సంగెం, జూలై 7: గ్రామాల సమగ్రాభివృద్ధే సీఎం కేసీఆర్ లక్ష్యమని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. మండల సర్వసభ్య సమావేశం శుక్రవారం రైతు వేదికలో ఎంపీపీ కందకట్ల కళావతి అధ్యక్షతన జరిగింది. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే హాజరై సమీక్షించారు. విద్యుత్‌శాఖ అధికారులు నివేదిక చదువుతుండగా.. వీఆర్ఎన్తండా సర్పంచ్ బిచ్చానాయక్ కరెంట్ వైర్లు చేతికందే ఎత్తులో ప్రమాదకరంగా ఉన్నాయని తెలిపారు. చింతలపల్లిలో ఇండ్లపై నుంచి 11 కేవీ వైర్లు ఉన్నాయని, వాటిని మార్చాలని ఎంపీటీసీ పావని అదికారుల దృష్టికి తీసుకొచ్చారు. ఎల్గూర్‌రంగంపేటలో లూజ్ లైన్ల సమస్య ఉందని సర్పంచ్ ప్రభాకర్ సభ దృష్టికి తీసుకొచ్చారు.
విద్యుత్ సమస్యను వెంటనే పరిష్కరించాలని ఎమ్మెల్యే చల్లా అధికారులను ఆదేశించారు. గవిచర్లలో మంజూరైన విద్యుత్ సబ్‌స్టేషన్ పనులను త్వరలోనే ప్రారంభించేలా చర్యలు చేపట్టాలని సూచించారు. ఎల్గూర్రంగంపేటకు ఏఎన్ఎం లేరని, ఇన్చార్జి రావడం లేదని సభ దృష్టికి తీసుకొచ్చారు. ఎంఈవో ఎన్ విజయ్‌కుమార్ మాట్లాడుతూ మండలంలో మన ఊరు-మన బడి కార్యక్రమంలో 17 పాఠశాలలు ఎంపికైనట్లు తెలిపారు. ఇందులో కాపులకనపర్తి పాఠశాలలో ఇప్పటి వరకు పనులు ప్రారంభం కాలేదన్నారు. ఆర్డబ్ల్యూఎస్ ఏఈ వేణు నివేదిక ఇస్తుండగా.. ఎమ్మెల్యే ధర్మారెడ్డి మాట్లాడుతూ మొండ్రాయిలో ఎందుకు నీరు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. గ్రామంలో నీటి సమస్య లేకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. మొండ్రాయి ప్రాంతానికి పశువైద్యశాల ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని డాక్టర్ రాజు సభ దృష్టికి తీసుకొచ్చారు.
హార్టికల్చర్ అధికారిని సంగెం మండలానికి కేటాయించాలని జడ్పీటీసీ సుదర్శన్‌రెడ్డి ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. ఎంపీపీ కందకట్ల కళావతి మాట్లాడుతూ రైతులు ఏ పంటలు వేస్తున్నారో ఏఈవోలు విధిగా ఆన్లైన్ చేయాలన్నారు. రైతులు సన్న వడ్లనే సాగు చేయాలని కోరారు. పల్లార్గూడలో సబ్‌సెంటర్‌ను ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. గ్రామాల్లో పెండింగ్ పనులను వెంటనే పూర్తి చేయాలని ప్రజాప్రతినిధులు, అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు. మండలంలో పంట నష్టపోయిన 7500 ఎకరాలకు రూ. 10 వేల చొప్పున నష్టపరిహారం త్వరలోనే అందుతుందన్నారు. పాఠశాలలను బలోపేతం చేసేందుకు ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. సర్వసభ్య సమావేశంలో జడ్పీటీసీ గూడ సుదర్శన్‌రెడ్డి, వైస్ ఎంపీపీ బుక్క మల్లయ్య, ఎంపీడీవో వెంకటేశ్వర్రావు, ఇన్చార్జి తహసీల్దార్ రాజేశ్వర్‌రావు, రైతుబంధు సమితి మండల కోఆర్డినేటర్ కందకట్ల నరహరి, ఎంపీవో కొమురయ్య, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.