కొత్తగూడ/గంగారం/బయ్యారం/గార్ల, జూలై 30 :మహబూబాబాద్ జిల్లాలోని పలు మండలాల్లో సోమవారం రాత్రి నుంచి మంగళవారం ఉదయం వరకు భారీ వర్షం కురిసింది. వాగులు, వంకలు పొంగిపొర్లడంతో పాటు పలు చెరువులు మత్తడి దుంకాయి. ఏజెన్సీ ప్రాంతం జలదిగ్బంధంలో చిక్కుకోగా, పలు గ్రామాలకు రాకపోకలు పూర్తిగా స్తంభించాయి. కొత్తగూడ, గంగారం మండలాల్లో అత్యధికంగా 10.24 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.
కొత్తగూడ-నర్సంపేట ప్రధాన రహదారిలోని గాదెవాగు, గుంజేడు వాగులు, ఇల్లందు-కొత్తగూడ మధ్యలోని బూర్కపల్లి, కొత్తగూడ-కొత్తపల్లి మధ్యలోని వాగు పొంగి పొర్లడంతో రాకపోకలు నిలిచిపోయాయి. పలువురు ఉపాధ్యాయులు వాగులు దాటి పాఠశాలలకు వెళ్లారు. ప్రజలు వాగులు దాటకుండా అధికారులు ట్రాక్టర్లను అడ్డుపెట్టారు. బయ్యారం మండలంలోని వట్టెవాగు, పందిపంపుల, మశి వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి.
మశివాగు నీరు రహదారి పైకి చేరడంతో కంబాలపల్లి, లక్ష్మీపురం, మిర్యాలపెంట గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. గంగారం మండలంలో వరద తాకిడికి మక్కజొన్న పంట నేలవాలింది. జంగాలపల్లి తండాకు చెందిన అజ్మీరా శాంతి ఇంట్లోకి వర్షపు నీరు చేరి వస్తువులు తడిసిపోయాయి. బయ్యారం పెద్ద చెరువు మత్తడి పడుతుండగా, తులారం ప్రాజెక్ట్, గౌరారం, వట్టెవాగు కట్టు, పెద్ద గుట్టపై పాండవుల, చింతోనిగుంపులోని వంకమడుగు జలపాతాలు కనువిందు చేస్తున్నాయి.
గార్ల మండలంలోని పాకాల ఏరు చెక్‌డ్యాం పైనుంచి ఉధృతంగా ప్రవహిస్తున్నది. రాంపురం శివారులోని చెక్‌డ్యాం నిండడంతో 15 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. స్థానిక సీఐ రవి కుమార్, ఎస్సై జీనత్ కుమార్ చెక్‌డ్యాం వద్ద బారికేడ్లు ఏర్పాటు చేసి రాకపోకలను నిలువరించారు.