్భంగా మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా తూంకుంట పరిధిలో బుధవారం సభను నిర్వహించారు. ఈ సభకు కేటీఆర్‌తో పాటు ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, ఎమ్మెల్యేలు కేపీ వివేకానంద్, మాధవరం కృష్ణారావు, చామకూర మల్లారెడ్డి, బండారి లక్ష్మారెడ్డి, సుధీర్‌రెడ్డి, ఎమ్మెల్సీలు సురభివాణీదేవి, దయానంద్‌గుప్తా, నాయకులు జహంగీర్, సోమశేఖర్ రెడ్డి, శ్రీధర్, భాస్కర్ తదితరులు హాజరయ్యారు.
సభను ఉద్దేశించి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రసంగిస్తూ.. 10 నుంచి 12 పార్లమెంట్ స్థానాల్లో బీఆర్ఎస్ను గెలిపించుకుంటే.. రాష్ట్ర, దేశ రాజకీయాలు కేసీఆర్ చుట్టూ తిరుగుతాయన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో రేవంత్‌రెడ్డి ఎన్నో హామీలిచ్చి..అధికారంలో వచ్చారని, 100 రోజులు గడిచినా.. ఇచ్చిన హామీలను నెరవేర్చడం లేదని విమర్శించారు. 10 ఏండ్ల బీఆర్ఎస్ నిజం…వంద రోజుల కాంగ్రెస్ అబద్ధం.. కండ్ల ముందే ఉన్నదని, ఆలోచించి ఓటెయ్యాలని ప్రజలను కోరారు. ఇంకా కేటీఆర్ ఏమన్నారో ఆయన
అసెంబ్లీ ఎన్నికల్లో రేవంత్‌రెడ్డి రుణ మాఫీ చేస్తానని, ఆడబిడ్డలకు రూ. 2500 ఇస్తానని, పింఛన్‌ను రూ.4వేలకు పెంచుతానని, ఆడబిడ్డ పెండ్లికి రూ. లక్షతో పాటు తులం బంగారం ఇస్తామని, స్కూటీలు ఇస్తామని హామీలు ఇచ్చారు. అధికారంలోకి రాగానే డిసెంబర్ 9న రుణ మాఫీ చేస్తానని చెప్పినా.. అమలు కాలేదు. తులం బంగారం, రూ. 4వేల పింఛన్ రావడం లేదు.
ఫ్రీ బస్సును కూడా తీసివేసే పరిస్థితి ఉంది. ఇప్పుడు కొత్తగా రేవంత్‌రెడ్డి మోసం పార్ట్- 2కు తెరలేపారు. యాదాద్రి పోయి లక్ష్మీనర్సింహస్వామి సాక్షిగా, బాసరకు పోయి సరస్వతీ మాత సాక్షిగా.. ఆగస్టు 15న రుణ మాఫీ చేస్తానని హామీ ఇస్తున్నారు. మొదటి సారి మోసపోతే.. మోసం చేసిన వాడిది తప్పు అవుతుంది. రెండో సారి మోసపోతే.. మనదే తప్పు అవుతుంది. ఆగం కావొద్దు…కాంగ్రెస్ మోసం బంద్ కావాలంటే.. బీఆర్ఎస్ అభ్యర్థులను ఈ ఎన్నికల్లో ఎంపీలుగా గెలిపించుకోవాల్సిన అవసరమున్నది.
రేవంత్‌రెడ్డికి బడే భాయ్.. మోదీకి చోటే భాయ్‌గా.. వ్యవహరిస్తున్నారు. లిక్కర్ స్కాం లేదు.. ఏమీ లేదు.. సీఎం కేజ్రీవాల్‌ను జైళ్లో పెట్టడం అన్యాయమని ఢిల్లీలో రాహుల్ గాంధీ అంటుంటే.. రాష్ట్రంలో రేవంత్‌రెడ్డి మాత్రం ఎమ్మెల్సీ కవిత అరెస్ట్‌ను కరక్టేనని అంటున్నారు. రాహుల్…గుజరాత్ మోడల్ బక్వాస్ అంటే.. రేవంత్ గుజరాత్ అభివృద్ధి బాగుందంటున్నారు. రాహుల్.. అదానిని ఫ్రాడ్ అంటే.. రేవంత్‌రెడ్డి దోస్త్ అంటాడు. ఒక టీవీ చానల్ చర్చలో.. మోదీకి ఓటువేస్తానని ఓ వ్యక్తి అంటే.. వేసుకో అని రేవంత్ అన్నారు.
కాంగ్రెస్‌కు చెందిన వ్యక్తి బీజేపీకి ఓటేస్తానంటే.. వేసుకో అంటారా… బీజేపీని గెలిపించాలన్న ఉద్దేశంతోనే మల్కాజిగిరి, చేవెళ్ల, మెదక్ తదితర స్థానాల్లో డమ్మీ అభ్యర్థులను పోటీకి పెట్టారు. ఈ సారి ఎన్నికల్లో 400 సీట్లు వస్తాయని మోదీ చెబుతున్నారు. 420 సీట్లలో పోటీ చేస్తే.. 400 సీట్లు వస్తాయా…ఎన్డీఏకు 200 కంటే ఎక్కువ సీట్లు సాధించే సత్తా లేదు. రాహుల్ గాంధీ నాయకత్వంలోని కాంగ్రెస్ 150 కంటే ఎక్కువ సీట్లను సాధించలేదు. మోదీని ఎదుర్కొనే సత్తా కాంగ్రెస్ లేదు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని సొంత నియోజకవర్గం అమేథీని విడిచిపెట్టి రాహుల్ గాంధీ కేరళకు వెళ్లి పోటీ చేస్తున్నారు.
బీజేపీ అధికారంలోకి వచ్చిప్పుడు రూ.400 ఉన్న సిలిండర్ ధర, నేడు రూ.1200లకు, పెట్రోల్ ధర రూ.70 నుంచి రూ.115కు, డీజిల్ రూ.60 నుంచి రూ.95కు పెరిగాయి. మోదీ అధికారంలోకి వచ్చిన కొత్తలో అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు రూ.100 డాలర్లు ఉండేది. కానీ ఇప్పుడు రూ.84కు తగ్గింది. క్రూడ్ ఆయిల్ ధర తగ్గితే.. పెట్రోల్, డీజిల్ రేట్లు తగ్గాలా లేదా.. నల్లధనం వెలికి తీస్తాం.. ప్రతి వ్యక్తి ఖాతాలో రూ.15 లక్షలు వేస్తాం.. ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తాం.. ఇల్లు కట్టిస్తాం.. బుల్లెట్ రైళ్లు తెస్తాం.. రైతుల ఆదాయాన్ని డబుల్ చేస్తాం.. అమెరికా వాళ్లే భారత్‌కు వచ్చేందుకు వీసా కోసం పోటీ పడేలా చేస్తాం.. అని మోదీ ప్రగల్భాలు పలికి గద్దెనెక్కారు. పదేండ్లలో చేసిందేమీలేదు.
దేవుడిని అడ్డం పెట్టుకొని బీజేపీ రాజకీయం చేస్తున్నది. చేసిన అభివృద్ధి ఏమీలేదు. అయోధ్య రామమందిరాన్ని అడ్డుపెట్టుకుంటున్నది. మీరే కట్టారా ఆలయాన్ని.. మేం కట్టలేదా యాదాద్రి లక్ష్మీనర్సింహస్వామి ఆలయాన్ని. అయినా ఎప్పుడూ గుడి అడ్డుపెట్టుకొని రాజకీయం చేయలేదు. 10 ఏండ్లు అధికారంలో ఉన్న బీజేపీ రాష్ర్టానికి చేసేందేమీ లేదు. బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏండ్లలో హైదరాబాద్‌లో 36 ైఫ్లైఓవర్లు కడితే.. మోదీ ప్రభుత్వం ఉప్పల్, అంబర్‌పేట ైఫ్లై ఓవర్లను పూర్తి చేయలేదు. జేబీఎస్ నుంచి తూంకుంట వరకు భయంకరమైన ట్రాఫిక్ ఉంటుంది. స్కైవే ఏర్పాటు చేస్తామని బీఆర్ఎస్ సర్కారు రక్షణ శాఖ భూములు కావాలని అడిగితే ఇవ్వలేదు. రాష్ట్ర అభివృద్ధికి సహకరించని బీజేపీకి ఓట్లు అడగటానికి సిగ్గు ఉండాలి.
మల్కాజిగిరికి రేవంత్ రెడ్డి చేసిందేమీ లేదు. కొడంగల్‌లో ఓడిపోయిన రేవంత్‌రెడ్డికి ఇక్కడి ప్రజలు ఎంపీగా అవకాశం కల్పించారు. ఆ దయతోనే పీసీసీ అధ్యక్షుడిగా, సీఎంగా అయ్యారు. అన్ని ఇచ్చిన మల్కాజిగిరికి రేవంత్ ఏం చేశారు. పార్లమెంట్లో మల్కాజిగిరి అభివృద్ధి కోసం కొట్లాడలేదు. సమస్యలను పరిష్కరించలేదు. వరదలు వస్తే పత్తా లేకుండా పోయారు. కనీసం ముఖం కూడా చూపెట్టలేదు. వలస పక్షులకు అవకాశం కల్పిస్తే ఇలానే ఉంటుంది. స్థానికంగా ఉండే రాగిడి లక్ష్మారెడ్డిని గెలిపించాలి. మీ ఓటు అభివృద్ధికా.. అబద్ధానికా అనేది నిర్ణయించుకోవాలి.
ఈ ఎన్నికల్లో నన్ను ఎంపీగా గెలిపిస్తే అన్నగా, తమ్ముడిగా, కుటుంబసభ్యుడిగా ఉంటా. స్థానికంగా ఓటు హక్కులేని కాంగ్రెస్ అభ్యర్థి సునీతారెడ్డికి ఓట్లు అడిగే హక్కు లేదు. హుజురాబాద్‌లో చెల్లని ఈటల రాజేందర్.. మల్కాజిగిరిలో చెల్లుతారా.. ఈటలను గెలిపిస్తే..రేవంత్ రెడ్డి లాగానే మల్కాజిగిరి ప్రజలను మోసం చేస్తారు.
– మల్కాజిగిరి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి
కాంగ్రెస్, బీజేపీ దొందు దొందే. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల్లోనే తాగు, సాగునీరు కనిపించడం లేదు. చెరువులు ఎండిపోయాయి.కాంగ్రెస్, బీజేపీలకు ఓటుతో బుద్ధి చెప్పాలి. రాగిడి లక్ష్మారెడ్డి గెలుపు కోసం ప్రతి కార్యకర్త సైనికుడిలా పని చేయాలి.
– ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి