వరంగల్, మార్చి 11: స్వచ్ఛ ఆటోలకు వెహికల్ ట్రాకింగ్ తప్పనిసరిగా ఉండేలా చర్యలు తీసుకోవాలని గ్రేటర్ వరంగల్ కమిషనర్ ప్రావీణ్య అధికారులను ఆదేశించారు. కార్పొరేషన్ కార్యాలయంలో ప్రజారోగ్యం, ఇంజినీరింగ్ అధికారులతో శుక్రవారం ఆమె సమావేశం నిర్వహించారు. పారిశుధ్య వ్యవస్థను సమర్థవంతంగా నిర్వహించేందుకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ప్రావీణ్య మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగులు, ఔట్ సోర్సింగ్ సిబ్బందికి బయోమెట్రిక్ అటెండెన్స్ ఆధారంగానే వేతనాలు చెల్లిస్తామని తెలిపారు. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం బల్దియా పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల్లో మరుగుదొడ్ల నిర్వహణను ప్రణాళికాబద్ధంగా చేపట్టాలని ఆదేశించారు. ట్రెడ్ లైసెన్స్‌లను నిబంధనల మేరకు రివైజ్డ్ చేయాలన్నారు. చెత్త సేకరణ చార్జీలను సవరించేలా చూడాలన్నారు. చివరి మజిలీలో పార్థివదేహాలను తరలించేందుకు రెండు వైకుంఠ రథాలను వెంటనే కొనుగోలు చేయాలని ఆదేశించారు. సమావేశంలో చీఫ్ ఎంహెచ్వో డాక్టర్ రాజారెడ్డి, డీఈ సంజయ్‌కుమార్, సూపరిటెండెంట్లు దేవేందర్, ఆనంద్, ఐటీ మేనేజర్ రమేశ్ పాల్గొన్నారు.
కరీమాబాద్: ప్రభుత్వం ఏర్పాటు చేసిన మంకీఫుడ్ కోర్టులోని మొక్కలను పరిరక్షించాలని గ్రేటర్ కమిషనర్ ప్రావీణ్య తెలిపారు. 40వ డివిజన్లోని మంకీఫుడ్ కోర్టును ఆమె ఆధికారులతో కలిసి పరిశీలించారు. కార్పొరేటర్ మరుపల్ల రవి డివిజన్లోని పలు రహదారులు అన్యాక్రాంతమైనట్లు ఆమె దృష్టికి తీసుకెళ్లగా మార్కింగ్ చేసి అభివృద్ధి చేయాలన్నారు.