హనుమకొండ చౌరస్తా : తెలంగాణ రాష్ట్ర స్థాయి అండర్-14 ఇయర్స్ బాక్సింగ్ ( Boxing ) బాలుర టోర్నమెంట్ కం సెలక్షన్స్ పూర్తయ్యాయి. హనుమకొండ జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో మూడురోజుల పాటు ఎంపిక పోటీలు నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల నుంచి 111 మంది క్రీడాకారులు పాల్గొనగా 11 మంది ఎంపికైనట్లు ఎస్జీఎఫ్ సెక్రెటరీ వి.ప్రశాంత్‌కుమార్ ( Secretary Prashanthkumar ) తెలిపారు.
ఈనెల 26 నుంచి 31 వరకు మధ్యప్రదేశ్ గుణాలో జరిగే జాతీయస్థాయి ( National Level ) పోటీల్లో ఎంపికైన క్రీడాకారులు పాల్గొంటారని వివరించారు. ఈ సందర్భంగా మెపా రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కొత్తగట్టు శ్రీనివాస్ మాట్లాడుతూ శారీరక దృఢత్వానికి, ఆరోగ్యంగా ఉండడానికి క్రీడలు ఎంతో దోహదపడతాయని అన్నారు. ఎంపికైన క్రీడాకారులు ప్రతిభ కనబరిచి జాతీయస్థాయిలో తెలంగాణ రాష్ట్ర కీర్తిని ఇనుమడింపజేయాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో పుట్ట మోహన్‌రెడ్డి, అబ్జర్వర్ కే.ఉప్పలయ్య, స్విమ్మింగ్ అసోసియేషన్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు మంచాల స్వామిచరణ్, బాక్సింగ్ కన్వీనర్, టిజిపేట అధ్యక్షుడు శీలం పార్థసారధి, భూపాలపల్లి డీవైఎస్వో సీహెచ్.రఘు, రిటైర్డ్ఆర్మీ, ఎన్ఐఎస్ డిప్లొమా కోచ్ నరేందర్ దేవ్, బాక్సింగ్ అసోసియేషన్ సెక్రటరీ పి.నర్సింలు, ఇంటర్నేషనల్ బాక్సర్ అవినాష్, బి.లింగమూర్తి, బి.సతీష్, హెచ్.కుమారస్వామి, కోచ్‌లు హెచ్.శ్రీకాంత్, ఎస్.సాంసన్, ప్రభు, రాజు, ఎం.రమేశ్ పాల్గొన్నారు.