జనగామ, నవంబర్ 23 (నమస్తే తెలంగాణ)/హనుమకొండ : గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణ లో కీలమైన సర్పంచులు, వార్డు సభ్యుల రిజర్వేషన్లు ఆదివారం కొలిక్కి రావడంతో ఇన్నాళ్ల ఉత్కంఠకు తెరపడింది. ప్రక్రియలో ముఖ్య ఘట్టం ముగిసి ఏ గ్రామానికి ఏ రిజర్వేషన్ అన్నది స్పష్టత రావడంతో పోటీ చేసేందుకు ఆశావహులు సన్నద్ధమవుతున్నారు. మరోపక్క పంచాయతీ సమరానికి అధికార యం త్రాంగం కూడా చకచకా అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నది. ఎన్నికల నిర్వహణకు సంబంధించి ప్రక్రియ, ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలు వంటి అంశాలపై కసరత్తు ప్రారంభించింది.
గ్రామపంచాయతీలు, వార్డు సభ్యుల పదవులలకు సంబంధించి రిజర్వేషన్ల ప్రక్రియలో మహిళా స్థానాలపై వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో లాటరీ పద్ధతిలో కేటాయించారు. ప్రభుత్వం విడుదల చేసిన జీవో 46 తోపాటు సుప్రీంకోర్టు తీర్పు, డెడికేషన్ కమిటీ సిఫారసు ఆధారంగా ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రిజర్వేషన్లపై పంచాయతీరాజ్ శాఖ మార్గదర్శకాలను అనుసరించారు. వార్డు సభ్యులు, సర్పంచుల పదవులకు 2011 జనాభా లెక్కలతోపాటు 2024లో నిర్వహించిన సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, కుల గణ సర్వే ప్రాతి పదికగా తీసుకున్నారు. వార్డు సభ్యుల రిజర్వేషన్లు, మహిళా స్థ్థానాల కేటాయింపులు ఎంపీడీవోల సమక్షంలో, సర్పంచుల రిజర్వేషన్లు, మహిళా స్థానా ల కేటా యింపుల ప్రక్రియను ఆర్డీవోల సమక్షంలో జరిగాయి. ప్రస్తుత గ్రామపంచాయతీ ఎన్నికల్లో గతం లో మాదిరిగా 50శాతం రిజర్వేషన్లతో ఎన్నికలు జరగనున్నాయి.
50శాతం స్థానాలు ఎస్సీ, ఎస్టీలు, బీసీలకు, మిగిలిన 50శాతం జనరల్ కేటగిరీ స్థానాలకు కేటాయించారు. అన్నింట్లో సగం స్థానాలను మహిళలకు రిజర్వ్ చేశారు. మొన్నటి వరకు జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు జరుగు తాయనుకుంటే హఠాత్తుగా పంచాయతీ ఎన్నికల ఘట్టం తెరపైకి రావడంతో తాజా మాజీ సర్పంచ్‌లతోపాటు రిజర్వేషన్లు అనుకూ లించిన కులాల నుంచి పోటీదారుల పేర్లు బయటకు వస్తుండటంతో పల్లెల్లో ఎన్నికల హడావుడి మొదలైంది. జనగామ జిల్లాలోని 12 మండలాల పరిధిలో 280 గ్రామపంచాయ తీలు, వరంగల్‌లోని 11 మండలాల పరిధిలో 317, హనుమ కొండలోని 12 మండలాల్లోని 210, జయశంకర్ భూపాలపల్లిలోని 12 మండలాల్లో 248, ములుగులోని 10 మండలాల్లో 171, మహబూబాబాద్‌లోని 18 మండలాల్లో 280 జీపీలకు ఎన్నికలు నిర్వహించనున్నారు
2011 జనాభా లెక్కల ప్రకారం ఎస్సీ, ఎస్టీ, 2024 ఎస్ఈఈఈపీసీ జనాభా లెక్కల ఆధారంగా బీసీ సర్పంచ్ల రిజర్వేషన్లు కేటాయించారు. ఎంపీడీవో సమక్షంలో వార్డు సభ్యుల రిజర్వేషన్లు ఖరారు చేసి గ్రామంలోని ఎస్టీ, ఎస్సీ, బీసీ జనాభా శాతాన్ని వేర్వేరుగా లెక్కించారు. జనాభా శాతం అధికంగా ఉన్న వార్డులను ముందుగా రిజర్వ్ చేసి మొదట ఎస్టీ, తర్వాత ఎస్సీ, అనంతరం బీసీలకు కేటాయింపులు చేసి మిగలిన వార్డులు సాధారణ జరనల్గా ప్రకటించారు. రిజర్వ్ అయిన వార్డుల్లో 50శాతం మహిళలకు లాటరీ ద్వారా కేటాయించి గత ఎన్నికల్లో మహిళలకు రిజర్వ్ అయిన వార్డులను సాధ్యమైనంత వరకు మళ్లీ రాకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.
ఆర్డీవోల సమక్షంలో జనాభా ఆధారంగా మొదట ఎస్టీ జనాభా ఎక్కువగా ఉన్న గ్రామాలను ప్రాధాన్యతగా తీసుకొని ఆర్డర్ ఆఫ్‌గా జనాభా తక్కువగా ఉన్న గ్రామాల నుంచి ఎస్సీ, తర్వాత బీసీ రిజర్వేషన్లు ప్రకటించి మిగిలిన గ్రామాలు జనరల్ కేటగిరీ పరిధిలోకి తీసుకున్నారు. రిజర్వ్ అయిన సర్పంచ్ స్థానాల్లో 50 శాతం మహిళలకు కేటాయింపులు చేయగా, 100 శాతం ఉన్న ఎస్టీ గ్రామాల్లో సర్పంచ్ రిజర్వేషన్లు వారికే కేటాయించారు. 2019 తర్వాత ఏర్పడిన కొత్త గ్రామ పంచాయతీల్లో మొదటి సాధారణ ఎన్నికలుగా పరిగణించి రిజర్వేషన్లను పూర్తిగా కొత్తగా కేటాయించడంతో గత రిజర్వేషన్లు అక్కడ వర్తించవు. 2019లో రిజర్వ్ చేసి ఎన్నికలు జరగని సందర్భాల్లో మాత్రం అ క్కడ పాత రిజర్వేషన్లను అదేవిధంగా కొనసాగించారు.
జనగామ జిల్లాలో ప్రతి విడతలో నాలుగు మండలాలు ఉండేలా విభజించి మొత్తం మూడు విడతల్లో ఎన్నికలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. మొదటి విడత జనగామ, లింగాలఘనపురం, నర్మెట, తరిగొప్పుల మండలాల్లోని 74 గ్రాపంచాయతీలు, 668 వార్డుల్లో, రెండో విడత బచ్చన్నపేట, దేవరుప్పుల, పాలకుర్తి, కొడకండ్ల మండలాల పరిధిలోని 117 పంచాయతీలు, 1038 వార్డులు, మూడో విడత చిల్పూరు, స్టేషన్‌ఘన్‌పూర్, రఘునాథపల్లి, జఫర్గడ్ మండలాల్లోని 89 జీపీలు, 828 వార్డుల పరిధిలో పోలింగ్ జరుగుతాయి. జిల్లాలో మొత్తం 280 జీపీలు, 2534 వార్డులు ఉండగా మొత్త్తం 4,01,101 ఓటర్లు, 1,98,448 పురుషులు, 2,02,648 మహిళలు, 5 ఇతరులు ఉన్నారు.
హనుమకొండ జిల్లాలోని 12 గ్రామీణ మండలాల పరిథిలో 210 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. వీటిలో 1986 వార్డులు ఉండగా, మొత్తం 3,70,187 మంది ఓటర్లు ఉన్నారు. వీరి కోసం 1986 పోలింగ్ స్టేషన్లను గుర్తించారు. వంద శాతం ఎస్టీ జనాభా ఉన్న ఐదు గ్రామాల్లో రెండు మహిళలకు, మూడు జనరల్ స్థానాలకు కేటాయించారు. ఎస్టీ స్థానాలకు సంబంధించి మహిళకు ఒకటి, జనరల్ రెండు, ఎస్సీ మహిళలకు 23, 29 జనరల్, బీసీ మహిళలకు 19, జనరల్ స్థానాలకు 26 కేటాయించా రు. అదేవిధంగా అన్ రిజర్వ్డ్ (జనరల్ స్థానాలు)కు సంబంధించి మహిళలకు 49, జనరల్ స్థానాలకు 56 ఖరారు చేశారు.