లింగాలఘనపురం, ఏప్రిల్ 11 : పోరాడి సాధించుకున్న రాష్ట్రంలో సీఎం కేసీఆర్ చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలతో గ్రామాలు, పట్టణాలకు అవార్డులు వస్తున్నాయని ఎమ్మెల్సీ కడియం శ్రీహరి అన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి పనులను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అడుగడుగునా అడ్డుకుంటున్నా తెలంగాణకు అవార్డులు వస్తూనే ఉన్నాయని స్పష్టం చేశారు. జాతీయస్థాయిలో ఉత్తమ గ్రామపంచాయతీ అవార్డు అందుకున్న మండలంలోని నెల్లుట్ల సర్పంచ్ చిట్ల స్వరూపారాణి, గ్రామ కార్యదర్శి రొండ్ల శ్రీనివాస్‌రెడ్డిని మంగళవారం ఆయన అభినందించారు. ఈ సందర్భంగా సర్పంచ్ నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కడియం శ్రీహరి మాట్లాడారు. సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న ‘పల్లెప్రగతి’ కార్యక్రమాలు సత్ఫలితాలిస్తున్నాయని అన్నారు.
దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రజలకు మౌలిక వసతులు కల్పిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అన్నారు. తొమ్మిదేళ్లలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణకు ఏం చేసిందో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. జాతీయ స్థాయిలో ప్రకటించిన దీన్‌దయాల్ స్వచ్ఛ అవార్డుల్లో రాష్ర్టానికి ఎనిమిది రావడం మనకెంతో గర్వకారణమన్నారు. లింగాలఘనపురం మండలం నెల్లుట్లకు పురస్కారం రావడం ఆనందకరమన్నారు. ఆరు దశాబ్దాల్లో సాధించని అభివృద్ధి, సంక్షేమాన్ని కేవలం ఎనిమిదేళ్లలో సీఎం కేసీఆర్ చేసి చూపించారని అన్నారు.
బీజేపీ, కాంగ్రెస్ నేతలు దద్దమ్మలు
తెలంగాణలో బీజేపీ, కాంగ్రెస్ నాయకులు దద్దమ్మలని, రాష్ట్రంలో ఎంతో అభివృద్ధి జరుగుతున్నా కళ్లుండి చూడలేకపోతున్నారని ఎమ్మెల్సీ కడియం శ్రీహరి ఎద్దేవా చేశారు. తెలంగాణ నుంచి కేంద్రంలో మంత్రిగా ఉన్న కిషన్‌రెడ్డి, బీజేపీ ఎంపీలు రాష్ర్టానికి నిధులు తీసుకొస్తున్నారా ? అని ప్రశ్నించారు. విభజన చట్టం హామీలు నెరవేర్చడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందన్నారు. దేశంలో ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పిన మోదీ తొమ్మిదేళ్లలో ఒక్క పోస్టు కూడా భర్తీ చేయలేదన్నారు. టీఎస్పీఎస్, పదో తరగతి ప్రశ్నపత్రాల లీకేజీలో బీజేపీ కుట్ర ఉందన్నారు. బీజేపీ ఈ నెల 15న నిరుద్యోగులతో మార్చ్ నిర్వహిస్తామనడం సిగ్గుచేటన్నారు. పని చేసే నాయకుడికి ప్రజల్లో ఆదరణ ఉంటుందని, ఇందుకు సీఎం కేసీఆర్ నిదర్శనమన్నారు.
రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమాన్ని అడ్డుకుంటున్న బీజేపీని రాజకీయంగా బొంద పెట్టాలన్నారు. విద్య, విద్యుత్, ఆరోగ్యంలో దేశంలోనే మన రాష్ట్రం రెండో స్థానంలో నిలిచిందన్నారు. సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంతో తొమ్మిదేళ్లలో పంటల విస్త్రీర్ణం పెరిగిందన్నారు. ఇవి విపక్షాలకు కనిపించడంలేదా అని ఆయన ప్రశ్నించారు. ఇటీవల హైదరాబాద్‌లో ప్రధాని మోదీ ప్రసంగించిన తీరు విడ్డూరంగా ఉందన్నారు. తెలంగాణలో సీఎం కేసీఆర్ పాలనే ప్రజలకు శ్రీరామరక్ష అన్నారు. ఈ సమావేశంలో నాయకులు చిట్ల భూపాల్‌రెడ్డి, కొమ్మరాజుల నర్సింహులు, దుంబాల భాస్కర్‌రెడ్డి, వంగ నాగరాజు, కారంపూరి చంద్రయ్య, ఏదునూరి వీరన్న, చౌదరిపల్లి విజయభాస్కర్, సిద్ధులు, వేముల కృష్ణారెడ్డి, సోమనర్సయ్య, సంపత్‌రెడ్డి, శ్రీధర్, దేవేంద్ర, మోహన్‌రెడ్డి, స్రవంతి, నాగరాజు, మదారు తదితరులు పాల్గొన్నారు.