ఎందరినో పతనం చేసిన గంజాయి కిక్కు ఇప్పుడు యువతనూ వదలడం లేదు. చదువు కోసం పట్టణాలకు వచ్చిన విద్యార్థులు ఈ మహమ్మారి బారిన పడుతున్నారు. ఒకరిని చూసి మరొకరు కొత్త మత్తుకు అలవాటుపడుతున్నారు. స్కూల్ స్థాయి నుంచి ఉన్నత విద్యను అభ్యసిస్తున్న వారే టార్గెట్‌గా స్మగ్లర్లు విక్రయాలు చేపడుతున్నారు. యూత్‌కు డబ్బుల ఆశ చూపి సప్లయ్ రొంపిలోకి దింపుతున్నారు. నగర శివారు ప్రాంతాలను అడ్డాలుగా చేసుకొని యథేచ్ఛగా కార్యకలాపాలను కొనసాగిస్తున్నారు. కొద్దికాలం వరకు నగరానికే పరిమితమైన ఈ మహమ్మారి పల్లెలపైనా పంజా విసురుతోంది. ఇటీవల వరంగల్ కమిషనరేట్ పరిధిలో గంజాయి కేసుల్లో పట్టుబడిన వారంతా మైనర్లు, 30 ఏళ్లలోపు వారే కావడం విస్మయానికి గురిచేస్తున్నది. గంజాయి రవాణాపై పోలీసులు ఉక్కుపాదం మోపినా దందా ఆగడం లేదు. వరంగల్ సీపీ సీరియస్‌గా ఉన్నా కిందిస్థాయి సిబ్బంది నిర్లక్ష్యంతో దీనికి అడ్డుకట్ట పడడం లేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
– సుబేదారి, ఆగస్టు 6
గంజాయి స్మోకింగ్ ఇప్పుడు యూత్‌కు కొత్త కిక్కుగా మారింది. ఇప్పటి వరకు నగరానికే పరిమితమైన గంజాయి వినియోగం గ్రామాల్లోనూ పెరిగిపోతున్నది. స్కూల్ స్థాయి నుంచి ఇంటర్, డిగ్రీ, పీజీ, పాలిటెక్నిక్, బీటెక్, ఫార్మసీ తదితర ఉన్నత విద్యనభ్యసిస్తున్న విద్యార్థులు దీనికి బానిసలవుతున్నారు. వరంగల్‌లో రాత్రి సమయంలో కాజీపేట, వరంగల్ రైల్వేస్టేషన్ పరిసర ప్రాంతాలు, వరంగల్, హనుమకొండ బస్‌స్టేషన్ ఆవరణలు, వరంగల్‌లోని ఉర్సు గుట్ట, చిన్నవడ్డేపల్లి చెరువు, రంగశాయిపేట బెస్తం చెరువు, ఖిలావరంగల్ గుండు చెరువు, రాతికోట, ఎనుమాముల మార్కెట్ శివారు, కాకతీయ కెనాల్ ప్రాంతాలు, హనుమకొండలోని బంధం చెరువు, న్యూశాయంపేట రైల్వే ట్రాక్, ఔటర్ రింగ్ రోడ్డు, పలివేల్పుల, వడ్డేపల్లి చెరువు కట్ట, హాస్టల్స్, అద్దె రూములను అడ్డాగా చేసుకొని గుంపులు, గుంపులుగా గంజాయి స్మోకింగ్ చేస్తున్నారు. ఇటీవల పోలీసులు స్మోకర్స్పై నిఘాపెట్టి చాలామందిని పట్టుకున్నప్పటికీ విచ్చవిడిగా కొనసాగుతూనే ఉంది. అమ్మాయిలు సైతం గంజాయి మత్తుకు అలవాటు పడుతున్నట్లు తెలిసింది.
స్మగ్లర్లు ఇతర రాష్ర్టాల నుంచి గంజాయిని గుట్టుగా నగరానికి తీసుకొస్తున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి నగరానికి చదువుకోడానికి వచ్చిన విద్యార్థులే టార్గెట్‌గా విక్రయాలు సాగిస్తున్నారు. నగర శివారు ప్రాంతాలను అడ్డాలుగా చేసుకొని కావాల్సిన వారికి సప్లయ్ చేస్తున్నారు. దీనికి తోడు పేద, మధ్య తరగతి విద్యార్థులకు డబ్బుల ఆశ చూపి వారితో గంజాయి ప్యాకెట్లు రవాణా చేయిస్తున్నట్లు తెలిసింది. వీరంతా కాలేజీ బ్యాగుల్లో గంజాయి ప్యాకెట్లను పెట్టుకొని రహస్య ప్రాంతాల్లో స్మోక్ చేసే యువతకు అందజేస్తున్నట్లు సమాచారం.
గంజాయి, ఇతర డ్రగ్స్ నియంత్రణకు కేంద్ర ప్రభుత్వం యాంటీ నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో వ్యవస్థను తీసుకురాగా, దేశంలో తొలిసారిగా కేసీఆర్ ప్రభుత్వం హైదరాబాద్‌లో అమలులోకి తీసుకొచ్చింది. అయితే కొద్ది నెలలుగా రాష్ట్రంలో గంజాయి మత్తులో దాడులు పెరిగిపోతున్న నేపథ్యంలో ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి పోలీసు కమిషనరేట్ పరిధిలో యాంటీ నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరోను ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. ఇందుకోసం అధునాతమైన పరికరాలను అందజేస్తామని చెప్పింది. కానీ అది ఆచరణలో జరగడం లేదు. ఈ వ్యవస్థ వరంగల్‌కు వస్తే గంజాయి, ఇతర మత్తు పదార్థాల నియంత్రణ మరింత సులభతరం అవుతుందని ఓ పోలీసు అధికారి చెప్పారు.
గంజాయి రవాణా, స్మోకింగ్ కేసులు ఎక్కువ కావడంతో వరంగల్ సీపీ అంబర్ కిషోర్‌ఝా ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకున్నారు. జూలై 14న రిజర్వు ఇన్స్పెక్టర్, ముగ్గురు ఆర్ఎస్సైలు, సిబ్బందితో డ్రగ్స్ కంట్రోల్ టీంను ఏర్పాటు చేశారు. గంజాయి రవాణా చేసే, సేవించే వారి సమాచారాన్ని 8712584473కు తెలపాలని ప్రజలకు సూచించారు. గంజాయి నియంత్రణ విషయంలో సీపీ సీరియస్ నిర్ణయాలు తీసుకున్నప్పటికీ క్షేత్రస్థాయిలో కొంత మంది ఇన్స్పెక్టర్లు, ఏసీపీలు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ఈ దందా నిరంతరం కొనసాగుతున్నట్లు తెలుస్తున్నది. లా అండ్ ఆర్డర్ పోలీసులు పట్టించుకోకపోవడంతో టాస్క్‌ఫోర్స్ పోలీసులే నిఘా పెట్టి నిందితులను పట్టుకుంటున్నారని అధికారులు చెబుతున్నారు. కాగా, గంజాయి రవాణా, సేవనం విషయంలో ఈ ఏడాది జనవరి నుంచి ఈనెల 20 వరకు 35 కేసులు నమోదు చేసి 80 మందిని అరెస్ట్ చేసినట్లు వరంగల్ పోలీసు కమిషనరేట్ అధికారులు తెలిపారు.