శాయంపేట, డిసెంబర్ 11 : మీరు చూస్తున్నది ఈ చిన్ని యంత్రం హార్వెస్టరే. ఇదేమిటి కొత్తగా ఉందనుకుంటున్నారా? అవును నిజమే. చైన్‌తో ఉండే ఈ మెషీన్ ఎంత బురదలోనైనా చొచ్చుకెళ్లి వరి కోస్తుంది. అసలు చెప్పాలంటే బురదలో వరి కోయడమే దీని ప్రత్యేకత. సాధారణంగా టైర్లతో ఉన్న హార్వెస్టర్లు భారీ ఎత్తుతో ఉంటాయి. ఇవి రోడ్లపై వెళ్లడమూ కష్టమే. అలాగే బురద ఉన్నా పొలంలోకి వెళ్లి కోయడం సాధ్యపడదు. కానీ ఈ చిన్నపాటి హార్వెస్టర్ మాత్రం బురదలోకి వెళ్లి చకచకా పంటను కోసేయగలదు.
ప్రస్తుతం కోతలు చివరి దశకు వచ్చిన క్రమంలో శాయంపేట మండలం మాందారిపేటలో ఓ రైతు పొలంలో ఈ హార్వెస్టర్ కనిపించింది. చిన్నగా ఉన్నా బాహుబలిలా దూసుకెళ్తున్నది. ధర్మసాగర్, జనగామ, స్టేషన్‌ఘన్‌పూర్ తదితర ప్రాంతాల నుంచి మినీ హార్వెస్టర్లను తీసుకొచ్చి రైతులు పంటను కోయిస్తున్నారు. ఈ హార్వెస్టర్ పొలం కోయాలంటే బావి మోటరు వేసి నీటితో నింపితే సునాయాసంగా తిరుగుతూ వరిని కోస్తుంది. వరి కోతకు గంటకు రూ.3800 అద్దె చెల్లిస్తున్నట్లు రైతులు తెలిపారు.