కటిక పేదరికంలో మగ్గుతున్న కుటుంబాల్లో వెలుగులు నింపేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటున్నది. అప్పుడే పుట్టిన బిడ్డ మొదలుకొని వృద్ధాప్యం వరకు అండగా ఉంటున్నది. ఒంటరి మహిళలు, వితంతువులు, దివ్యాంగులు, రైతులు, వృద్ధులు, కుల వృత్తులకు ఇలా అన్ని వర్గాల వారి సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నది. పింఛన్లను అందిస్తూ వెన్నుదన్నుగా నిలుస్తున్నది. ఇంటింటికీ పారదర్శకంగా సంక్షేమ ఫలాలు అందుతుండడంతో ప్రజలూ సంబురపడుతున్నారు. అన్నలా, కొడకులా, మేనమామగా కష్టకాలంలో ఆదుకుంటున్న సీఎం కేసీఆర్ చల్లగా ఉండాలని, మళ్లీ ఆయనే ముఖ్యమంత్రి అవ్వాలని కోరుకుంటున్నారు.
– వర్ధన్నపేట, మార్చి 16
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో పేదలు లబ్ధి పొందుతున్నారు. గత ప్రభుత్వాల హయాంలో పథకాలు లబ్ధిదారులకు చేరాలంటే దళారుల బెడద తీవ్రంగా ఉండేది. బీఆర్ఎస్ ప్రభుత్వం సంక్షేమ ఫలాలు నేరుగా లబ్ధిదారులకే చేరేందుకు ఆన్లైన్ విధానాన్ని అనుసరిస్తున్నది. ఆసరా పింఛన్లు, కల్యాణలక్ష్మి, రైతుబంధు, రైతుబీమా తదితర పథకాలు పారదర్శకంగా అందుతున్నాయి. దీంతో ప్రజలూ సంబురపడుతున్నారు. ఆసరా పథకంలో వికలాగులకు రూ.3,016, వృద్ధులు, వితంతువులకు రూ.2,016 నెలనెలాఇస్తున్నది. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకం ద్వారా రూ.1,00,116 ఆర్థికసాయం అందిస్తున్నది. రైతులకు ఎకరాకు రూ.5వేల చొప్పున ఏడాదిలో రెండు దఫాలు రైతుబంధు పథకం ద్వారా ఖాతాల్లో జమ చేస్తున్నది. రైతు ఏ కారణంతో మృతిచెందినా రైతుబీమా పథకం ద్వారా రూ.5లక్షలు అందిస్తున్నది.
వర్ధన్నపేట : తెలంగాణ వచ్చినంక రాష్ట్రంలో రైతులకు మేలు జరుగుతాంది. అన్నదాతల తిప్పలు గుర్తించిన ప్రభుత్వం సంక్షేమ పథకాలతో పాటు సౌలతులు పెంచింది. పంటలను ఆరబెట్టుకొనేందుకు భూముల కాడ్నే సర్కారు కల్లాలను కట్టించింది. ఇంతకుమునుపు సరిగ్గా ఆరబెట్టని వడ్లను మార్కెట్‌కు తీసుకుపోయి ఇబ్బందులు పడేది. కానీ ప్రభుత్వం కల్లాన్ని నిర్మించుకొనేందుకు రూ.85వేల ఆర్థిక సాయం చేస్తుండడంతో కల్లం నిర్మించుకున్నం. ఇప్పుడు ఆరబెట్టుకోవడం, నిల్వ చేసుకోవడం తేలికైంది.
– తక్కళ్లపల్లి సత్యనారాయణరావు, ఆదర్శరైతు, వర్ధన్నపేట
పేద కుటుంబాలకు చెందిన తల్లులకు ప్రభుత్వం కేసీఆర్ కిట్టు ద్వారా అండగా నిలుస్తున్నది. ప్రభుత్వ దవాఖానలో ప్రసూతి చేయించుకున్న మహిళలకు 13 రకాల వస్తువులతో కూడిన కేసీఆర్ కిట్టును వైద్య ఆరోగ్యశాఖ అందిస్తున్నది. అంతేకాక అబ్బాయి పుడితే రూ.12వేలు, అమ్మాయి పుడితో రూ.13వేలు ఇస్తున్నది. 2021వ సంవత్సరంలో వర్ధన్నపేట సీహెచ్‌సీ, నర్సంపేట ఏరియా దవాఖానలో 1,082 మందికి కేసీఆర్ కిట్లను అందించింది. 2022లో 1300 పైచిలుకు మందికి కిట్లు అందాయి.
దేశానికే అన్నంపెట్టే రైతుల కుటుంబాలకు రైతుబీమా భరోసానిస్తున్నది. రైతు ఏ కారణంతో మృతిచెందినా వారం రోజుల్లో అతడి కుటుంబానికి రూ.5లక్షలను ప్రభుత్వం అందిస్తున్నది. జిల్లాలో 2018 సంవత్సరంలో మృతి చెందిన 299 మంది రైతు కుటుంబాలకు రూ.14.95కోట్లను ప్రభుత్వం అందించింది. అలాగే 2019లో 383 రైతు కుటుంబాలకు రూ.19.15కోట్లు, 2020లో 623 కుటుంబాలకు రూ.31.15కోట్లు, 2021లో 472 కుటుంబాలకు రూ.23.60కోట్లు, 2022లో 178మంది రైతుల కుటుంబాలకు 8.90కోట్లను బీమా పరిహారంగా అందజేసింది. కుటుంబ పెద్ద మృతి చెందినప్పటికీ బాధిత రైతు కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలువడంతో రైతులు, మేధావులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
దివ్యాంగులు, వృద్ధులు, ఒంటరి మహిళలు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు కుటుంబాలపై ఆదారపడి ఇబ్బందులకు గురికాకుండా ప్రభుత్వం ఆసరా పథకంతో అండగా నిలుస్తున్నది. దివ్యాంగులకు రూ.3.0116, ఇతరులకు రూ.2.016 ప్రతి నెలా పింఛన్ అందిస్తుండడంతో ఆత్మాభిమానంతో జీవనం సాగిస్తున్నారు. జిల్లా పరిధిలో మొత్తం 1.27లక్షల మందికి ఆసరా పింఛన్లు అందుతున్నాయి. ప్రతి నెలా రూ.28కోట్ల86లక్షలు పోస్టాఫీస్‌ల ద్వారా పేదలకు పంపిణీ చేస్తున్నది.
ఆరుగాలం కష్టపడి పంటలు పండించే రైతులకు అండగా నిలిచేందుకు ప్రభుత్వం రైతుబంధు పథకాన్ని అమలు చేస్తున్నది. గత పాలకుల వివక్షతో తెలంగాణలోని భూములు బీళ్లుగా మారి రైతన్న ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుపోయాడు. కానీ తెలంగాణ ప్రభుత్వం 8 సంవత్సరాలుగా పంట పెట్టుబడి కోసం సంవత్సరంలో రెండు దఫాలుగా నగదు అందిస్తున్నది. గత వానకాలంలో జిల్లాకు చెందిన లక్షా45వేల 305 మందికి ఎకరాకు రూ.5వేల మొత్తం రూ.133 కోట్ల 97 లక్షలను విడుదల చేసింది. ప్రస్తుత యాసంగిలో 1,43,048 మందికి రూ. 128 కోట్ల 59 లక్షలను అందించింది.
ప్రభుత్వాలు, పాలకులు మారినా పేద దళిత కుటుంబాల ఆర్థిక పరిస్థితులు మాత్రం మారడం లేదు. ఈ క్రమంలో తెలంగాణ ప్రభుత్వం వెనుకబడిన దళిత కుటుంబాలను ఆదుకునేందుకు దేశంలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా ‘దళితబంధు’ పథకాన్ని అమలు చేస్తున్నది. పేద కుటుంబానికి నేరుగా రూ.10లక్షల విలువైన కోరుకున్న యూనిట్‌ను అందిస్తున్నది. లబ్ధిదారులు వ్యాపారం, ట్రాక్టర్లు, ఇతర వాహనాలను కొనుగోలు చేసి కుటుంబాలను పోషించుకుంటున్నారు. నర్సంపేట నియోజకవర్గ పరిధిలో 100 యూనిట్లు, పాలకుర్తి నియోజకవర్గంలోని రాయపర్తి మండలానికి 20 యూనిట్లు, పరకాల నియోజకవర్గంలోని గీసుగొండ, సంగెం మండలాలకు 30 యూనిట్లు, వరంగల్ తూర్పు నియోజకవర్గంలోని ఖిలావరంగల్, వరంగల్ మండలాలకు 100 యూనిట్లు అందజేసింది. అలాగే, వర్ధన్నపేట నియోజకవర్గ పరిధిలోని పర్వతగిరి, వర్ధన్నపేట మున్సిపాలిటీ, ఖిలావరంగల్, వరంగల్ మున్సిపాలిటీ పరిధిలో 53 మందికి దళితబంధు యూనిట్లను మంజూరు చేసింది. మొదటి విడుతలో జిల్లాలో మొత్తం 303 యూనిట్లను మంజూరు చేయడంతో పలు కుటుంబాలు ఉపాధి పొందుతున్నాయి.
పేద, ధనిక అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ పండుగలను జరుపుకోవాలని ప్రభుత్వం ఆడపడుచులకు చీరెలు అందిస్తున్నది. 18 ఏళ్లు పైబడిన వారికి బతుకమ్మ పండుగ సందర్భంగా చీరెలు పంపిణీ చేస్తున్నది. అలాగే ముస్లింలకు రంజాన్ కానుకలు, విందును ఇవ్వడంతో పాటు క్రైస్తవులకు క్రిస్మస్ కానుకలను అందిస్తున్నది. అలగే, ఉద్యోగ విరమణ వయసును 58 నుంచి 61 సంవత్సరాలకు పెంచింది. లక్షలాది మంది కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయడంతో పాటు అంగన్వాడీలు, హోమ్ గార్డులు, వీఆర్ఏల వేతనాలను కూడా పెంచి వారి కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలిచింది.
ధాన్యాన్ని ప్రభుత్వం మద్దతు ధరతో కొనుగోలు చేస్తుండడంతో రైతులకు మేలు జరుగుతున్నది. గతంలో దళారులు ధాన్యం కొనుగోలు విషయంలో రైతులను మోసం చేసేవారు. దీనికి చెక్ పెట్టేందుకు ప్రభుత్వమే ప్రతి గ్రామంలో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి పూర్తిస్థాయిలో ధాన్యం కొనుగోలు చేస్తున్నది. గత వానకాలంలో సుమారు 35,745 మంది రైతుల నుంచి లక్షా 67వేల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసింది. రైతులకు రూ.340 కోట్లను చెల్లించింది. దీంతో రైతులకు మేలు జరుగడంతో పాటు ధాన్యం కొనుగోలు చేసిన మహిళా సంఘాలు, పీఏసీఎస్‌లు, మార్కెట్లకు కూడా ఆర్థిక ప్రయోజనం కలుగుతున్నది.
సమైక్య రాష్ట్రంలో కుదేలైన కులవృత్తులకు తెలంగాణ ప్రభుత్వం జీవం పోస్తున్నది. ప్రధానంగా చేపలు పడుతూ జీవనం సాగించే మత్స్యకారులకు ప్రత్యేక ప్రాధాన్యమిస్తున్నది. ప్రతి ఏటా కార్మికులు లక్షల రూపాయలు వెచ్చించి చేప విత్తనాలను కొనుగోలు చేయడంతో వారిపై ఆర్థిక భారం పడుతున్నది. దీన్ని గమనించిన రాష్ట్ర ప్రభుత్వం ఏటా చేప విత్తనాలను చెరువులు, రిజర్వాయర్లలో ఉచితంగా కలుపుతున్నది. 2021-22 సంవత్సరంలో జిల్లా పరిధిలోని 681 చెరువులు, రెండు రిజర్వాయర్లలో సుమారు రూ.89.17లక్షల విలువైన 1.16 కోట్ల చేప పిల్లను ఉచితంగా కలిపింది. 2022-23 సంవత్సరంలో రూ.1.30కోట్ల విలువైన 1.91 కోట్ల చేప పిల్లలను చెరువుల్లో పోసింది. దీంతో జిల్లాలోని మత్స్యకారులు, 178 మత్స్యకార సొసైటీలు ఆర్థికంగా లబ్ధి పొందుతున్నాయి.
ఆడబిడ్డల పెళ్లిళ్లు చేసేందుకు పేద కుటుంబాల తల్లిదండ్రులు ఆర్థిక ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలకు శ్రీకారం చుట్టారు. ఆడబిడ్డ వివాహానికి ఈ పథకం కింద రూ.1,00,116 అందిస్తున్నది. ఇప్పటి వరకు జిల్లాలో 27,447 మందికి కల్యాణలక్ష్మి పథకం ద్వారా, 3,396 మంది షాదీముబారక్ ద్వారా లబ్ధి పొందారు.
ప్రభుత్వ స్థలాలు ఉన్న గ్రామాల్లో ప్రభుత్వం డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను నిర్మించి నిరుపేదలకు ఉచితంగా అందించింది. పాలకుర్తి నియోజకవర్గ పరిధిలోని రాయపర్తిలో ప్రభుత్వం 518 డబుల్ బెడ్రూమ్ ఇండ్లను నిర్మించింది. ఇందులో ఇప్పటికే కొన్నింటిని పంపిణీ చేశారు. మరో 120 గృహాలను పూర్తి చేసి పేదలకు అందించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. సంగెం మండలం రామచంద్రాపురం గ్రామంలో ప్రభుత్వం 80 ఇండ్లు నిర్మించి పేదలకు పంపిణీ చేసింది. ఇంటి స్థలం ఉన్న పేదవారికి రూ.3లక్షల ఆర్థిక సహాయం అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
రైతులకు సబ్సిడీపై విద్యుత్ మోటర్లను పంపిణీ చేసేందుకు నర్సంపేటను పైలట్ ప్రాజెక్టుగా ప్రభుత్వం ఎంపిక చేసింది. 2018-19 సంవత్సరంలో 2,584 మంది రైతులకు రూ.15వేల సబ్సిడీతో మోటర్లను అందజేశారు. అలాగే ప్రస్తుతం 5,184మంది రైతులకు విద్యుత్ మోటర్ల పంపిణీని ప్రారంభించారు. త్వరలోనే జిల్లా మొత్తం పంపిణీ చేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నదని అధికారులు చెబుతున్నారు.
సెలూన్, లాండ్రీ షాపుల నిర్వాహకులకు ప్రభుత్వం చేయూతనిస్తున్నది. సెలూన్లు, లాండ్రీషాపులకు నెలకు 250 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ను అందిస్తున్నది. కుల వృత్తిపై ఆధారపడి జీవించే వీరు ప్రతి నెల విద్యుత్ బిల్లులను చెల్లించేందుకు ఆర్థిక ఇబ్బందులకు గురయ్యేవారు. దీన్ని గుర్తించిన ప్రభుత్వం షాపుల నిర్వాహకులు 250 యూనిట్ల వరకు విద్యుత్‌ను వాడుకున్న వారికి బిల్లులు మాఫీ చేసింది. అలాగే ఎస్సీ, ఎస్టీలకు గృహావసరాలకు 101 యూనిట్ల వరకు ఉచితంగా వాడుకునే సదుపాయం కల్పించింది. తండాలు, ఎస్సీ కాలనీల ప్రజలు లబ్ధిపొందుతున్నారు.
కంటి వెలుగు పథకం జిల్లాలో విజయవంతంగా కొనసాగుతున్నది. పేదలకు ఉచితంగా కంటి పరీక్షలు చేసి అద్దాలను అందిస్తున్నది. నెల రోజులుగా సాగుతున్న కంటి వెలుగు శిబిరాల్లో ఇప్పటి వరకు సుమారు 2,58,249 మంది కంటి పరీక్షలు చేయించుకున్నారు.